ఇవే డిమాండ్లు నాయనా? పెళ్లికి వరుడి పెట్టిన ఫిటింగ్ వైరల్
నేటి వివాహాలు కేవలం ఆచారాలకే పరిమితం కాకుండా, భారీ ఫ్యాషన్ షోలా మారిపోతున్నాయి.;
నేటి వివాహాలు కేవలం ఆచారాలకే పరిమితం కాకుండా, భారీ ఫ్యాషన్ షోలా మారిపోతున్నాయి. లక్షల రూపాయల ఖర్చుతో కూడిన ప్రీ-వెడ్డింగ్ షూట్లు, రిసార్ట్ వేడుకలు, డిజైనర్ లెహంగాలు, డైమండ్ నగలు, డ్రోన్ కెమెరాలు, లైటింగ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్.. ఇవన్నీ ఇప్పుడు "పెళ్లి" అంటే తప్పనిసరి భాగాల్లా మారిపోయాయి. అయితే, తాజాగా ఒక వరుడు మాత్రం ఈ ఆర్భాటపు ట్రెండ్‌కి వ్యతిరేకంగా 10 ప్రత్యేక డిమాండ్లు పెట్టాడు. కట్నం వద్దు కానీ వివాహం యొక్క పవిత్రతను కాపాడాలని స్పష్టంగా తెలిపిన ఆ యువకుడి షరతులు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
* ఆ వరుడి పవిత్ర వివాహ నియమాలు (10 డిమాండ్లు)
తాను కోరుకునే పెళ్లి ఎలా ఉండాలో వివరిస్తూ సంప్రదాయానికే పెద్ద పీట వేస్తూ ఆ యువకుడు పెట్టిన 10 నియమాలు ఇవే
ప్రీ-వెడ్డింగ్ షూట్ అస్సలు ఉండకూడదు.
వధువు లెహంగాకు బదులుగా సంప్రదాయ చీర మాత్రమే ధరించాలి.
పెళ్లిలో బిగ్గరగా, అసభ్యకరమైన సంగీతం కాకుండా వాయిద్య సంగీతం (ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్) మాత్రమే ఉండాలి.
దండలు మార్చుకునే సమయంలో వరుడు-వధువు మాత్రమే ఉండాలి; ఎవ్వరూ వారిని పైకి ఎత్తకూడదు.
పెళ్లి తంతు జరుగుతుండగా ఫోటోగ్రాఫర్లు లేదా వీడియోగ్రాఫర్లు జోక్యం చేసుకోకూడదు.
వేడుక మొదలైన తర్వాత పూజారిని ఎవరూ అడ్డుకోకూడదు.
వధూవరులు ఫోటోల కోసం ప్రత్యేకంగా “పోజులు” ఇవ్వబోరు.
వివాహం పగటిపూట జరగాలి; సాయంత్రానికే ‘బధాయి’ (రిసెప్షన్) కార్యక్రమం ముగించాలి.
వివాహం తర్వాత హగ్గులు, కిస్‌లు లాంటి బహిరంగ ప్రదర్శనలు అస్సలు ఉండకూడదు.
“ఇది సినిమా షూట్ కాదు, అగ్నిదేవుడి సాక్షిగా జరిగే పవిత్ర వివాహం” ఈ సూత్రాన్ని అందరూ గౌరవించాలి.
*సోషల్ మీడియాలో చర్చ: 'విలువలా? వినోదమా?'
ఈ 10 డిమాండ్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు "ఇలాంటి ఆలోచనలతో ఉన్న యువకులు చాలా అరుదు" అని ప్రశంసిస్తుంటే, మరికొందరు "ఇది నిజమైన విలువల వివాహం" అని వ్యాఖ్యానించారు. "అతని ఆలోచన పాతకాలపు అయినా అందులోని నిజాయితీ అద్భుతం" అని మరొకరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరు మాత్రం "పెళ్లి అనేది కుటుంబ ఉత్సవం, ఫోటోలు జ్ఞాపకాలే కదా" అని భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఏదేమైనప్పటికీ ఈ వరుడు పెట్టిన 10 డిమాండ్లు నేటి ఆర్భాటపూరిత పెళ్లిళ్లకు కొత్త దిశ చూపుతున్నాయనేది మాత్రం నిజం. “వివాహం అంటే ప్రేమ, పవిత్రత, ఆచారం కాదు కదా కేవలం షో ఆఫ్!” అని ఈ కథ మరోసారి గట్టిగా గుర్తు చేస్తోంది.