బంగారం మెరుపులు ఇంకెన్నాళ్లు.. ఎందుకు పెరుగుతోందంటే ?

ఇప్పుడు చైనాపై ట్రంప్ ఆంక్ష‌లు విధించార‌ని అనుకుందాం. చైనా ద‌గ్గ‌ర కావాల్సిన బంగారం నిల్వ‌లు ఉన్నాయి.;

Update: 2026-01-28 19:30 GMT

బంగారం ధ‌ర‌ ఔన్సు 5000 డాల‌ర్లను దాటింది. ప‌ది గ్రాముల బంగారం ధ‌ర రూ. 1,61,000 ఉంది. 2025లో బంగారం ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి. 1979 త‌ర్వాత ఈ స్థాయిలో బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డం మొద‌టిసారి. దీంతో బంగారం ధ‌ర‌లు పెరుగుతాయా ?. తగ్గుతాయా ?. ఎందుకు పెరుగుతున్నాయ‌న్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న అనిశ్చితే బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణంగా విశ్లేష‌కులు భావిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ విధానాలు అంత‌ర్జాతీయ స‌మాజంలో అస్థిర‌త‌ను ఏర్ప‌ర‌చాయి. అన్ని దేశాల‌పై టారిఫ్ లు విధించ‌డం, వెనుజులా అధ్య‌క్షుడు నికోల‌స్ మ‌దురోను నిర్బంధించ‌డం, గ్రీన్ ల్యాండ్ కావాల‌ని ప‌ట్టుప‌ట్ట‌డం, ఈయూ పై ఆంక్ష‌ల పేరుతో బెదిరింపులు, నాటో ల‌క్ష్యం నీరుగార్చే ప్ర‌య‌త్నం, ఇరాన్ పై ఆంక్ష‌లు.. ఇలా ట్రంప్ అనుస‌రిస్తున్న విధానాలు అంత‌ర్జాతీయంగా భ‌యాల‌ను రేకెత్తించాయి. దీంతో చాలా దేశాలు బంగారం కొనుగోలు చేస్తున్నాయి.

బంగారం ఎందుకు ?

ప్ర‌పంచ వాణిజ్యంలో డాల‌ర్ దే ఆధిప‌త్యం. డాల‌ర్ తోనే క్ర‌య‌విక్ర‌యాలు జ‌రుగుతున్నాయి. దీంతో ప్ర‌పంచ వాణిజ్యాన్ని డాల‌ర్ శాసిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు ఇరాన్ పై ట్రంప్ ఆంక్ష‌లు విధిస్తే ఆ దేశంలో డాల‌ర్ నిల్వ‌లు ప‌డిపోతాయి. ఎలా అంటే ఇరాన్ నుంచి ఏమీ కొన‌రు. వారికి ఏమీ అమ్మ‌రు. అదే స‌మ‌యంలో డాల‌ర్ నిల్వ‌లు త‌గ్గుతాయి. త‌గ్గితే.. వేరే దేశాల‌తో డాల‌ర్ లేకుండా దిగుమ‌తులు చేసుకోలేరు. దిగుమ‌తులు చేసుకోక‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇరాన్ క‌రెన్సీను మిగిలిన దేశాలు ఒప్పుకోవు. డాల‌ర్ తోనే కొనాల‌ని ప‌ట్టుబ‌డుతాయి. కాబ‌ట్టి డాల‌ర్ తో వ్యాపారం చేయాలి. డాల‌ర్ తో వ్యాపారం చేయాలంటే డాల‌ర్ నిల్వ కావాలి. డాల‌ర్ నిల్వ కావాలంటే అమెరికాకు ఎగుమ‌తులు చేయాలి. అమెరికాకు ఎగుమ‌తులు చేయాలంటే ట్రంప్ చెప్పిన‌ట్టు వినాలి. ఇలా ప్ర‌ప‌చ వాణిజ్యంపై అమెరికా పెత్త‌నం ఉంది.

ఇప్పుడు చైనాపై ట్రంప్ ఆంక్ష‌లు విధించార‌ని అనుకుందాం. చైనా ద‌గ్గ‌ర కావాల్సిన బంగారం నిల్వ‌లు ఉన్నాయి. అమెరికా ఆంక్ష‌ల‌తో డాల‌ర్ నిల్వ‌లు త‌గ్గిన‌ప్పుడు.. బంగారం ఉప‌యోగించి దిగ‌మ‌తులు చేసుకుంటుంది. ప్ర‌పంచ దేశాలు డాల‌ర్ కంటే ఎక్కువ‌గా బంగారాన్ని న‌మ్ముతాయి. ఎలాంటి యుద్ధం జ‌రిగినా, ఆంక్ష‌లు విధించినా, ఆర్థిక ఇబ్బందులు వ‌చ్చినా బంగారం ఒక ఇన్సూరెన్సె లాగా మారుతుంది. బంగారాన్ని ఉప‌యోగించి ప్ర‌పంచ దేశాలు వ్యాపారం చేస్తాయి. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకుని చాలా దేశాలు బంగారం కొంటున్నాయి. నిల్వ చేసుకుంటున్నాయి.

సెంట్ర‌ల్ బ్యాంకుల‌ను అనుస‌రిస్తున్న పెట్టుబ‌డిదారులు..

సెంట్ర‌ల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నాయంటే.. ప్ర‌మాదానికి ముంద‌స్తు సంకేతం. అందుకే పెట్టుబ‌డిదారులు రిస్క్ ఉన్న స్టాక్ మార్కెట్స్, లేదా ఇత‌ర అసెట్స్ నుంచి వైదొల‌గి, బంగారంలో పెట్టుబ‌డులు పెడ‌తాయి. ఒక‌వైపు సెంట్ర‌ల్ బ్యాంకులు, పెట్టుబ‌డిదారులు బంగారం కొనుగోలు పెరిగిన‌ప్పుడు..స‌ర‌ఫ‌రా త‌గ్గుతుంది. దీంతో డిమాండ్ కు త‌గ్గ స‌ర‌ఫ‌రా లేక ధ‌ర‌లు పెరుగుతున్నాయి. 1979 త‌ర్వాత ఇప్పుడే ఆ స్థాయిలో ధ‌ర‌లు పెరుగుతున్నాయంటే.. ఏ స్థాయిలో ప్ర‌మాదం ముంచుకొస్తుందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

డాల‌ర్ బ‌ల‌హీన‌త‌..

డాల‌ర్ బ‌ల‌హీన‌త అన్నిసార్లూ గోల్డ్ రేటును పెంచ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. డాల‌ర్ పెరిగితే .. బంగారం త‌గ్గ‌డం, డాల‌ర్ త‌గ్గితే బంగారం పెర‌డం అన్నది అన్నిసార్లు ఒకే విధంగా ఉండ‌ద‌ని అంటున్నారు. జియో పొలిటిక‌ల్ టెన్ష‌న్స్, సెంట్ర‌ల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేయ‌డం కార‌ణంగా కూడా బంగారం ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని చెబుతున్నారు. బంగారం ధ‌ర‌ల పెరుగుద‌ల‌ కాంబినేష‌న్ ఆఫ్ ఫ్యాక్ట‌ర్స్ అని అంటున్నారు.

Tags:    

Similar News