అమెరికా తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే.. కూటమి సర్కారు ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే...
ఐటీ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.;
ఐటీ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. విశాఖ కేంద్రంగా అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సిద్ధమవడం గేమ్ ఛేంజర్ గా చెబుతున్నారు. గూగుల్ నిర్ణయంతో అమెరికా వెలుపల ఆ సంస్థ రెండో అతిపెద్ద కార్యాలయానికి విశాఖ కేంద్రం కానుందని అంటున్నారు. విశాఖలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నామమాత్రపు ధరకే భూములు కేటాయిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గత ఏడాది డిసెంబరులో ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత, ఐటీ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో అప్పట్లో గూగుల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఏడు నెలల క్రితం ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న గూగుల్ విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించిందని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మధురవాడ ఐటీ సెజ్ ప్రాంతంలో దాదాపు 500 ఎకరాలు గూగుల్ సంస్థకు కేటాయించారు. ఇందులో సుమారు 80 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటు కానుందని అంటున్నారు. గూగుల్ కు ప్రపంచ వ్యాప్తంగా కార్యాలయాలు ఉండగా, విశాఖలో స్థాపించనున్న డేటా సెంటర్ అమెరికాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం తర్వాత అతిపెద్దదిగా చెబుతున్నారు.
వేలాది ఉద్యోగాలతోపాటు ఏపీలో ఐటీ వృద్ధికి గూగుల్ కార్యాలయం ఏర్పాటు గేమ్ ఛేంజర్ గా ఉపయోగపడనుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కూడా ఏపీలో క్వాంటం కంప్యూటింగ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. దీంతో ప్రభుత్వం ఊహిస్తున్నట్లు మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గూగుల్ ఒప్పందం విశాఖలో కార్యాలయం ఏర్పాటుకు కాగ్నిజెంట్ కూడా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక మన దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా విశాఖ కేంద్రంగా సర్వీస్ సెంటర్ ఏర్పాటుకు ఓకే చెప్పింది. దీంతో గతంలో హైదరాబాద్ ను ప్రమోట్ చేసినట్లే విశాఖ కూడా ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా మారనుందని చెబుతున్నారు.