'డాక్టర్' సెల్ ఫోన్.. మున్ముందు మీ మొబైలే మీ ఆరోగ్య రక్ష

తాజాగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిల్ జరిగిన అంతర్జాతీయ సదస్సులో చందు తోట పాల్గొన్నారు.;

Update: 2025-06-23 01:30 GMT

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)... ప్రతి రంగంలోనూ అద్భుతాలు చేస్తోంది.. వైద్య రంగంలోనూ దీని ప్రభావం బాగా ఉంటుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పటికే ఏఐని అనేక రంగాల్లో ప్రత్యామ్నాయ వనరుగా చూస్తున్నారు. కొన్ని రంగాల్లో ఉద్యోగాలకు ముప్పు తెస్తుందనే ఆందోళన కూడ వ్యక్తం అవుతోంది. అలాంటి ఏఐతో మున్ముందు మీ సెల్ ఫోన్ ఒక డాక్టర్ గా మారిపోతుందని తెలుసా? కనీసం ఇది ఊహిస్తున్నారా? అవును నిజమే అంటున్నారు దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ ఉపాధ్యక్షుడు చందు తోట. తెలుగువారైన చందు తోట.. ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ)లో చదివారు. అనంతరం ఉద్యోగంలో చేరి.. గూగుల్ వంటి ప్రఖ్యాత సంస్థకు ఉపాధ్యక్షుడు (వైస్ ప్రెసిడెంట్) స్థాయికి ఎదిగారు.

తాజాగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిల్ జరిగిన అంతర్జాతీయ సదస్సులో చందు తోట పాల్గొన్నారు. వైద్య రంగంలో ఏఐ వినియోగం పెరుగుతున్న వైనం గురించి వివరించారు. వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స విధానాలు, ఔషధాల పరిశోధన అన్నింట్లోనూ ఏఐ కీలకం కానుందని వివరించారు. డేటా సేకరణ, విశ్లేషణ, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్)లను కలిపి ఏఐ స్వల్ప వ్యవధిలోనే మోడళ్లను రూపొందించడంతో వైద్యం రూపురేఖలు మారిపోతాయని పేర్కొంటున్నారు.

ఈ క్రమంలో భవిష్యత్ లో స్మార్ట్ ఫోన్ ఒక వైద్యుడిగా మారిపోతుందని.. ఏఐతో ఇది సాధ్యమేనని పేర్కొన్నారు. వైద్య సేవలకు సంబంధించి నమ్ముందు గూగుల్ తో పాటు అనేక కంపెనీలు మరిన్ని ఏఐ మోడళ్లను డెవలప్ చేస్తాయని పేర్కొన్నారు. ప్రాథమిక వైద్యంలోనూ ఏఐ విప్లవం తేబోతోందని వివరించారు. మారుమూల పల్లెలకు కూడా ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నాణ్యమైన వైద్యం కోసం గూగుల్ ఏఐ జెమిని 72 మోడళ్లను అందిస్తున్న సంగతిని గుర్తు చేశారు. సెల్ ఫోన్ సాయంతో వీటిని వినియోగించుకోవచ్చన్నారు. ఏఐతో వ్యాధి నిర్ధారణ, చికిత్స పద్ధతులు పెరిగాక.. అత్యంత తక్కువకే వైద్యం అందుతుందని శుభవార్త చెప్పారు చందు తోట.

గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, సెల్ ఫోన్ ఒక డాక్టర్ తరహాలో సేవలు అందించేలా పరిశోధనలు సాగుతున్నాయని పేర్కొన్నారు.

లైఫ్ స్టైల్ డిసీజ్ లు.. గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్, బీపీ తదితరాలను ఏఐతో ముందే అంచనా వేసి రోగులను హెచ్చరించే వీలుంటుందని చందు తోట తెలిపారు.

చివరగా.. ఏఐ వైద్యుడికి రిప్లేస్ మెంట్ కాదని.. కానీ, ఏఐ వాడని వైద్యుడు వెనుకబడి పోతాడని చందు తోట తనదైన ముగింపు ఇచ్చారు.

Tags:    

Similar News