కవిత ఇష్యూ వేళ హరీష్ ప్రెస్ మీట్.. ఏం చెప్పారంటే?
కవిత ఇష్యూపై మౌనం వహించినప్పటికీ, హరీష్ రావు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.;
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ లేఖలో పార్టీలో కొంతమంది "కోవర్టులు" ఉన్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావుల ప్రెస్ మీట్‌లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. అయితే, ఈ ఇష్యూపై ఇరువురు నాయకులు వ్యూహాత్మక మౌనం వహించడం గమనార్హం.
- కేటీఆర్, హరీష్ రావుల మౌనం
నిన్న జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్... కవిత లేఖ, దానిలోని అంశాలు, ఆమె వ్యాఖ్యలపై స్పందించవచ్చని అంతా ఊహించారు. కానీ, ఆయన ఎక్కడా కవిత పేరు ప్రస్తావించకుండా వ్యూహాత్మకంగా స్పందించారు. తాజాగా హరీష్ రావు కొద్దిసేపటి క్రితం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కూడా ఈ విషయంపై ఎలాంటి రియాక్షన్ లేకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. ప్రాజెక్టులు, నీళ్లపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన హరీష్, కవిత ఇష్యూపై మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం పార్టీలో ఏం జరుగుతోందనే చర్చను రేకెత్తించింది.
-గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు ఆరోపణలు
కవిత ఇష్యూపై మౌనం వహించినప్పటికీ, హరీష్ రావు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వాలు అనేకసార్లు అడ్డుపడ్డాయని, కోర్టులు, ట్రిబ్యునల్స్‌లో అనేక కేసులు వేశాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్‌ఎంబీ (కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్), జీఆర్‌ఎంబీ (గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్) అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. నియమ, నిబంధనలేవీ పాటించకుండానే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని హరీష్ నిలదీశారు. కేంద్రం జుట్టు తమ చేతిలో ఉందని రాత్రికి రాత్రే ప్రాజెక్టు రూపకల్పన చేసి, టెండర్లు పిలిచి కేంద్రం ముందు పెట్టారని హరీష్ మండిపడ్డారు.
-సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదలుపెట్టిన ప్రాజెక్టులకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అడ్డుపడ్డాయని, ఇప్పుడు కొత్త ప్రాజెక్టును నియమ, నిబంధనలను ఉల్లంఘించి ఎలా కడుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్‌లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని వాపోయిన సీఎం, ఇప్పుడెందుకు నోరు మెదపట్లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని వారికి పదవుల్లో కొనసాగే అర్హత ఉందా అని ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బనకచర్ల ప్రాజెక్టులో కలిసేవి సముద్రం నీరు కాదని, రాష్ట్రం నుంచి నీళ్లను ఎత్తుకెళ్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని, ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
-కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు
ఇప్పటికే మూసీ సుందరీకరణకు అప్పు రాలేదని, మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా ప్రశ్నార్థకంగానే ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఈ ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ గట్టిగా నిలదీస్తారని అనుకున్నానని, తీరా చూస్తే ఈ ప్రాజెక్టు ప్రస్తావనే ప్రధాని వద్ద రాలేదన్నారు. రాష్ట్రానికి నీటి నష్టం జరగబోతుంటే సీఎం, జలవనరుల శాఖ మంత్రి నోరు మెదపరేంటని హరీష్ రావు ప్రశ్నించారు. ఆల్రెడీ ప్రాజెక్టు కట్టేశాం కాబట్టి నీళ్లు తీసుకుంటామని పథకం ప్రకారం జరుగుతున్న కుట్ర అన్నారు. ఏపీలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం, తెలంగాణలో కాళేశ్వరం, మరో ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టులకు రూ.60 వేల కోట్ల వరకూ సహాయం చేస్తున్న కేంద్రం, తెలంగాణలో ప్రాజెక్టులకు ఒక్కపైసా అయినా ఇచ్చారా అని నిలదీశారు.
-బీజేపీ నేతలపై ధ్వజం
తెలంగాణ వాడుకోలేకపోవడం వల్లే ఆ నీరు కిందికి పోతుందేతప్ప, తెలంగాణ వాడుకుంటే అవి సముద్రంలోకి పోవన్నారు. తెలంగాణ నీళ్లను తీసుకెళ్తుంటే కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని అడిగారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని, అవి వరద జలాలు కావని గుర్తించి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు.
మొత్తంగా, కవిత లేఖతో ఏర్పడిన రాజకీయ వేడిని చల్లార్చేందుకు పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, అయితే, ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో ఈ ప్రెస్ మీట్‌తో స్పష్టమైంది.