క్లియర్ గా మంత్రి చెప్పాక వాదన ఎందుకు ఎస్పీ మేడం?
కానీ.. సమావేశంలో మంత్రి ఇచ్చిన ఆదేశాల వివరాల్ని నోట్ రూపంలో తన పై అధికారికి కానీ.. పోలీస్ బాస్ (డీజీపీ)కి కానీ సమాచారం ఇవ్వొచ్చు.;
అసాధారణ ఘటన చోటు చేసుకుంది. సమస్యల పరిష్కారానికి సంబంధించిన సమావేశంలో వేదిక మీద మంత్రి ఉన్న వేళ.. ఫిర్యాదుదారు వెల్లడించిన వివరాల అనంతరం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను సస్పెండ్ చేయాలని అదే వేదిక మీద ఉన్న ఎస్పీ మేడంకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వేళలో ఎస్పీగా వ్యవహరిస్తున్న మహిళా ఐపీఎస్ ఏం చేయాలి? అన్నది ప్రశ్న. ఆమె చేతిలో సస్పెండ్ చేసే అధికారం లేకపోవచ్చు. కానీ.. సమావేశంలో మంత్రి ఇచ్చిన ఆదేశాల వివరాల్ని నోట్ రూపంలో తన పై అధికారికి కానీ.. పోలీస్ బాస్ (డీజీపీ)కి కానీ సమాచారం ఇవ్వొచ్చు. అందుకు భిన్నంగా వేదిక మీద.. అందరి ముందు..తనకు అధికారం లేదని.. అందుకే తాను సస్పెండ్ చేయలేనని చెప్పటం.. దీని మీద మంత్రి వివరంగా చెబుతున్నా.. అదే పనిగా విషయాన్ని పొడిగించటం చూస్తే.. బ్యూరో క్రాట్స్ తీరును తప్పుపట్టాల్సిన అవసరం ఉందన్న భావన ఈ ఉదంతంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకూ ఈ వివాదం మొత్తం హర్యానాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే.. జిల్లా గ్రీవెన్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. టిట్రామ్ గ్రామానికి చెందిన సందీప్ మాలిక్ అనే వ్యక్తి.. సబ్ ఇన్ స్పెక్టర్ భూసంబంధిత మోసంలో పాలు పంచుకున్నట్లుగా ఆరోపించారు. ఈ ఉదంతంపై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ విజ్ స్పందించారు. అదే సమావేశంలో తనతో ఉన్న కైతల్ జిల్లా ఎస్పీ ఉపాసనకు సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఇలాంటి సందర్భంలో మంత్రి ఆదేశాల్ని నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావాలంటే.. సమావేశం ముగిసిన తర్వాత మంత్రిగారు చెప్పినట్లుగా సదరు అధికారిని సస్పెండ్ చేసే పవర్ తనకు లేదని చెప్పి.. సంబంధిత అధికారికి నోట్ పంపించాలని బ్రీఫ్ చేస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా వేదిక మీద నుంచే తాను సస్పెండ్ చేయలేనని.. ఎందుకంటే సదరు అధికారి తన పరిధిలోకి రాడని పేర్కొంటూ సుదీర్ఘ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న.
దీంతో స్పందించిన మంత్రి తాను సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని చెబుతున్నానని..తాను సస్పెన్షన్ కు ఆదేశాలు జారీ చేసినట్లుగా నోట్ రాయాలని చెప్పగా.. రాస్తాను సార్.. రాయగలను సార్.. కానీ నేను అతన్ని నేనే సస్పెండ్ చేయలేనని అంత వివరంగా అక్కడికక్కడే చెప్పాల్సిన అవసరం లేదు కదా? అయినప్పటికి సదరు మంత్రి స్పందిస్తూ.. సస్పెండ్ కు నేను ఈ ఆదేశాలు ఇచ్చానని డీజీపీకి రాయండి.. ఎవరు అలా చేయరో చూస్తానని చెప్పినప్పటికి.. సదరు ఎస్పీ విషయాన్ని లాగాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. పోలీసు అధికారిపై చర్యల విషయంలో మంత్రిక్లారిటీ ఉన్నా.. చిన్న విషయాన్నిచూపిస్తూ.. బహిరంగ వేదిక మీద అదే పనిగా తన వాదనల్ని వినిపించాల్సిన అవసరం లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఎవరెన్ని చెప్పినా బ్యూరో క్రాట్లు.. ప్రభుత్వంలో రాజ్యాంగానికి అనుసరించి పదవులు పొందిన వారి మాటను పాటించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంలో మహిళా ఎస్పీ అంతలా వాదించాల్సిన అవసరం లేదనే చెప్పాలి.