అజిత్ పవార్ మృతి వెనక కుట్ర...స్పందించిన శరద్ పవార్
మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక నేతగా ఉన్న ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం తెల్లవారుతూనే ముంబై నుంచి భారామతికి విమానం ప్రయాణం పెట్టుకున్నారు.;
మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక నేతగా ఉన్న ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం తెల్లవారుతూనే ముంబై నుంచి భారామతికి విమానం ప్రయాణం పెట్టుకున్నారు. ఆయన గమ్య స్థానం ముంగిటే చార్టర్ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్ప కూలి మంటలు చెలరేగడంతో దుర్మరణం పాలు అయ్యారు. దాంతో దేశమంతా ఒక్క సారిగా షాక్ తిన్నది. దీని మీద రాజకీయ నేతలు ప్రముఖులు అంతా అజిత్ పవార్ మృతి పట్ల సంతాపాలు తెలియచేస్తూ వస్తున్నారు.
డౌటానుమానంతో :
అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ఎన్డీయే కూటమి నుంచి వెనక్కి వెళ్ళి తిరిగి తన సొంత బాబాయ్ పార్టీ ఎన్సీపీతో తన పార్టీని విలీనం చేయబోతున్నారని అన్నారు. ఇలా ఎన్ డీయే కి దూరం కావడానికి అజిత్ పవార్ నిర్ణయించుకున్న క్రమంలో జరిగిన ఈ ప్రమాదం వెనక కుట్ర కోణం ఏమైనా ఉందేమో అన్న డౌట్లను ఆమె వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి అధినేత ఉద్ధవ్ ఠాక్రే సోదరుడు రాజ్ థాక్రే సైతం అజిత్ పవార్ ముక్కుసూటి తనం కలిగిన నాయకుడని, ఆయన తన నిజాయతీ కి భారీ మూల్యం చెల్లించుకున్నారంటూ నర్మగర్భ వ్యాఖ్యలను చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గె వంటి వారు సైతం ఈ విమాన ప్రమాద ఘటన మీద సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
పెద్దాయన ఏం చెప్పారంటే ?
ఇదిలా ఉంటే ఎన్సీపీ అధినేత మహారాష్ట్ర రాజకీయాల్లో కురు వృద్ధుడు అయిన శరద్ పవార్ ఈ ప్రమాద ఘటన మీద స్పందించారు. అజిత్ పవార్ ది ప్రమాదమే. ఆయన మరణం వెనక కుట్ర కోణం ఏమీ లేదని తేల్చేశారు. ఈ సమయంలో రాజకీయాలు అనవసరం అని కూడా ఆయన చెప్పారు. మహారాష్ట్ర అజిత్ పవార్ మృతితో ఎంతో కోల్పోయింది అన్నారు. అపారమైన నష్టమే జరిగిందని అన్నారు. మొత్తానికి పెద్దాయన మాటలతో రాజకీయాలను పక్కన పెట్టి అంతా అజిత్ పవార్ కి నివాళి అర్పించడం వరకే పరిమితం అవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
అనూహ్యమైన ఘటన :
అజిత్ పవార్ అన్ని పార్టీలతో కలిసి మెలసి ఉంటారు, అన్ని పార్టీలలో ఆయన పనిచేశారు. ఆయన సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం దానికి నిదర్శనం. ఆయన తన బాబాయ్ శరద్ పవార్ కి కుడి భుజంగా ఉంటూ ఎన్సీపీని ఈ స్థితికి తీసుకుని వచ్చారు. అయితే ఆయన తన రాజకీయ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటూ వచ్చారు. అది బాబాయ్ అబ్బాయ్ ల మధ్య రాజకీయ పరమైన విభేదాలకు దారి తీసింది. కానీ ఇద్దరి మధ్య కుటుంబ పరమైన సాన్నిహిత్యం మాత్రం అలాగే ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అయితే ఇద్దరూ కలసి పనిచేశారు. మొత్తం మీద శరద్ పవార్ కి అతి పెద్ద అండ సొంత కుమారుడి కంటే ఎక్కువ అయిన అజిత్ పవార్ మరణం మాత్రం కోలుకోలేని దెబ్బగా అంతా భావిస్తున్నారు.