దొంగ జీవోలతో భారీ దోపిడీ.. మాజీ ఎమ్మెల్యే బొల్లాపై చీఫ్ విప్ జీవీ ఫైర్

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ స్థానిక నాయకత్వమే లక్ష్యంగా వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2026-06-01 07:32 GMT

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ స్థానిక నాయకత్వమే లక్ష్యంగా వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని రూ.1,500 కోట్ల భూ కబ్జా ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు హస్తం ఉందంటూ ఎమ్మెల్యే జీవీ ఫైర్ అయ్యారు. కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూములను కొట్టేసేందుకు దొంగ పత్రాలు సృష్టించారని మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల మధ్య అలజడులు సృష్టించేలా వైసీపీ పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

నంద్యాల ఘటనకు వైసీపీ స్క్రీన్‌ప్లే

నంద్యాలలో ఇటీవల చోటుచేసుకున్న వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విపక్షంపై మండిపడ్డారు. ఈ విధ్వంసం వెనుక పూర్తిగా వైసీపీ నాయకుల హస్తమే ఉందని ఆయన స్పష్టం చేశారు. కావాలనే పక్కా ప్రణాళికతో విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆ నెపాన్ని ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కులాలు, వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టి, రాష్ట్రంలో అశాంతిని రేపడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారని ఆయన దుయ్యబట్టారు.

రూ.1500 కోట్ల భారీ భూకుంభకోణం

ఇక వినుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హయాంలో జరిగిన భారీ అక్రమాలను జీవీ ఆంజనేయులు బయటపెట్టారు. అదేవిధంగా హైదరాబాద్ లోని విలువైన భూములను కొల్లగొట్టేందుకు ఫోర్జరీ జీవోలను సృష్టించారని ఆరోపించారు. ఈ నకిలీ జీవోల ద్వారా సుమారు రూ. 1500 కోట్ల ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను దోచుకునేందుకు పెద్ద ఎత్తున కుట్ర పన్నారని తెలిపారు. ఈ అక్రమ బండారం ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటపడటంతోనే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారయ్యారని జీవీ విమర్శించారు.

జగన్ వాటా ఎంత?

నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన భూఆక్రమణలపై కూడా ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. అక్కడ ఉన్న రెండెకరాల భూమిని వైసీపీ నేతలు అక్రమంగా కబ్జా చేశారని, ఆ దోపిడీ సొమ్ములో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందిన వాటా ఎంతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే తక్షణమే వారిని పార్టీ నుండి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కానీ వైసీపీలో మాత్రం అవినీతి, కబ్జాలకు అండగా నిలుస్తారు’ అంటూ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లుతూ విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Tags:    

Similar News