జగన్ భారీ హామీ...క్యాడర్ హ్యాపీ నా ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒక భారీ హామీ అయితే క్యాడర్ కి ఇచ్చేశారు. తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే పాలన మొత్తం కార్యకర్తల చేతుల మీదుగానే చేయిస్తామని.;
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒక భారీ హామీ అయితే క్యాడర్ కి ఇచ్చేశారు. తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే పాలన మొత్తం కార్యకర్తల చేతుల మీదుగానే చేయిస్తామని. అంటే సంక్షేమ పధకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అంతా కార్యకర్తల మాటే క్షేత్ర స్థాయిలో చెల్లుబాటు అవుతుందని జగన్ హామీ ఇచ్చారు అన్న మాట. అంతే కార్యకర్తలు ఈ హామీతో ఫుల్ హ్యాపీయేనా అన్నది చర్చ సాగుతోంది. నిజం చెప్పాలి అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కార్యకర్తలు తమకు తగిన ప్రాధాన్యత దక్కాలని కోరుకుంటారు. అది సహజం కూడా. కానీ ఒక్క వైసీపీ విషయంలోనే అది రివర్స్ అయింది.
పదేళ్ళు మోసి మరీ :
వైసీపీ కోసం క్యాడర్ ఏకంగా పదేళ్ల పాటు పార్టీని మోసారు. 2009లో వైఎస్సార్ మరణం తరువాత జగన్ వెంట చేరిన క్యాడర్ 2019 దాకా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా పార్టీ కోసం ఆరుగాలం కష్టపడ్డారు. ఈ దశాబ్ద కాలంలో వారు ఎంతో కోల్పోయారు. తమ కాలం వయసు, ధనం అన్నీ కూడా పెట్టుబడిగా పెట్టారు. అంతే కాదు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంతో విభజన ఏపీలో టీడీపీ ప్రభుత్వంతో పోరాడి ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడ్డారు. తీరా జగన్ సీఎం అయి వైసీపీ అధికారంలోకి వచ్చాక క్యాడర్ కి ఏమి దక్కింది అంటే ఆవేదన నిరాశ అన్నదే అని అంతా తీవ్రమైన మనో వేదనకు గురి అయ్యారు.
తెలిసివచ్చిందా :
అయితే వైసీపీకి 2024 ఎన్నికల్లో తమ సొంత పార్టీ క్యాడర్ పూర్తిగా హ్యాండ్సప్ అని చేతులు ఎత్తేయడంతో అనేక బలమైన నియోజకవర్గాలు సైతం చేతులు జారి కూటమి వైపుగా టర్న్ కావడంతో తప్పు ఏమిటో తెలిసి వచ్చింది అని అంటున్నారు. 2024లో వైసీపీ ఓడినా ఇంతటి భారీ ఓటమి అయితే వచ్చి ఉండేది కాదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. క్యాడర్ జోక్యం చేసుకుని ఉంటే కచ్చితంగా యాభై దాకా అయినా అసెంబ్లీ సీట్లు దక్కేవని ఫలితంగా గౌరవప్రదమైన స్థానంలో పార్టీ ఉండేదని కూడా మధనం చెందుతూ వచ్చారు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇపుడు క్యాడర్ కి ఎంతో మేలు చేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు అని అంటున్నారు.
వారికే అగ్ర తాంబూలం :
వైసీపీ పాలన 2.0 కనుక వస్తే క్యాడర్ కే పెద్ద పీట వేస్తామని చెబుతున్నారు. జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. అసలు వాస్తవం ఏమిటో గ్రహించారు అని అంటున్నారు. అయితే క్యాడర్ దీని మీద ఎలా ఆలోచిస్తోంది అన్నది కూడా ముఖ్యమని అంటున్నారు. నిజానికి క్యాడర్ అయితే చాలా ఏళ్ళుగా పార్టీలో నిస్తేజంగా ఉంటూ వస్తోంది. పార్టీలో జీవగర్ర లాంటి క్యాడర్ సైలెంట్ ఈ రోజుకీ పార్టీ పెద్దలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో జగన్ ఇవ్వాల్సింది హామీ కాదని నేరుగా క్యాడర్ తో భేటీలు పెట్టాలని అంతా సూచిస్తున్నారు.
వారితోనే అంతా :
ఏ పార్టీకి అయినా నాయకులు అయితే బయటకు కనిపిస్తారు కానీ అసలైన జవసత్వాలు క్యాడర్ అని అంతా ఒప్పుకునే మాట. అందువల్ల క్యాడర్ విషయంలో మాటల వరకే కాకుండా వారిలో పూర్తి ఆత్మ విశ్వాసం నింపేలా వారిలో కొత్త ఉత్సాహం పెల్లుబుకేలా అధినాయకత్వం నేరుగా సమావేశాలు నిర్వహించాలని అంతా కోరుతున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో నాయకులతో భేటీలు వేయడం మంచిదే కానీ వారితో పాటుగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం వంద మంది వరకూ కీలకమైన కార్యకర్తలను పిలిచి వారి మనసులో మాటను తెలుసుకోవాల్సి ఉందని సూచనలు వస్తున్నాయి. అంతే కాకుండా పార్టీ పరిస్థితి ఎలా ఉందో వారిని అడిగితేనే రియల్ ఫీడ్ బ్యాక్ కూడా వస్తుందని అంటున్నారు. మొత్తం మీద అయితే క్యాడర్ పట్టు కొమ్మ అని వారే తమకు పెద్ద దిక్కు అని వైసీపీ చెప్పడం వరకూ ఓకే అయినా క్యాడర్ ని కదిలించాలి అంటే ఇది సరిపోదని ఇంకా కావాల్సింది చేయాల్సింది చాలానే ఉందని అంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్.