బంగారం ధర రూ.లక్షకు చేరింది సరే.. ఏ దేశాల్లో తక్కువ?
అంచనాలు నిజమయ్యాయి. పసిడి జోరుకు బ్రేకులు పడే అవకాశం లేకుండా దాని ధర దూసుకెళ్లింది.;
అంచనాలు నిజమయ్యాయి. పసిడి జోరుకు బ్రేకులు పడే అవకాశం లేకుండా దాని ధర దూసుకెళ్లింది. చూస్తుండగానే పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.లక్షను దాటేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదవారి సంగతిని పక్కన పెట్టేద్దాం. మధ్యతరగతి వారికి సైతం పసిడి ప్రియంగా మారిందని చెప్పాలి. బంగారం కొనాలన్న ఆలోచనకు సైతం భయపడే పరిస్థితులు వచ్చేశాయి. ఇలాంటి వేళ.. మన దేశాన్ని పక్కన పెట్టేద్దాం. విదేశాల్లో మన కంటే తక్కువ ధర ఉండే అవకాశం ఉందా? అలాంటి దేశాలు ఏమిటి? అక్కడ బంగారం ధర ఎంత? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..
ఇక్కడో విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఇప్పుడు చెప్పే వివరాలు మొత్తం కరెన్సీ మారకం ధరల ఆధారంగా ఉంటాయన్నది మర్చిపోకూడదు. ఈ ఏడాది ఆరంభంలో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా చెబుతున్నాం. ఇందులో ఏమైనా కొన్ని మార్పులు.. చేర్పులు ఉండొచ్చన్న విషయాన్ని మర్చిపోకూడదు.
దుబాయ్ లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు ధర సుమారు రూ.78.960. ఇది పిబ్రవరి నాటి ధర. ఇంత తక్కువగా ఉండటానికి కారణం అక్కడ బంగారంపై వ్యాట్ లేదంటే దిగుమతి సుంకాలు లేకపోవటమే. మన దేశానికి చెందిన పురుషులు 20 గ్రాములు.. మహిళలు అయితే 40 గ్రాముల వరకు డ్యూటీ ఫ్రీగా బంగారాన్ని తీసుకెళ్లొచ్చు. కానీ.. పెద్ద మొత్తంలో దిగుమతి చేస్తే మాత్రం 6 శాతం కస్టమ్స్ డ్యూటీ పడుతుంది.
హాంకాంగ్
2025 ఫిబ్రవరి నాటికి బంగారం ధర రూ.79,400గా ఉండేది. అక్కడి తక్కువ పన్నులు.. పోటీ మార్కెట్ కారణంగా దిగుమతి సుంకాలు తక్కువ. అందుకే మన దేశం కంటే తక్కువకే బంగారం లభిస్తుంది.
టర్కీ
2025 ఫిబ్రవరి నాటికి ఈ దేశంలో బంగారం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.79,310. ఇస్తాంబుల్ లో ఉండే గ్రాండ్ బజార్ లో పవర్ ఫుల్ బంగారం మార్కెట్ ఉంటుంది. దిగుమతి సుంకాలుతక్కువగా ఉండటంతో ధరలు తక్కువే ఉంటాయి.
ఇండోనేషియా
24 క్యారెట్ల బంగారం ధర మన కంటే చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం తక్కువ పన్నులు. జకార్తాలోని స్థానిక ఆభరణ వ్యాపారులు తక్కువ ధరకే అందిస్తారు. మన దేశం కంటే తక్కువ ధరకే ఇండోనేషియాలో బంగారం లభిస్తుంది.
ఈ దేశాలతో పాటు మలానీ.. కంబోడియా.. కెనడా.. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా దేశాల్లోనే బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. దిగుమతి సుంకాలు.. పన్నుల భారం తక్కువగా ఉండటమే దీనికి కారణం. సో.. ఆయా దేశాలకు వెళ్లే వారు బంగారం కొనుగోలు చేస్తే కొద్దిపాటి తక్కువ ధరకే లభిస్తాయి. కాకుంటే.. ఈ దేశాల నుంచి బంగారం తీసుకొచ్చే ముందు కస్టమ్స్ నిబంధనలు తెలుసుకొని తీసుకొస్తే మంచిది. లేదంటే..ఇక్కడ వేసే పన్నుల కారణంగా ఎలాంటి ప్రయోజనం పొందే వీలు ఉండదు.