కోర్టుకెక్కనున్న వైసీపీ...మ్యాటర్ అదేనట !

సాధారణ ఒక పార్టీ తరఫున గెలిచిన వారు ఆ సింబల్ మీద ప్రజా ప్రతినిధిగా ప్రమాణం చేసిన వారు గీత దాటితే వేటు పడుతుంది.;

Update: 2025-05-20 03:29 GMT

సాధారణ ఒక పార్టీ తరఫున గెలిచిన వారు ఆ సింబల్ మీద ప్రజా ప్రతినిధిగా ప్రమాణం చేసిన వారు గీత దాటితే వేటు పడుతుంది. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉంది. ఫిరాయింపులను ఆ విధంగా నిర్వచించారు. అయితే ఈ ఫిరాయింపులను తేల్చే విషయంలో కూడా చాలా తాళింపులు ఉన్నాయి.

కర్ర ఉన్న వాడితే బర్రె అన్న తీరున ఫిరాయించిన అందరికీ మీద వేటు పడదు. ఉదాహరణకు అధికార పార్టీ నుంచి విపక్షంలోకి వస్తే క్షణాలలో వేటు పడిపోతుంది. సభ్యత్వం కూడా కోల్పోతారు. అదే అధికార పార్టీ వైపు వెళ్తే విప్ కాదు కదా మరే బ్రహ్మాస్త్రం ప్రయోగించినా తుత్తునియలు అవుతుంది.

ఈ విధంగా చూస్తే కనుక విప్ అన్నది అధికార పక్షానికి ఏమీ చేయదని ప్రతిపక్షం ఘోషిస్తోంది. జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో ఏకంగా 27 మంది కార్పోరేటర్లు వైసీపీ జారీ చేసిన విప్ ని ధిక్కరించి మరీ కూటమి వైపు వెళ్ళి అవిశ్వాసాన్ని గెలిపించారు. అలా కూటమి బలం అనూహ్యంగా పెరిగి మేయర్ సీటు సొంతం అయింది.

ఈ నేపధ్యంలో వైసీపీ తరఫున విప్ ని ధిక్కరించిన 27 మంది మీద చర్యలు తీసుకోవాలని వారిని అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల అధికారిని కలసి వినతిపత్రం ఇచ్చినా ఈ రోజు దాకా చర్యలు లేవని అంటున్నారు.

దీని మీద ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన 27 మంది కార్పోరేటర్లకు విప్ జారీ చేశామని అన్నారు.

చట్టప్రకారం ఎన్నికల అధికారి పదిరోజుల్లో దానిపై స్పందించి ఆ 27 మందికి నోటీస్‌లు ఇచ్చి వారి స్పందనను మాకు తెలియచేయాలని అన్నారు. కానీ ఎన్నికల అధికారి నుంచి ఎటువంటి స్పందన లేదు అంటే చట్టాన్ని ఏ విధంగా కించపరుస్తున్నారు అన్నది అర్థం చేసుకోవాలని అన్నారు.

ఏ విధంగా రాజకీయ ఒత్తిళ్ళతో చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల అధికారికి రెండుసార్లు రిమైండ్ ఇచ్చామని అన్నారు. ప్రస్తుత వేసవి సెలవులు పూర్తయిన తరువాత దీనిపై న్యాయస్థానంను ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.

ఇక చూస్తే రాష్ట్రంలో ఏడాది కాలంగా అస్తవ్యస్త పాలన సాగుతోంది. అన్నిచోట్లా సంఖ్యాబలం లేకపోయినా అధికార దుర్వినియోగంతో పోలీసులను అడ్డం పెట్టుకుని, దౌర్జన్యాలతో పదవులను దక్కించుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని నిందించారు. ఏడాది కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు.

విశాఖలో చూస్తే కనుక గత ఆరు నెలలుగా జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ లేరు. ఇటువంటి కీలకమైన పోస్ట్‌లకు కూడా ఇన్‌చార్జీలను నియమించి పాలన సాగిస్తున్నారు. ఇటువంటి పాలనను ఎప్పుడూ చూడలేదని బొత్స కూటమి సర్కార్ ని నిందించారు. వైసీపీ విప్ విషయంలో కోర్టుని ఆశ్రయిస్తామని ఆయన అంటున్నారు.

మరో ఎనిమిది నెలలలో కార్పోరేటర్ల పదవీ కాలం ముగుస్తోంది. అందుకే వారంతా బేఫికర్ గా కూటమికి మద్దతు ఇచ్చారని అంటున్నారు. ఏది ఏమైనా ఎవరు అధికారంలో ఉంటే వారే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ విప్ పనిచేయడం లేదని ఆ పార్టీ నేతలు వాపోతూంటే వైసీపీ ఏలుబడిలో ఏమి చేశారని కూటమి నేతలు రివర్స్ లో ఫైర్ అవుతున్నారు.

Tags:    

Similar News