40 ఏళ్ల అనుభవానికి అవమానం.. మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి కన్నీటి పర్యంతం, టీడీపీకి గుడ్ బై
మున్సిపల్ ఎన్నికలు శ్రీకాకుళం టీడీపీలో ముసలం పుట్టించాయి. సిక్కోలు కార్పొరేషన్ సీటు ఇస్తామని ఆశ చూపి, ఇప్పుడు జనసేనకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మనస్తాపానికి గురయ్యారు.
మున్సిపల్ ఎన్నికలు శ్రీకాకుళం టీడీపీలో ముసలం పుట్టించాయి. సిక్కోలు కార్పొరేషన్ సీటు ఇస్తామని ఆశ చూపి, ఇప్పుడు జనసేనకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మనస్తాపానికి గురయ్యారు. పార్టీలో తమ కుటుంబానికి అన్యాయం జరుగుతోందని, 40 ఏళ్లుగా పార్టీనే నమ్ముకున్నందుకు అడుగడుగునా అమానిస్తున్నారని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీదేవి ప్రకటించారు. ఆమె భర్త మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ 1983 నుంచి 2004 వరకు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పనిచేశారు. లక్ష్మీదేవి 2014 నుంచి 2019వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికల్లో గుండ కుటుంబాన్ని తప్పించి, మేయర్ సీటు ఇస్తామని పార్టీ అధిష్టానం ప్రతిపాదించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు సర్దుబాట్లలో భాగంగా జనసేనకు కేటాయించడాన్ని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.
40 ఏళ్ల బంధం.. కన్నీటి పర్యంతం
టీడీపీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితులను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కన్నీటి పర్యంతం అయ్యారు. శ్రీకాకుళంలో టీడీపీకి వెన్నుదన్నుగా వస్తున్న గుండ కుటుంబం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిరావడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళంలో పార్టీ పురోగతి కోసం మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులు ఎంతో కృషి చేశారని చెబుతున్నారు. అయితే వయోభారం వల్ల గుండ అప్పలసూర్యనారాయణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారని, అయినప్పటికీ తన భార్యను ముందుంచి పెద్దదిక్కుగా పార్టీని నడిపించారని గుర్తు చేస్తున్నారు. ఆయన మరణం తర్వాత పార్టీ అండగా నిలవాల్సిందిపోయి మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించడంతోనే రాజీనామా నిర్ణయం తీసుకుందని విశ్లేషిస్తున్నారు.
మేయర్ సీటుపై పేచీ
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి గుండ లక్ష్మీదేవి ప్రయత్నించారని చెబుతున్నారు. అయితే అధిష్టానం కొత్తవారికి యువతకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ కు టికెట్ ఇచ్చిందని చెబుతున్నారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవికి శ్రీకాకుళం నగర మేయర్ పదవి ఇస్తామని ఆశ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగా అప్పట్లో గుండ కుటుంబం కూడా అధిష్టానంతో రాజీ పడిందని అంటున్నారు. అయితే మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ మరణం, గుండ కుటుంబంలో రాజకీయంగా చురుగ్గా తిరిగే వారు లేరన్న ఆలోచనతో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ పట్టుబిగించినట్లు చెబుతున్నారు. లక్ష్మీదేవిని మేయర్ చేస్తే మరో అధికార కేంద్రం తయారు చేసినట్లు అవుతుందన్న భావనతో వ్యూహాత్మకంగా మేయర్ సీటును జనసేనకు వదిలేశారని అంటున్నారు. ఇది గమనించిన లక్ష్మీదేవి పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని భావిస్తూ తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
విగ్రహం పెట్టనీయలేదన్న ఆవేదన
ఇక టీడీపీకి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి రాజీనామా చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మరణించిన తర్వాత నగరంలో ఆయన విగ్రహం పెట్టాలని అభిమానులు భావించారని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా, స్థానికంగా అడ్డంకులు సృష్టించడంపై మాజీ ఎమ్మెల్యే అసంతృప్తికి లోనరయ్యారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఈ విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ కలెక్టర్ ద్వారా స్థానిక నాయకులు అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు. దీంతో పార్టీలో 40 ఏళ్ల సేవలకు కూడా గుర్తింపు దక్కలేదన్న ఆవేదన ఆమెలో కనిపిస్తోందని అంటున్నారు.
వైసీపీలో చేరతారా?
టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి భవిష్యత్తు రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పసుపు కండువాతోనే రాజకీయం చేసిన లక్ష్మీదేవి తాజా పరిణామాలతో వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తరఫున మేయర్ సీటు ఇస్తామని ఆ పార్టీ నుంచి ఆఫర్ ఉందని అంటున్నారు. ఈ కారణంతోనే లక్ష్మీదేవి రాజీనామా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే లక్ష్మీదేవిని నచ్చజెప్పే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నాయని, మాజీ ఎమ్మెల్యేను టీడీపీ అంత తేలిగ్గా వదులుకోదని మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం రాజకీయం ఆసక్తికరంగా మారిందని చెబుతున్నారు.