తెలంగాణ రాజకీయాల్లో 'బనకచర్ల' రగడ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బనకచర్ల ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని నిప్పులు చెరిగారు;

Update: 2025-07-02 10:53 GMT

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బనకచర్ల ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని నిప్పులు చెరిగారు. "తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ మాట్లాడుతున్నా, ఆయన మాటలు ప్రతిపక్ష నేతలా ఉన్నాయి" అంటూ హరీష్ ఘాటు విమర్శలు గుప్పించారు.

తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, బనకచర్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. "సీఎం రేవంత్ కూడా చర్చకు సిద్ధమా? మా మైక్ కట్ చేయకండి. నిజాలు ప్రజలకు తెలిసేలా ఉంచండి. బనకచర్లపై రేవంత్‌కు అసలైన అవగాహన లేదు. అవగాహన లేకుండానే మాట్లాడటం ద్వారా రాష్ట్రం పరువు తీస్తున్నారు" అని ఆరోపించారు.

'బ్యాగ్ మ్యాన్' నుండి 'బొంకు మ్యాన్'కి మారిన రేవంత్!

హరీష్ రావు వ్యాఖ్యలు అక్కడితో ఆగలేదు. గతంలో రేవంత్ చంద్రబాబుకు బ్యాగులు మోసేవారని, ఇప్పుడు బనకచర్ల ఒప్పందం కోసం బొంకు మ్యాన్‌గా మారిపోయారని ఆరోపించారు. "2023 జులై 6న చంద్రబాబును గోదావరి ప్రాంతానికి పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు అదే ఒప్పందాన్ని అమలు చేయడానికి రాష్ట్ర సింహాసనాన్ని వాడుతున్నారు. ఇది తెలంగాణకు ముప్పు" అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ఉత్తమ్ కుమార్ ప్రెజెంటేషన్‌పై సెటైర్లు

ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరైన ప్రెజెంటేషన్ కూడా అమరావతిలో జరిగినట్లే ఉందని హరీష్ ఎద్దేవా చేశారు. "చంద్రబాబు తయారు చేసిన పీపీటీ అని అనిపిస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు చరిత్రను ఎందుకు చూపించలేదు? బీఆర్ఎస్ పాలనలో బనకచర్లపై ఒక్క అడుగు కూడా ముందుకెళ్లలేదని రేవంత్ అంటున్నారు.. అయితే ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఎందుకు రాలేదు?" అని ప్రశ్నించారు.

రేవంత్ మాటలూ.. రాహుల్‌కు చెప్పాలి

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ చచ్చిన పాములా ఉందని చెబుతున్నారని, దీనిపై హరీష్ తనదైన శైలిలో ఎదురుదాడి చేశారు. "కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అదే లాజిక్ ప్రకారం కాంగ్రెస్ కూడా చచ్చిన పాము కాదా? ఈ లాజిక్‌ను రాహుల్ గాంధీకి చెప్పాలి" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌పై మోజేనా?

రేవంత్ మాటల్లో కేసీఆర్ పేరు లేకుండా మాట్లాడే ధైర్యం ఉందా అని హరీష్ నిలదీశారు. "ఇంటివారిపై విమర్శలు చేస్తూ బయటివారికి సద్దులు కడుతున్నారు. రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ హక్కులపై నోరు మెదపడం లేదు" అన్నారు.

బనకచర్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. రేవంత్ పై హరీష్ విమర్శలు ఘాటు స్థాయికి చేరాయి. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ప్రకటించి బీఆర్ఎస్ తిరిగి రాజకీయ పటలంపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంకేతాలు ఇచ్చింది. రేవంత్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News