మగువల మది దోచే 'పసిడి' పై ఢిల్లీ పెద్దల కన్ను పడింది!

తాజాగా బ్యాంకుల నుంచి కేంద్రం కోరిన ఒక డేటా ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2026-06-10 07:30 GMT

మగువల మది దోచే ‘పసిడి’పై ఢిల్లీ పెద్దల కన్ను పడింది. అవును మీరు విన్నది నిజమే.. దేశంలో బంగారం ధరలు చూస్తేనే గుండె గుభేల్ మంటుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే జ్యువెలరీ వ్యాపారులకు కాస్త పెద్ద పెద్ద ప్లాన్లు వేసే గుజరాతీలకు చెమటలు పడుతున్నాయి.

"ఏంటి సామీ.. బంగారం కొనాలంటనే భయపడేలా చేస్తున్నావ్?" అని సామాన్యుడు వాపోతుంటే.. "మేము చూసేది మీ చిరునవ్వులు కాదు బాసూ.. వెనకాల జరిగే పెద్ద పెద్ద గోల్ మాల్స్ " అంటూ కేంద్రం రూటు మార్చింది. తాజాగా బ్యాంకుల నుంచి కేంద్రం కోరిన ఒక డేటా ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ ఆ ‘గోల్డ్ మెటల్ లోన్’ కథ ఏంది?

సాధారణంగా మనకు తెలిసింది ఒకటే.. ఇంట్లో ఉన్న కాస్తో కూస్తో బంగారం తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి మురిపెంగా ‘గోల్డ్ లోన్’ తెచ్చుకోవడం. కానీ ఇక్కడ కథ వేరు. ఇది ‘గోల్డ్ మెటల్ లోన్’. అంటే పెద్ద పెద్ద ఆభరణాల తయారీదారులు జ్యువెలర్స్, ఎగుమతిదారుల కోసం బ్యాంకులు ఇచ్చే స్పెషల్ ఆఫర్ అన్నమాట. ఇక్కడ బ్యాంకులు నోట్ల కట్టలు ఇవ్వవు నేరుగా అచ్చమైన బంగారాన్నే లోన్‌గా ఇస్తాయి. వ్యాపారులు ఆ బంగారంతో నగల తయారు చేసి, అమ్మి, మళ్లీ ఆ సొమ్మును లేదా బంగారాన్ని బ్యాంకుకు కడతారు. భలే ఉంది కదూ ఈ స్కీమ్!

మోడీ గారికి వచ్చిన ‘డౌట్’ ఏంటంటే..?

ఇన్నాళ్లూ ఈ వ్యవహారం బాగానే సాగింది కానీ మన దేశంలోకి విపరీతంగా బంగారం దిగుమతి అయిపోతోంది. కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 15 శాతానికి పెంచినా మనోళ్ల బంగారం మోజు అస్సలు తగ్గట్లేదు. దీంతో విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతుండటంతో కేంద్రానికి ఎక్కడో ‘బల్బ్’ వెలిగింది. బ్యాంకుల నుంచి తెచ్చిన ఈ ‘గోల్డ్ మెటల్ లోన్’ బంగారాన్ని నిజంగానే ఆభరణాల తయారీకి వాడుతున్నారా? లేక దాన్ని పక్కదారి పట్టించి ఇంకేదైనా ‘బ్లాక్’ వ్యవహారాలు నడుపుతున్నారా? ఈ రుణాల సాకుతో మార్కెట్లోకి వస్తున్న టన్నుల కొద్దీ బంగారం ఎటు పోతోంది? అక్రమ రవాణా, బ్లాక్ మనీ పెట్టుబడులకు ఇది అడ్డాగా మారిందా? ఈ అనుమానంతోనే "బాబూ బ్యాంకులూ.. ఆ గోల్డ్ మెటల్ లోన్లు ఎవరెవరికి ఇచ్చారో ఆ జ్యువెలరీ సంస్థల జాతకాలన్నీ మా టేబుల్ మీద పెట్టండి" అంటూ కేంద్రం హుకుం జారీ చేసింది.

మరి మన ‘సామాన్యుడి’ పరిస్థితి ఏంటి?

వార్త వినగానే.. "అయ్యో! నా పెళ్లి నగల పరిస్థితి ఏంటి? నా మెడలో గొలుసు వైపు కూడా చూస్తారా?" అని టెన్షన్ పడకండి. ప్రస్తుతానికి ఈ ‘బిగ్ నిఘా’ కేవలం కార్పొరేట్ జ్యువెలరీ తిమింగలాల మీదే.. సామాన్య పౌరుల కొనుగోళ్లపై కేంద్రం ఇప్పుడే నేరుగా కత్తి కట్టలేదు.

కానీ మున్ముందు రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద కొనుగోళ్లపై నిఘా మరింత గట్టిగా ఉండబోతోంది.పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఎలాగూ తప్పనిసరి అనుకోండి.. మార్కెట్లో ‘పారదర్శకత’ పేరుతో కొత్త రూల్స్ రావచ్చు. బ్యాంకుల నుంచి వ్యాపారులకు బంగారం దొరకడం కాస్త లేట్ అయితే.. ఆ ఎఫెక్ట్ కాస్తో కూస్తో ధరల మీద పడే ఛాన్స్ లేకపోలేదు.

ప్రస్తుతానికి ఇదంతా కేవలం సమాచార సేకరణ ప్రోగ్రామ్ మాత్రమేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ డేటాలో ఏవైనా తిమ్మిని బమ్మిని చేసినట్లు తేలిందో.. ఇక అంతే సంగతులు, ‘కొత్త రూల్స్’ తో మోడీ సర్కార్ రెడీగా ఉంటుంది. మొత్తానికి పసిడి వ్యాపారంలో ఇకపై ‘పప్పులు ఉడకవు’ అనే సిగ్నల్ అయితే గట్టిగానే అందింది. జ్యువెలరీ బాసులు.. కాస్త జాగ్రత్తండోయ్..

Tags:    

Similar News