కుటుంబ నియంత్రణపై సౌత్ మాటకు భిన్నంగా హోంశాఖ రిపోర్టు

జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లను కేటాయించొద్దని దక్షిణాది రాష్ట్రాల వాదనకు భిన్నంగా కేంద్ర హోంశాఖ నివేదిక ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.;

Update: 2026-04-21 06:36 GMT

జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లను కేటాయించొద్దని దక్షిణాది రాష్ట్రాల వాదనకు భిన్నంగా కేంద్ర హోంశాఖ నివేదిక ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలో జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణ పాటించాయని.. అందుకే జనాభా తగ్గిపోయినట్లుగా దక్షిణాది రాష్ట్రాలు వాదనను వినిపిస్తున్నాయి. రాష్ట్రాల్లో సంతాన సాఫల్య నిష్పత్తి (టీఎఫ్ఆర్) ఉత్తరాది కంటే ఎక్కువగా పడిపోయినట్లుగా చెబుతూ.. అందుకే జనాభా తగ్గినట్లుగా చెబుతున్నారు.

ఈకారణంగానే 1971 జనాభా నిష్పత్తి ఆధారంగా సీట్లు కేటాయించాలన్న వాదనను వినిపిస్తున్నారు దక్షిణాది నేతలు. అయితే.. హోం శాఖ నివేదిక వెల్లడించిన వివరాలు చూస్తే.. సౌత్ మాత్రమే కాదు.. ఉత్తరాదికి చెందిన చాలా రాష్ట్రాల్లోనూ సంతాన సాఫల్య నిష్పత్తి తగ్గిన వైనాన్ని స్పష్టం చేస్తూ గణాంకాలు కనిపిస్తున్నాయి. ఇంతకూ సంతాన సాఫల్య నిష్పత్తిని ఎలా లెక్కిస్తారు? జాతీయస్థాయిలో సరాసరి ఎంత? దక్షిణాది రాష్ట్రాల్లో ఎంత? ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంత? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. విషయం మరింత వివరంగా అర్థమవుతుందని చెప్పాలి.

ఒకరి జీవిత కాలంలో ఎంతమంది పిల్లలు జన్మిస్తున్నారు? అన్న దాని ఆధారంగా సంతాన సాఫల్య నిష్పత్తిని లెక్కిస్తారు. కుటుంబ నియంత్రణ బాగా అమలయ్యే రాష్ట్రాల్లో ఇది తక్కువగా ఉంటుంది. 2020 లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సగటు టీఎఫ్ఆర్ ‘2’కు పరిమితమైంది. అందులో 12 రాష్ట్రాలల్లో టీఎఫ్ఆర్.. అంతకంటే తక్కువగా నమోదైనట్లుగా 2024-25 వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది.

ఈ రిపోర్టు ప్రకారం మూడు రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ 1.4.. ఆరు రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ 1.5 వద్ద నమోదైనట్లుగా పేర్కొన్నారు. ఈ లెక్క ప్రకారం..పన్నెండు రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నట్లే. దేశంలోని 22 పెద్ద రాష్ట్రాల్లో రెండు శాతం కంటే ఎక్కువ టీఎఫ్ఆర్ ఉన్న రాష్ట్రాల్లో

బిహార్ 3.0

యూపీ 2.7

మధ్యప్రదేశ్ 2.6

రాజస్థాన్ 2.4

జార్ఖండ్ 2.4

ఛత్తీస్ గఢ్ 2.2

అస్సాం 2.1

అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన గుజరాత్.. హర్యానాలో జాతీయ సగటుగా చెప్పిన 2కే పరిమితమైంది. ఈ రాష్ట్రాలు కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైంది. దీంతో.. జనాభా నియంత్రణ అన్నది కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉందన్న వాదనతో పస లేదన్న విషయం కేంద్ర హోంశాఖ రిపోర్టు చెబుతుందని చెప్పాలి. ఇక.. అతి తక్కువ టీఎఫ్ఆర్ నమోదైన రాష్ట్రాల విషయానికి వస్తే.. 1.4, 1.5కే పలు రాష్ట్రాలు పరిమితమయ్యాయి. దేశంలో అతి తక్కువగా(1.4) ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ నమోదైతే.. ఆ తర్వాత స్థానంలో నిలుస్తున్న 1.5గా ఆరు రాష్ట్రాలు నిలుస్తున్నాయి. అవేమంటే..

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

హిమాచల్ ప్రదేశ్

జమ్మూకశ్మీర్

కేరళ

మహారాష్ట్ర

పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక.. కర్ణాటక (1.6), ఒడిశా, ఉత్తరాఖండ్ 1.8గా నిలిచాయి.అంటే.. టీఎఫ్ఆర్ అన్నది కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే అన్న వాదనలో నిజం లేదన్న విషయాన్ని కేంద్ర హోంశాఖ రిపోర్టు స్పష్టంగా చెప్పిందని చెప్పాలి.

Tags:    

Similar News