బాత్ రూమ్ నుంచే కోర్టు వర్చువల్ విచారణకు హాజరు.. వీడియో వైరల్!

బయట సమాజంలో ఎంత గొప్పవారైనా, ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారైనా.. న్యాయస్థానానికి వచ్చినప్పుడుమాత్రం అందరితోనూ సమానంగానే ట్రీట్ చేయబడతారు.;

Update: 2025-06-29 18:12 GMT

బయట సమాజంలో ఎంత గొప్పవారైనా, ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారైనా.. న్యాయస్థానానికి వచ్చినప్పుడుమాత్రం అందరితోనూ సమానంగానే ట్రీట్ చేయబడతారు. ప్రజాస్వామ్యంలోని న్యాయవ్యవస్థలో ఉన్న గొప్పతనం అది! ఇక్కడ క్రమశిక్షణ అత్యంత ముఖ్యమైనది. అలాంటి కోర్టు విచారణకు బాత్ రూమ్ నుంచి హాజరైన వ్యక్తి వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... జూన్ 20న గుజరాత్ హైకోర్టులో జస్టిస్ నిర్జ ర్ ఎస్ దేశాయ్ ఓ పిటిషన్‌ పై వాదనలు వింటున్నారు. ఆ సమయంలో వర్చువల్ విచారణలో ఉన్న ఓ వ్యక్తి బాత్ రూమ్ లో నుంచే ఈ విచారణలో పాల్గొన్నట్లు వీడియోలో కనిపించింది. తనపై నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఎఫ్‌.ఐ.ఆర్ రద్దు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఫిర్యాదిదారుడే ఈ పనికి పూనుకోవడం గమనార్హం.

ఈ క్రమంలో.. కోర్టులో వర్చువల్ విచారణ జరుగుతున్నసమయంలో.. 'సమద్ బ్యాటరీ' అనే ఐడీతో జూమ్ కాల్‌ లో ఉన్న ఓ వ్యక్తి, హెడ్‌ ఫోన్స్ ధరించి టాయిలెట్ సీటుపై కూర్చుని కనిపించాడు. ఈ క్రమంలో న్యాయమూర్తి వాదనలు వింటున్న సమయంలో... ఫోన్ వీడియో ఆన్‌ లోనే ఉంచి తన పని కానిచ్చేశాడు.

అనంతరం... ఫోన్‌ ను నేలపై ఉంచి శుభ్రం చేసుకుని మరో గదిలోకి వచ్చి విచారణలో కొనసాగాడు! టాయిలెట్ లో ఫ్లష్ ఆన్ చేయడం అన్నీ క్లియర్ గా వీడియోలో కనిపిస్తున్నాయి! అయితే... వీడియో మోడ్ ఆఫ్ చేశాను అనుకుని ఈ పనికి పూనుకున్నాడా.. లేక, ఉద్దేశపూర్వకంగానే చేశాడా అనేది తెలియకపోయినా.. ఈ వ్యవహారం మొత్తం లైవ్ స్ట్రీమింగ్ అయ్యింది.

దీనికి సంబంధించిన వీడియో బార్ అండ్ బెంచ్ ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ అయ్యి, వైరల్ గా మారింది. దీనిపై న్యాయమూర్తి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

వాస్తవానికి ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారు కాదు. కాకపోతే.. జరిగిన ప్రతిసారీ న్యాయమూర్తులు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... గత మార్చిలో ఇలాగే ఓ వ్యక్తి లావెటరీ నుంచి కోర్టు విచారణకు హాజరు కాగా, జడ్జి అతనికి రూ. 2 లక్షల జరిమానా విధించడంతో పాటు, కోర్టు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని శిక్ష విధించారు.

Tags:    

Similar News