బట్టతల పోగొట్టుకునేందుకు వెళితే.. ఉన్న జుట్టు ఊడింది

బట్టతల ఉన్నవారికి కొత్త వెంట్రుకలు మొలిపిస్తానని నమ్మబలికి ఢిల్లీకి చెందిన వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు.;

Update: 2025-04-07 09:33 GMT

బట్టతల ఉన్నవారికి కొత్త వెంట్రుకలు మొలిపిస్తానని నమ్మబలికి ఢిల్లీకి చెందిన వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రకటనలు గుప్పించి హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఫ్రెండ్స్ షాపుకు రావాలని చెప్పాడు. అతని మాటలు నమ్మిన వందలాది మంది యువకులు ఆశతో అక్కడికి చేరుకున్నారు.

అక్కడ ఒక్కొక్కరి దగ్గర రూ. 100 వసూలు చేసి, అందరికీ గుండు గీయించాడు. ఆ తర్వాత కొన్ని రసాయనాలను వారి తలకు రాసి పంపించాడు. అంతేకాదు, గుండుపై రాసిన రసాయనాలు చెరిగిపోకుండా అలాగే ఉంచుకోవాలని షరతు కూడా పెట్టాడు. అతను చెప్పినట్టు కొంతమంది కొన్ని రోజుల పాటు గుండుతోనే ఉన్నారు.

అయితే, ఆ తర్వాత అసలు కథ మొదలైంది. షకీల్ రాసిన రసాయనాలకు కొంతమంది తీవ్రమైన చర్మ సమస్యలను ఎదుర్కొన్నారు. తలపై బొబ్బలు రావడం, చర్మం ఎర్రగా మారడం వంటి రియాక్షన్లు వచ్చాయి. బట్టతలపై వెంట్రుకలు మొలుస్తాయనుకుంటే, ఉన్న కొద్దిపాటి వెంట్రుకలు కూడా ఊడిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

తమను మోసం చేసిన వ్యక్తి పై చర్య తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వందలాది మంది యువకులు తమకు జరిగిన అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి మోసపోయిన బాధితులు ఇప్పుడు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బట్టతల పోవడానికి ప్రయత్నించి, ఉన్న జుట్టును కూడా పోగొట్టుకున్నామని వారు వాపోతున్నారు.

Tags:    

Similar News