రూ.లక్ష దాటిన బంగారం.. డిసెంబర్ నాటికి ఎంతకు పెరుగుతుందంటే ?

బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం లక్ష రూపాయల దగ్గర అటుఇటు కదలాడుతోంది;

Update: 2025-04-25 09:30 GMT

బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం లక్ష రూపాయల దగ్గర అటుఇటు కదలాడుతోంది. ఈ పెరుగుదల చూస్తుంటే, ఈ సంవత్సరం చివరినాటికి రూ.1.20 లక్షల నుంచి రూ.1.25 లక్షలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఏయే కారణాలు బంగారం రేటును ప్రభావితం చేస్తున్నాయి? ఇలా పెరుగుతూ పోవడమే తప్ప తగ్గే అవకాశం లేదా? పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని నెలల క్రితం వరకు సామాన్యులకు అందుబాటులో ఉన్న బంగారం, వెండి ఇప్పుడు మాత్రం కొనేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే.. బంగారం ధరలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు:

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది. అలాగే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు లేదా రాజకీయ అస్థిరత్వం ఏర్పడినప్పడు ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి భయపడి బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతారు.

అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడినప్పుడు బంగారం దిగుబడి ఖరీదుగా మారుతుంది. దీనివల్ల దేశీయంగా బంగారం ధర పెరుగుతుంది. దాంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి బంగారం కొనుగోలు చేస్తారు. ఇది కూడా ధరల పెరుగుదలకు దారితీస్తుంది.

ప్రపంచంలోని వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇది కూడా బంగారం ధర పెరుగుదలకు ఒక కారణం. ముఖ్యంగా భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఈ సమయాల్లో డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి.

బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా?

బంగారం ధరలు ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయని చెప్పడానికి లేదు. ఒకవేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటే, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే బంగారం ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే డిసెంబర్ వరకు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నిపుణుల సూచనలు

బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్లు ఒకేసారి కాకుండా దశలవారీగా కొనుగోలు చేయడం మంచిది. ధరలు తగ్గినప్పుడు కొంచెం కొంచెం కొనుగోలు చేయడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. స్వల్పకాలికంగా ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా బంగారం మంచి రాబడినిచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News