కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఖాతాలో మరో రికార్డ్!
గత ఏడాది జూన్ లో మోడీ 3.0లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరిలో అత్యంత ధనవంతుడిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నిలిచిన సంగతి తెలిసిందే.;
గత ఏడాది జూన్ లో మోడీ 3.0లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరిలో అత్యంత ధనవంతుడిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నిలిచిన సంగతి తెలిసిందే. రూ.5,705 కోట్ల ఆస్తులను ప్రకటించిన ఆయన.. గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో తన ఖాతాలో అంతకంటే గొప్ప రికార్డును చేర్చుకున్నారు!
అవును... ఏపీలో 25 మంది ఎంపీల పనితీరుపై జరిగిన ఓ సర్వేలో గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అగ్రస్థానంలో నిలిచారు. 8.9 స్కోరుతో ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో అటు ఏపీ రాజకీయాలకు, ఇటు పార్లమెంటరీ రాజకీయాలకు పూర్తిగా కొత్త, తొలిసారి ఎంపీగా గెలిచిన వ్యక్తికి ఇది ఎలా సాధ్యమైందనేది ఆసక్తిగా మారింది.
వైద్యుడు, ‘యూ వరల్డ్’ వైద్య విద్య వ్యవస్థాపకుడు అయిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.. అమెరికా నుంచి వచ్చిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థిపై 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. సరికొత్త చరిత్ర సృష్టించారు.
బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్.. ఉస్మానియాలో వైద్య విద్యను అభ్యసించి, అమెరికా వెళ్లి తిరిగి వచ్చి, తొలిసారి ఎంపీ అయ్యి, వెంటనే కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకుని.. ఏపీ ఎంపీల పనితీరులో టాప్ ప్లేస్ లో నిలవడానికి ప్రధాన కారణం... ఆయన అనవసర రాజకీయ తగాదాలకు దూరంగా ఉంటూ.. ప్రజాసేవపైనే ప్రధానంగా దృష్టి పెడతారని అంటున్నారు పరిశీలకులు.
దీనికి తోడు ఏపీ రాజధాని అమరావతి ఈయన ఎంపీగా ఉన్న ప్రాంత పరిధిలోకే రావడంతో.. ఇక్కడి రైతులు తమ ఎంపీ నుంచి బలమైన ప్రాతినిధ్యం ఆశిస్తున్నారని.. ఇక్కడి రైతులకు నిత్యం టచ్ లో ఉంటూ, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలోనూ కీలక భూమిక పోషించే దిశగా హామీ ఇస్తున్నారని.. ఇవన్నీ వెరసి పని తీరులో పెమ్మసానిని టాప్ ప్లేస్ లో నిలిపాయని చెబుతున్నారు.
మరోవైపు ఏపీకి చెందిన ఎంపీలు పార్లమెంటులో తమ మొదటి సంవత్సరంలో మొత్తం 1,576 ప్రశ్నలు లేవనెత్తగా... అందులో 1,081 ప్రశ్నలు టీడీపీకి చెందిన ఎంపీల నుంచే రావడం గమనార్హం. అంటే సగటున తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఒక్కొక్కరు 77.2 ప్రశ్నలు అడిగారు. ఇది జాతీయ సగటు 46.8 కంటే చాలా ఎక్కువ!