అస్సాం మామ హిమంత్...బీజేపీకి సక్సెస్ రిలీఫ్
అస్సాం ప్రజలతో మామ అని ఎంతో ఆప్యాయంగా పిలిపించుకునే ఏకైక నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ.;
అస్సాం ప్రజలతో మామ అని ఎంతో ఆప్యాయంగా పిలిపించుకునే ఏకైక నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ. ఆయన 2021లో తొలిసారి బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు 2026 లో మరోసారి జనం వద్దకు వెళ్ళారు. తన అయిదేళ్ల పాలన చూసి ఓటేయమని కోరుతున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో ఆయన తెగ తిరుగుతున్నారు. ఆయనకు యువత మహిళల మద్దతు గణనీయంగా దక్కుతోంది. దాంతో మరోసారి బీజేపీకి ఇక్కడ గెలిపించడంలో అస్సాం మామ సూపర్ సక్సెస్ అయ్యేలా ఉన్నారని అంటున్నారు. ఈ నెల 9న అంటే మరో ఆరు రోజులలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఎన్నికల ముఖ చిత్రం అయితే కాషాయం పార్టీకి అనుకూలంగా ఉంది అని అంటున్నారు.
కాంగ్రెస్ లో ఎదిగి :
హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగి వచ్చిన నాయకుడు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు హస్తం నీడలో పెరిగి వచ్చిన వారు. అక్కడే మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి పదవికి కీలక అభ్యర్థిగా నిలిచిన వారు. కానీ కొన్ని సమీకరణాల మూలంగా ఆయనకు ఆ పదవి దక్కలేదు. అందుకే ఆయన 2016 లో కాంగ్రెస్ ని వీడి బీజేపీ వైపు వచ్చారు. ఇక నాటి నుంచి ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ కి కష్టాలు కమలానికి లాభాలు చేకూరడం మొదలయ్యాయి.
విద్యార్థి నేతగా ఉంటూ :
హిమంత బిశ్వ శర్మది ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఆయన అస్సాం రాష్ట్రం జోర్హాట్ లో జన్మించారు. 58 ఏళ్ళ ఈ నాయకుడి తండ్రి కైలాష్ నాథ్ శర్మ సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న వారు. రాజకీయం వైపు ఈ కుటుంబం ఎన్నడూ పోలేదు. కానీ హిమంత్ బిశ్వ శర్మ రాజకీయ పట్ల ఎందుకో ఇంట్రెస్ట్ కలిగింది. ఆయన కాటన్ యూనివర్సిటీ పీజీ చేసి బిఆర్ఎం ప్రభుత్వ లా కళాశాలలో న్యాయ శాస్త్రం అభ్యసించారు. ఇక గౌహతి యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పూర్తి చేశారు. పీజీ చేస్తున్న సమయంలో కాటన్ కాలేజ్ యూనియన్ సొసైటీకి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అలా విద్యార్థి రాజకీయాల నుంచే ఆయన ప్రజా జీవితం మొదలైంది అనుకోవాలి. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ లో విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించారు.
దిగ్గజ నేత కంట్లో పడి :
అప్పట్లో అంటే 1990 దశకంలో అస్సాం ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా కళ్ళలో హిమంత బిశ్వ శర్మ పడ్డారు. ఆయనను అంతగా హిమంత్ విద్యార్ధి రాజకీయాలు ఆకర్షించాయి అన్న మాట. దాంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన హిమంత్ హస్తం పార్టీలో దూసుకుని పోయారు అనే చెప్పాలి. ఆయన 2001లో జలుక్‌బరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి గెలిచారు. ఏడాది వ్యవధిలోనే మంత్రి అయిపోయారు. ఇక అదే సీటు నుంచి వరుసగా 2006, 2011, 2016 ఎన్నికల్లో గెలిచారు. ఆయనకు 2015లో తరుణ్ గొగోయ్‌తో విభేదాల కారణంగా 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. అలా బీజేపీకి అస్సాంలో అధికారం దక్కేలా తనదైన శైలిలో పనిచేశారు దానికి బహుమానంగా 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తరువాత ఆయనకు పార్టీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది.
బలోపేతం చేసిన వైనం :
హిమంత్ బిశ్వ శర్మ బీజేపీని అస్సాంలో ఎంతో పటిష్టం చేశారు. తిరుగులేని శక్తిగా మలచారు. ముందే చెప్పుకున్నట్లుగా యువత మహిళలను ఆకట్టుకుని పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకుని వెళ్ళారు. దాంతో బీజేపీ తిరుగులేని విధంగా తయారైతే కాంగ్రెస్ ఈ మేరకు వర్గ పోరుతో కునారిల్లుతూ వస్తోంది. తరుణ్ గొగోయ్ కి సవాల్ చేసి ఆ పార్టీని వదిలిన హిమంత్ కి ఇపుడు తరుణ్ గొగోయ్ కొడుకు అస్సాం పీసీసీ ప్రెసిడెంట్ గౌరవ్ గొగోయ్ పెను సవాల్ చేస్తున్నారు. ఆయన పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ కి మంచి రోజులు వచ్చాయి. ఆ పార్టీ గతం కంటే బాగానే పుంజుకుంది. కానీ బీజేపీని ఓడించే స్థాయిలో లేదని అంటున్నారు. ఈ పరిణామంతో ఈసారి కూడా బీజేపీ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని సర్వే నివేదికలు చెబుతున్నాయి.
ఈశాన్యంలో కాషాయం :
ఇక చూస్తే కనుక హిమంత్ బిశ్వ శర్మ ఈశాన్యంలో కాషాయనికి ఆశాకిరణంగా నిలిచారు. ఆయన బీజేపీలో చేరాక అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అలాగే, 2017లో మణిపూర్‌లో కూటమి ఏర్పాటు చేయడం, మేఘాలయలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించడం ద్వారా కమలం పూలను అక్కడ పూయించారు. అలాగే నాగాలాండ్‌లో బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడంలో హిమంత్ ముఖ్య పాత్ర పోషించారు. ఈసారి ఆయన గెలిచి సీఎం అయితే కనుక బీజేపీలో ఆయన పాత్ర మరింత కీలకం అవుతుంది అని అంటున్నారు.