బంగారం ధరలలో భారీ మార్పులు.. కొనాలా? అమ్మాలా? ఏది సరైన సమయం?
మగువలకు అత్యంత ప్రీతికరమైన వాటిలో బంగారం ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. సందర్భం ఏదైనా సరే తప్పకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాల్సిందే.;
మగువలకు అత్యంత ప్రీతికరమైన వాటిలో బంగారం ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. సందర్భం ఏదైనా సరే తప్పకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాల్సిందే. ఇక మరికొంతమందికి ఈ బంగారం పెట్టుబడి వనరుగా మారింది. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఈ బంగారంపై పెట్టుబడులు పెడుతూ లాభాన్ని కూడా అర్జిస్తున్నారు. అయితే ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పైగా మన భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగలు వచ్చాయి అంటే చాలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు.
ఇదిలా ఉండగా.. గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయాలా ? లేక అమ్ముకోవాలా? అనే సందిగ్ధంలో పడ్డారు ప్రజలు. మరి బంగారాన్ని కొనుగోలు చేయడానికైనా లేదా అమ్మడానికైనా ఏది సరైన సమయం అనే విషయం ఇప్పుడు చూద్దాం.
గత రెండు మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే ప్రస్తుతం బంగారం ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయితే ఇది ఇంకా పెరగవచ్చు అనడానికి పలు కారణాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితులు.. అటు అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అమెరికా డాలర్ బలహీనమవడంతో గోల్డ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పైగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అంతేకాదు ఇండియా తో సహా కేంద్ర బ్యాంకులన్నీ కూడా పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయని చెప్పవచ్చు.
ఇటు మన భారత దేశ పరిస్థితి విషయానికి వస్తే.. ఇక్కడ పెళ్లిళ్లు, పండుగలు సీజన్లో బంగారానికి డిమాండ్ భారీగా ఉంటుంది. రూపాయి బలహీనత కూడా బంగారం ధర పెరుగుదలకు కారణం అవుతోంది అని చెప్పవచ్చు. ఇక వచ్చే పది సంవత్సరాలలో బంగారం ధరలు ఎలా ఉండొచ్చు అనే విషయానికంటే ముందే.. గత పది సంవత్సరాల క్రితం అంటే 2013 నుండి 2015 మధ్యకాలంలో.. 10 గ్రాముల బంగారం ధర సుమారుగా రూ.27,000 నుండీ రూ.31,000 వరకూ ఉండేది. కానీ కాలక్రమేనా పరిస్థితుల్లో మార్పులు రావడం వల్ల 2023 చివరి నాటికి అదే 10 గ్రాముల బంగారం విలువ రూ.61,000 నుండీ రూ.63,000 వరకు చేరింది.. అంటే సగటున 8 - 9%శాతం వార్షిక రాబడి పెరిగింది అని చెప్పవచ్చు. కానీ ఈ పెరుగుదల సామాన్యుడికి భారంగా మారిందని చెప్పాలి.
ఇక మరో 10 ఏళ్ల ముందుకు వెళ్తే అంటే.. 2035 నాటికి అదే 10 గ్రాముల బంగారం ధర రూ. 1.25 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని బంగారం మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో బంగారం కొనుగోలు చేయాలా లేక అమ్మాలా అనే కన్ఫ్యూజన్లో పడ్డారు ప్రజలు.
ఇలాంటి వారికి మార్కెట్ నిపుణులు చెప్పేది ఏమిటంటే బంగారాన్ని సేవింగ్స్ విధానంలో భద్రపరచుకుంటే సురక్షితంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగించుకోవచ్చు అని చెబుతున్నారు. ముఖ్యంగా మీరు డబ్బును రియల్ ఎస్టేట్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో, స్టాక్స్ లో పెట్టి రిస్క్ లో పడటం కంటే ఇలా గోల్డ్ రూపంలో సేవింగ్స్ చేసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బాండ్లు, వార్షిక ఆదాయం, ధరలు పెరిగితే మరింత లాభం కూడా.. డిజిటల్ గోల్డ్ తో భద్రతతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కోసం మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేయాలి అని.. మిగతా సందర్భాలలో గోల్డ్ పై పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి ఆదాయం ఉంటుంది అని కూడా చెబుతున్నారు. మరి ముందస్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని బంగారం పెట్టుబడుల వైపు అడుగులు వేస్తే లాభపడవచ్చు అని కూడా నిపుణులు చెబుతున్నారు.