69 కి.మీ జాతీయ రహదారికి మర్రిశాపం.. ఐదేళ్లలో 211 మంది దుర్మరణం

గ్రావెల్ టిప్పర్.. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఉదంతంలో 21 మంది నిండు ప్రాణాలు పోయిన విషాదం అందరిని షాక్ కు గురి చేస్తోంది.;

Update: 2025-11-04 06:30 GMT

గ్రావెల్ టిప్పర్.. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఉదంతంలో 21 మంది నిండు ప్రాణాలు పోయిన విషాదం అందరిని షాక్ కు గురి చేస్తోంది. ఈ ప్రమాదం జరిగిన హైదరాబాద్ - బీజాపూర్ నేషనల్ హైవేకు సంబంధించి పెద్దగా ఫోకస్ కాని షాకింగ్ వాస్తవాలు బయటకు వచ్చాయి. అప్పా జంక్షన్ నుంచి తాండూరు వరకు 69 కి.మీ. దూరం ఉండగా.. ఇందులో 50 ప్రమాదకర మలుపులు ఉండటం గమానార్హం. రహదారి.. అందునా జాతీయ రహదారి అన్నప్పుడు మలుపులు పెద్దగా లేకుండా స్ట్రెయిట్ గా ఉండాల్సిన అవసరం ఉంది.

పేరుకు నేషనల్ హైవే కానీ.. బోలెడన్ని ప్రమాదకర మలుపులు ఉండటంతో తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ కారణంగా గడిచిన ఐదేళ్లలో 720 ప్రమాదాలు జరగ్గా.. 211 మంది మృత్యువాత పడటమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. వారంలో మూడు నుంచి ఐదు ప్రమాదాలు జరగటం.. పాలకులు వీటిని సీరియస్ గా తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ రోడ్డు చరిత్రలోకి వెళితే.. నిజాం కాలంలో నిర్మించిన ఈ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని కలబురగి.. బీజాపూర్ లతో పాటు వికారాబాద్ జిల్లాకు వేళ్లేందుకు ఈ మార్గమే కీలకం. టూరిస్టు ప్రాంతమైన అనంతగిరి కొండలకు వెళ్లేందుకే ఈ రోడ్డు మీదనే వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ మార్గంలో రాకపోకలు విపరీతంగా పెరిగాయి. రద్దీ పెరిగింది. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు బీటీ రోడ్లు వేస్తూ వచ్చాయేతప్పించి.. ట్రాఫిక్ అవసరాలకు తగ్గట్లు విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టలేదు.

2018లో కేంద్ర ప్రభుత్వం దీన్ని నేషనల్ హైవే 163గా మార్చింది. రూ.785 కోట్లతోఅప్పా జంక్షన్ నుంచి వికారబాద్ జిల్లా మన్నెగూడ వరకు ఉన్న 46.40కి.మీ. రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించేందుకే వీలుగా శంకుస్థాపన చేసినప్పటికి విస్తరణ పనులు ముందుకుసాగలేదు. దీనికి కారణం.. ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో ఉండే మర్రిచెట్లు కూడా కారణం. రహదారి విస్తరణ కోసం మర్రిచెట్లను తీసివేస్తే.. పర్యావరణమైన ఇబ్బందులు తలెత్తుతాయంటూ కొందరు ఎన్జీటీని.. కోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో మర్రిచెట్లను తొలగించేందుకు అనుమతులు లభించలేదు. దీంతో రోడ్డు విస్తరణ కార్యక్రమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.అయితే.. రెండు రోజుల క్రితం రోడ్డు విస్తరణ కోసం మర్రిచెట్లను తొలగించాల్సి వస్తే.. రీలొకేట్ చేస్తామని.. పర్యావరణానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వటంతో ఎన్జీటీ స్టేను ఎత్తి వేసింది. పనులు మొదలు కానున్న సమయంలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అందుకు ఈ ప్రాంతంలో ప్రయాణించే వారు మర్రిశాపం తమకు తగలకూడదని ప్రార్థనలు చేస్తారని చెబుతుంటారు.

Tags:    

Similar News