హనీమూన్ ట్రిప్‌లో ట్విస్ట్ : రొమాన్స్ మిస్సైందంటూ భార్య సంచలన నిర్ణయం

పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఏకాంతంగా గడపడానికి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు.

Update: 2026-06-09 09:30 GMT

పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఏకాంతంగా గడపడానికి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఆ మధుర జ్ఞాపకాలతో జీవితాంతం కలిసి నడవాలని ఆశిస్తారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. హనీమూన్‌తో మరింత దగ్గరవ్వాల్సిన ఒక కొత్త జంట అదే హనీమూన్ కారణంగా విడాకుల వరకు వెళ్లాల్సివచ్చింది. భర్త చేసిన ఒకే ఒక్క పని ఆ కొత్త కాపురంలో చిచ్చు పెట్టింది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న ఈ డైవర్స్ కేసు వివరాలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. అంతేకాకుండా కొత్త పెళ్లికొడుకులకు ఓ హెచ్చరికలా కూడా ఉందని అంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఒక యువతికి, దేశ రాజధాని ఢిల్లీకి చెందిన యువకుడితో ఘనంగా వివాహమైంది. పెళ్లయిన కొత్తలో ప్రతి జంటలాగే వారు కూడా తమ హనీమూన్ కోసం ఎన్నో కలలు కన్నారు. అందమైన ప్రదేశానికి వెళ్లి ఏకాంతంగా గడపాలని ఆ నయా పెళ్లికూతురు ఆశపడింది. భర్త కూడా హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు. హనీమూన్ ట్రిప్‌కు కేవలం భార్యాభర్తలు ఇద్దరే వెళ్లాల్సింది పోయి.. భర్త తన తల్లిదండ్రులు, తోబుట్టువులను కూడా వెంటబెట్టుకొచ్చాడు. ట్రిప్ మొత్తం ఫ్యామిలీ ప్యాకేజీలా మారిపోవడంతో ఆ నవవధువు తీవ్ర అసంతృప్తికి లోనైంది. కొత్తగా పెళ్లయిన తనకు భర్తతో కనీసం మనసు విప్పి మాట్లాడుకునే, ఏకాంతంగా గడపే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆమె తీవ్రంగా కలత చెందింది.

నేరుగా కోర్టుకు..

ట్రిప్ ముగిసిన తర్వాత భార్యాభర్తల మధ్య ఈ విషయమై తీవ్ర వివాదం రేగింది. హనీమూన్‌కు కుటుంబ సభ్యులందరినీ తీసుకురావడం ఏంటి? నాతో ఏకాంతంగా గడపడం నీకు ఇష్టం లేదా? అంటూ ఆ భార్య నిలదీసింది. అయితే, భర్త మాత్రం తన తప్పును ఒప్పుకోకుండా సమర్థించుకున్నాడు. ‘నా కుటుంబంతో కలిసి ట్రిప్‌కు వెళ్తే తప్పేంటి? వారు కూడా మనతో సంతోషంగా గడిపారు కదా’ అంటూ వాదించాడని అంటున్నారు. భర్త వైఖరితో విసిగిపోయిన భార్య, ఇక అతనితో కలిసి జీవించలేనంటూ నేరుగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.

కౌన్సెలింగ్ జరిగినా నో చేంజ్!

భార్య పిటిషన్ తో ఈ కేసు హాట్ టాపిక్ అవుతోంది. హనీమూన్ ట్రిప్ తో తనను నిరాశకు గురిచేసిన భర్త నుంచి విడిపోవాలని భావించిన యువతి విడాకులు ఇప్పటించాల్సిందిగా కోరుతోంది. ఈ కేసు ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు కౌన్సెలింగ్ పరిధిలో ఉంది. భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చేందుకు కౌన్సిలర్లు ఇప్పటివరకు మూడు సార్లు కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించినా, ఇరుపక్షాల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు. తనకు కనీస ప్రైవసీ ఇవ్వని వ్యక్తితో నేను కలిసి ఉండలేను అంటూ యువతి గట్టిగా వాదిస్తుండగా.. కుటుంబాన్ని ప్రేమించడం తప్పెలా అవుతుందని భర్త పట్టు బడుతున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి భవిష్యత్తును తేల్చేందుకు త్వరలోనే నాలుగో కౌన్సెలింగ్ సెషన్ జరగనుందని అంటున్నారు. ఈ సెషన్‌లోనైనా వీరిద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా? లేక ఈ హనీమూన్ ట్రిప్ విడాకుల వరకు లాగుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News