రూ. 10 లక్షల నుంచి రూ.కోటి! విజయవాడలో ధన రాజకీయంపై ఏబీవీ సంచలన వ్యాఖ్యలు

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయాలు చాలా ఖరీదైనవిగా మారిపోయాయని అంటున్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.

Update: 2026-10-21 14:12 GMT

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయాలు చాలా ఖరీదైనవిగా మారిపోయాయని అంటున్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయరుగా పోటీ చేస్తున్న ఆయన నగరంలో రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ గా పోటీ చేయాలంటే అభ్యర్థులు రూ.10 లక్షలు నుంచి రూ.70 లక్షలు చెల్లించాల్సివస్తుందని, ఇక ఎన్నికల్లో గెలవాలంటే అదనంగా రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలు వెచ్చించక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. ఇంతడబ్బు పెట్టి గెలిచిన వారు ఆ డబ్బు తిరిగి ఎలా సంపాదిస్తారో ఆలోచించాలని సామాన్య ఓటర్లను ప్రశ్నించారు. దీంతో ఏబీవీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

రాజకీయాలు ధనమయం అయిపోవడంపై ఏబీవీ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇండి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏబీవీ డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికల ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారని అంటున్నారు. తన వద్ద డబ్బు ఎక్కువగా లేదని, ప్రజల చేతుల్లో ఉన్న మొబైల్ ఫోనే తన ఆయుధమని, తన మేధస్సే యుద్ధ రంగమని పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థులు చేస్తున్న ఖర్చులను సైతం హైలెట్ చేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు.

ప్రధానంగా కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ సందర్భంగా చేసిన ఖర్చును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఏబీవీ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. భారీగా జనాన్ని తరలించి ఎన్నికల నిబంధనలను పాటించకుండా డబ్బు ఖర్చు చేశారని ఏబీవీ ఆరోపిస్తున్నారు. తన రూపంలో విజయవాడ ప్రజలకు ఒక గొప్ప ప్రత్యామ్నాయం దొరికిందని ఏబీవీ వ్యాఖ్యానించారు. నగరానికి నిజమైన సమర్థత, పట్టుదల ఉన్న నాయకత్వాన్ని ఎంచుకునే అదృష్టం ప్రజలకు వచ్చిందన్న ఏబీవీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

విజయవాడ మేయర్ గా ఏబీవీ బరిలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. జనసేన, వైసీపీ మధ్య ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీగా మారుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1989 బ్యాచ్ కు చెందిన ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఏబీవీ రాష్ట్రంలో సుదీర్ఘంగా సేవలు అందించారు. 2019కి ముందు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. దీంతో ఆయనకు రాజకీయంగా కూడా మంచి పట్టు ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా తన ప్రత్యర్థుల బలం, బలహీనతలపై స్పష్టమైన అవగాహన ఉన్న ఏబీవీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. డబ్బు ఖర్చు పెట్టకుండానే తన తెలివితేటలతో ఎక్కువ ప్రచారం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారని అంటున్నారు. ఏబీవీ ఎంట్రీతో విజయవాడ పోరు ఆసక్తికరంగా మారిపోగా, మునుముందు సమీకరణలు ఎలా మారతాయనే ఉత్కంఠ హీట్ పుట్టిస్తోందని చెబుతున్నారు.

Tags:    

Similar News