గుడివాడ మంటలు: మార్కెటింగ్ రాజకీయాలు వర్సెస్ వైసీపీ ..!
వైసిపి నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టిడిపి అధినేత సీఎం చంద్రబాబును ఉద్దేశించి `మార్కెటింగ్ రాజకీయాలు` చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.;
వైసిపి నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టిడిపి అధినేత సీఎం చంద్రబాబును ఉద్దేశించి `మార్కెటింగ్ రాజకీయాలు` చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. దీనిపై వైసిపి నాయకులు సైలెంట్ గా ఉండడం టిడిపి నాయకులు విమర్శలు చేయడం తెలిసిందే. అయితే వాస్తవానికి కొత్తగా ఆయన మార్కెటింగ్ రాజకీయాలు అన్న పదం వాడడం అనేది చిత్రంగా ఉంది. ప్రభుత్వం అనేది ఏ పని చేసినా ప్రజలకు చెరువ కావాలని కోరుకుంటుంది. అదేవిధంగా తనకు వ్యక్తిగత ప్రయోజనం కోరుకుంటుంది. ఇది తప్పుకాదు.
ఇది ఒకరకంగా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. ఏ ప్రభుత్వం మంచి చేసినా ఇది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచ్చారు. తద్వారా దాని నుంచి ప్రజలు లబ్ధిని కోరుకుంటారు.ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ప్రజలకు మేలు చేసి దాని నుంచి ఓట్లు రాబట్టుకోవడం అనేది రాజకీయాల్లో ఉన్నవారు, ప్రభుత్వంలో ఉన్నవారు చేసే సాధారణమైన కార్యక్రమం, దీనిని మార్కెటింగ్ పాలిటిక్స్ తో పోలుస్తూ గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
గతంలో వైసిపి ఎన్నో చేసిందని, కానీ తామ ప్రచారం చేసుకోలేదని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు .ఇది వైసిపి తప్పు. ఆ రోజు ప్రచారం చేసుకోవద్దు అని ఎవరూ చెప్పలేదు. ప్రచారం చేసుకుంటే అడ్డుపడతామని కూడా ఎవరూ అనలేదు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పుడు కూడా తాడేపల్లికే పరిమితమైన ముఖ్యమంత్రిగా జగన్ పేరు తెచ్చుకున్నారు. అనేకమంది వైసీపీ నాయకులు `బయటకు రండి ప్రజల్లో వచ్చి మాట్లాడండి. ఈ సమస్యలు ఉన్నాయి స్పందించండి. ప్రతిపక్షాలు ఇలా గొడవ చేస్తున్నాయి మాట్లాడండి`` అని చెప్పినప్పుడు కూడా తాడేపల్లి పాలస్ ను విడిచి బయటకు రాకుండా వ్యవహరించింది జగన్.
కాబట్టి ఆరోజు ప్రచారంలో వెనకబడ్డారు కాబట్టే ప్రజలకు మీరు ఏం చేశారు అన్నది తెలియలేదు అన్నది వాస్తవం. ఈ విషయం ఇప్పుడు చర్చించుకుని ఇప్పుడు బాధపడి ఉపయోగం ఏముంది అనేది విశ్లేషకులు ప్రశ్నిస్తున్న మాట. దీనికి గుడివాడ అమర్నాథ్ లాంటి వారి దగ్గర సమాధానం లేదు. ప్రస్తుతం విశాఖపట్నంలో గూగుల్ సంస్థ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. దీనిపట్ల సహజంగానే చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. పైగా ఇది ప్రపంచ స్థాయి పెట్టుబడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే చెబుతున్నారు. ఆసియాలో అతిపెద్ద పెట్టుబడిగా గూగుల్ సంస్థ చెప్పింది.
ఈ సమయంలో ప్రచారం చేసుకోకపోతే ఇంకేం చేసుకుంటారు అనేది గుడివాడ ఆలోచించుకోవాలి. దీనిని మార్కెటింగ్ పాలిటిక్స్ అంటూ వ్యాఖ్యానించటం వ్యంగ్యంగా విమర్శలు చేయడం సరైనది కాదు. గతంలో వైసీపీ చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే ప్రచారం చేసుకోవచ్చు. ఆనాడు విఫలమై ఈనాడు ప్రచారం చేసుకునే వాళ్ళకి వ్యంగంగా అడ్డుపడడం, వాళ్ళు ఏదో మార్కెటింగ్ చేసుకుంటున్నారని చెప్పడం అంటివి సరికాదు అన్నది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట.