గాజాలో కాల్పుల విరమణకు బ్రేక్.. అమెరికా ప్రతిపాదనను హమాస్ తిరస్కరణ!

గాజాలో కొనసాగుతున్న భీకర యుద్ధానికి తెరదించి, బందీలను విడుదల చేయడానికి అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.;

Update: 2025-05-30 10:32 GMT

గాజాలో కొనసాగుతున్న భీకర యుద్ధానికి తెరదించి, బందీలను విడుదల చేయడానికి అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించినట్లు ఆ సంస్థ నాయకుడు బీబీసీకి తెలిపారు. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ చర్చించిన అంశాలకు.. ప్రస్తుతం చేసిన ప్రతిపాదనలకు మధ్య పూర్తి వ్యతిరేకత ఉందని హమాస్ నాయకులు ఆరోపించారు. ఈ తిరస్కరణతో గాజాలో శాంతి నెలకొనే ఆశలు మరింత సన్నగిల్లాయి.

షరతులకు హమాస్ నిరాకరణ

అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ముందుకు తెచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనలో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. దీని ప్రకారం హమాస్ తమ వద్ద సజీవంగా ఉన్న 10 మంది బందీలను, అలాగే 18 మంది మృతదేహాలను రెండు దశల్లో అప్పగించాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ దీనికి ప్రతిగా 60 రోజుల పాటు కాల్పుల విరమణను పాటించడంతోపాటు, తమ ఆధీనంలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలి.

వాస్తవానికి, హమాస్ వద్ద సుమారు 58 మంది బందీలు ఉన్నారని, వారిలో కనీసం 20 మంది సజీవంగా ఉన్నారని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై అధికారికంగా స్పందించనప్పటికీ ప్రధాని నెతన్యాహూ బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ తాను ఈ ఒప్పందానికి అంగీకరిస్తానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, హమాస్ ఈ ప్రతిపాదనను తమ షరతులకు అనుకూలంగా లేదని తిరస్కరించింది.

గాజాలో విస్తృత ఆపరేషన్

ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాను పూర్తిగా మూసివేసి, మార్చి 18 నుండి ఎదురుదాడులను కొనసాగిస్తోంది. దీంతో అప్పటివరకు అమెరికా, ఖతార్, ఈజిప్ట్ సంయుక్తంగా కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమైంది. ఇటీవల మే 19 నుండి ఇజ్రాయెల్ దళాలు గాజాలో మరింత విస్తృతంగా ఆపరేషన్ చేపట్టాయి. గాజాను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంటామని అప్పట్లో నెతన్యాహూ ప్రకటించారు. గత 10 వారాల్లో దాదాపు 4,000 మంది ప్రజలు గాజాలో మరణించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి, ఇది పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

వెస్ట్‌బ్యాంక్‌లో కొత్త యూదు ఆవాసాలు

ఇక, యుద్ధ వాతావరణం మధ్యే ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో 22 కొత్త యూదు ఆవాసాల ఏర్పాటుకు ఇజ్రాయెల్ పచ్చజెండా ఊపింది. అంతేకాదు, ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మించిన అవుట్‌పోస్టులకూ చట్టబద్ధత కల్పించనుంది. ఈ మేరకు గురువారం ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ కీలక నిర్ణయం పాలస్తీనా దేశం ఏర్పడకుండా అడ్డుకుంటుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పేర్కొనడం గమనార్హం.

1967 యుద్ధంలో ఇజ్రాయెల్ వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించింది. అప్పటినుంచి అక్కడికి ఇజ్రాయెలీ పౌరులను భారీగా తరలిస్తూ, వారికోసం వందల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు, సకల సదుపాయాలూ కల్పించింది. ఈ తరలింపును వెస్ట్‌బ్యాంక్‌లోని 30 లక్షల మంది పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయెల్ తాజా నిర్ణయం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.

Tags:    

Similar News