రూ.5 కోట్లతో డీఎన్‌ఏ డేటా స్టోరేజ్ ల్యాబ్.. పెట్టుబడులు దొరక్క అమెరికాకు వెళ్లిన 24 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త

అనఘా రాజేష్ బెంగళూరులో ‘బయోకంప్యూట్’ పేరుతో ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.

Update: 2026-10-21 12:30 GMT

భారతదేశం ఆవిష్కరణలకు మార్గదర్శిగా నిలుస్తోందని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే.. మరొకవైపు అత్యాధునిక సాంకేతిక రంగాలు.. పరిశోధనల ఆధారిత ప్రాజెక్టులకు నిధులు దొరకక యువ పారిశ్రామికవేత్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇందుకు నిదర్శనంగా బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త అనఘా రాజేష్ అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది.

వినూత్న ప్రయోగం: డీఎన్‌ఏ డేటా స్టోరేజ్

అనఘా రాజేష్ బెంగళూరులో ‘బయోకంప్యూట్’ పేరుతో ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ ముఖ్య ఉద్దేశం డిజిటల్ సమాచారాన్ని డీఎన్‌ఏ అణువుల్లో సురక్షితంగా నిల్వ చేసే సాంకేతికతను అభివృద్ధి చేయడం. సాధారణంగా మనం వాడే హార్డ్‌డిస్కులు, క్లౌడ్ స్టోరేజ్‌లతో పోలిస్తే డీఎన్‌ఏ ద్వారా అత్యంత ఎక్కువ డేటాను శతాబ్దాల పాటు సురక్షితంగా భద్రపరచవచ్చు. ఈ అత్యాధునిక పరిశోధనల కోసం ఆమె సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసి ల్యాబ్‌ను నిర్మించారు.

పెట్టుబడుల నిరాశ.. ల్యాబ్ విక్రయం

డాక్టర్ రాజేశ్వరి అయ్యర్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లో పంచుకున్న కథనం ప్రకారం.. ఈ ప్రాజెక్టును తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు.. వ్యాపార విస్తరణకు అవసరమైన ఆర్థిక సహకారం భారత్‌లో లభించలేదు. మన దేశంలో చాలామంది వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు తక్షణమే లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్ మోడళ్లపైనే శ్రద్ధ చూపిస్తారని.. సుదీర్ఘ కాలం పరిశోధనలు అవసరమయ్యే డీప్‌టెక్ రంగాలపై రిస్క్ తీసుకోవడానికి ముందుకు రారని విమర్శలు వెల్లువెత్తాయి. సరైన ప్రోత్సాహం, నిధులు అందకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనఘా.. చివరకు తన రూ. 5 కోట్ల విలువైన ల్యాబ్‌ను అత్యల్ప ధరకే విక్రయించి అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది.

అమెరికాలో లభించిన ఆదరణ

భారత్‌లో నిరాశ ఎదురైనప్పటికీ అమెరికా వెళ్లిన తర్వాత అనఘా బిజినెస్ మోడల్‌పై అక్కడి పెట్టుబడిదారులు తీవ్ర ఆసక్తిని కనబరిచినట్లు సమాచారం. అక్కడ రిస్క్ క్యాపిటల్ , డీప్‌టెక్ స్టార్టప్‌లకు విస్తృతమైన సహకారం లభించడమే ఇందుకు కారణం.

ఈ సంఘటన భారతదేశంలో డీప్‌టెక్ వ్యవస్థ బలోపేతం కావలసిన అవసరాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్ వంటి రంగాల్లో ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఇటువంటి వినూత్న ఆలోచనలు ఉన్న యువత దేశం విడిచి వెళ్లకుండా ఉండాలంటే.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు, గ పరిశోధనా వాతావరణాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




Tags:    

Similar News