ఆ మెసేజ్ వచ్చిందా? గ్యాస్ సబ్సిడీ రద్దు!!

ప్రస్తుతం ఆదాయానికి సంబంధం లేకుండా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ అందజేస్తున్నారు.;

Update: 2026-05-12 10:21 GMT

చమురు సంక్షోభం నుంచి బయటపడటానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలను వేడుకుంటున్న ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ వినియోగంపైనా దృష్టి పెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సబ్సిడీని సంపన్న వర్గాల వారికి పూర్తిగా ఎత్తివేసే ఆలోచన చేస్తోందని తాజాగా ప్రచారం జరుగుతోంది. వార్షిక ఆదాయం పది లక్షలు దాటిన వారికి ఇకపై గ్యాస్ సబ్సిడీ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.పది లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ఆన్ లైన్ లో మెసేజులు పంపుతోంది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే ఆటోమెటిక్ గా సబ్సిడీ రద్దు అవుతుందని ఆ మెసేజుల్లో ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం ఆదాయానికి సంబంధం లేకుండా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ అందజేస్తున్నారు. అయితే ప్రభుత్వ సబ్సిడీ పేదలు, అట్టడుగు వర్గాల వారికే పరిమితం చేయాలని, ఆదాయం ఎక్కువగా ఉన్నవారికి సబ్సిడీలు ఇవ్వడంలో అర్థం లేదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సంపన్న వర్గాల వారి వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి సేకరించి గ్యాస్ సరఫరా కంపెనీలకు అందజేసినట్లు చెబుతున్నారు. రూ.10 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారి వివరాలను దగ్గరపెట్టుకుని వారి ఫోన్లకు గ్యాస్ సబ్సిడీ రద్దుపై సమాచారం పంపుతోంది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాతృభూమి పథకంలో భాగంగా సంపన్న వర్గాలకు గ్యాస్ సబ్సిడీ రద్దు చేస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఆదాయ పన్ను రికార్డులను పరిశీలించి తమ వినియోగదారులకు కంపెనీలు నోటీసులు పంపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వేలమందికి ఈ తరహా మెసేజులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా మెసేజ్ అందుకున్న వారు వారం రోజుల్లోగా ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సివుంటుందని చెబుతున్నారు. లేదంటే గ్యాస్ సబ్సిడీని శాశ్వతంగా కోల్పోతారని గ్యాస్ సరఫరా కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.

నిజానికి ఈ నిబంధన 2015లోనే తీసుకువచ్చారని అంటున్నారు. అయితే అప్పట్లో సెల్ఫ్-డిక్లరేషన్ ఇస్తే సరిపోయేదని, కానీ ఇప్పుడు నేరుగా ఆదాయపు పన్ను వివరాలతో పోల్చిచూస్తుండటం వల్ల ఏ ఒక్కరూ తప్పించుకోలేరని వ్యాఖ్యానిస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, ఉజ్వల పథకం కింద గ్యాస్ పొందిన వారికి మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెబుతున్నారు. నిజమైన పేదలకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనం దక్కాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

కఠినమైన వెరిఫికేషన్ ప్రక్రియతో గ్యాస్ కంపెనీలు వినియోగారులకు మెసేజులు పంపుతున్నాయని అంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఇటువంటి మెసేజు పొరపాటున వచ్చిందనో, సైబర్ క్రిమినల్స్ పంపుతున్న మెసేజులు అనో భావిస్తే, క్రాస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. గ్యాస్ సబ్సిడీపై ఏమైనా సందేహాలు ఉంటే టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ నెంబరు 1800-2333- 555కి ఫోన్ చేయడమో లేక గ్యాస్ కంపెనీల వెబ్ సైటులో గ్రీవెన్స్ పోర్టల్ లో ఫిర్యాదు చేయొచ్చని సూచిస్తున్నారు. అదే సమయంలో గ్యాస్ డెలవరీ నిబంధనలను సైతం కఠినతరం చేసినట్లు కంపెనీలు ప్రకటించాయి. ఇకపై డెలవరీ అథెంటికేషన్ కోడ్ సిస్టమ్ ను తప్పనిసరి చేశాయి. డెలవరీ చేయడానికి వచ్చిన వ్యక్తికి కస్టమర్లు తమ గ్యాస్ ధృవీకరణ కోడ్ కచ్చితంగా చెప్పాలని స్పష్టం చేశాయి.

Tags:    

Similar News