బనకచర్ల క్రెడిట్ జగన్ కి ఇచ్చేసిన రేవంత్ !
ఇదివరకు ఉమ్మడి ఏపీలో కర్ణాటకలో క్రిష్ణా జలాల విషయంలో మహారాష్ట్రలో గోదావరి జలాల వివాదం ఉంటూ వచ్చేది.;
రెండు తెలుగు రాష్ట్రాలు. రెండు రాజకీయాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇదివరకు ఉమ్మడి ఏపీలో కర్ణాటకలో క్రిష్ణా జలాల విషయంలో మహారాష్ట్రలో గోదావరి జలాల వివాదం ఉంటూ వచ్చేది. ఇపుడు తెలంగాణాకు ఎగువ రాష్ట్రాల సంగతేమో కానీ గోదావరి కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఢీ కొడుతున్నాయి.
జీవనదులు అయిన గోదావరి క్రిష్ణా నుంచి పారే నీరుతో చాలా రాష్ట్రాలు అభివృద్ధి చెందాల్సి ఉంది. నీటితోనే జీవితం ఆధారపడి ఉంది. ఇక చూస్తే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ని ఏపీ నిర్మిస్తోంది. ఇది చాలా పాత ప్రాజెక్ట్. దీనిని అనుమతులు కూడా ఎపుడో వచ్చేశాయి. అయితే ఏపీలో పోలవరం ప్రాజెక్టు ఉందని తెలంగాణా గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తూ కాళేశ్వరం పేరుతో చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్ నిర్మించింది.
నిజానికి గోదావరి జిలాలు తెలంగాణా నుంచి ఎగిసిపడి ఏపీకి వచ్చి సముద్రంలో కలుస్తాయి. ఎత్తు నుంచి దిగువకు వచ్చినపుడు ప్రాజెక్టులు కట్టడం సులువు. అయితే అంత ఎత్తు నుంచి నీటి మళ్ళింపుతో ప్రాజెక్టులు నిర్మించాలనుకున్నా అసలు కంటే వడ్డీయే ఎక్కువ అవుతుంది. అయినా సరే తెలంగాణాలో అపరభగీరధుడిగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు.
సరే ఎవరెన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా గోదావరిలో నిండా నీరు ఉంది. వరదల సమయంలో మరింతగా నీరు వస్తుంది. అలా ఏటా మూడు వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలసిపోతున్నాయి. గత 50 ఏళ్లుగా గోదావరి నీరు వృధాగా 3000 టీఎంసీ ల నీరు సముద్రం లో కలుస్తుంది. ఇందులో 200 టీఎంసీ ల నీరు ఉపయోగించి బనకచర్ల కు తరలించాలని ప్రతిపాదన ఉంది.
అందుకే ఏపీ ప్రభుత్వం పోలవరం నుంచి కాలువల నుంచి నీటిని మళ్ళిస్తూ రాయలసీమ వద్ద గల బనకచర్ల లింక్ కెనాల్ తో కలిపేలా ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. ఇందులో గోదావరి జలాలను మళ్ళింపు చేసేది కేవలం రెండు నుంచి మూడు వందల టీఎంసీలు మాత్రమే. దానితోనే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది.
ఇది కూడా అతి ఖర్చుతో కూడిన పధకమే. దీని నిర్మాణానికి ఏకంగా 81 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. అయితే ఇది ఇంకా మొగ్గ దశలో ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ తీరు చూసుకుంటే కనుక మూడు సెగ్మెంట్ లుగా బనకచర్ల నిర్మాణం సాగనుంది. పోలవరం నుంచి ప్రకాశం బారేజ్ దాకా ఒకటి, అక్కడ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు రెండవ సెగ్మెంట్ అలాగే మూడవ సెగ్మెంట్ చూస్తే కనుక బనకచర్ల వరకు ఉంటుంది. ఇలా మూడు సెగ్మెంట్ లో నిర్మాణం జరుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ వల్ల గోదావరి నీళ్ళ విషయంలో తెలంగాణాకు జరిగే అన్యాయం ఏమీ లేదని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు చెబుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టు పై వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఆయన అన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలో సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టి తోనే ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు. అంతే కాదు తెలంగాణలో అంతర్గత రాజకీయాల కోసం బనకచర్ల పై విమర్శలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఇలా పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ మీద అఖిలపక్ష సమావేశం తెలంగాణా ప్రభుత్వం నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ ప్రాజెక్ట్ ని అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ అడ్డుకుంటామని స్పష్టం చేశారు అంతే కాదు చంద్రబాబు కేంద్రం వద్ద తన పలుకుబడిని ఉపయోగించి ప్రాజెక్ట్ కి అనుమతులు తెచ్చుకున్నా పూర్తి కాదని అన్నారు.
అంతే కాదు తాము గోదావరి మిగులు నీళ్ళను 900 టీఎంసీల దాకా ఉపయోగించుకుని ప్రాజెక్టులు కడతామని చెప్పారు అయితే గోదావరి మీద ఎగువ నుంచి ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఇంకా సమృద్ధిగా నీరు ఉంటుందని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. అందువల్ల సామరస్యంగానే ఈ వ్యవహారాలను చూడాలని అంటున్నారు.
అయితే రాజకీయం వైపుగా సాగుతోందని అంటున్నారు. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి మీద ఈ విషయంలో విమర్శలు చేస్తోంది. దాంతో కేసీఆర్ జగన్ సీఎంలుగా ఉండగానే బనకచర్లకు పునాదులు పడ్డాయని అలా జగన్ రాయలసీమకు గోదావరి నీటిని తీసుకుని పోవాలని చూశారని దానికి కేసీఅర్ సంతకం పెట్టి మరీ ఓకే చేశారు అని రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
దాంతో పోలవరం బనకచర్ల క్రెడిట్ మొత్తాన్ని జగన్ కి రేవంత్ రెడ్డి ఇచ్చేశారు అని అంటున్నారు. ఈ ప్రాజెక్టు చంద్రబాబు మానస పుత్రిక అని టీడీపీ వారు చెబుతూంటే జగన్ తన హయాంలోనే రాయలసీమకు గోదావరి నీళ్ళను మళ్ళించాలని గట్టి ప్రయత్నాలు చేసి కేసీఆర్ ని ఒప్పించారని రేవంత్ రెడ్డి అంటూ కేసీఆర్ జగన్ ల కుమ్మక్కు ఇదని అంటున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయం తెలంగాణాకు బాగున్నా ఏపీలో మాత్రం వైసీపీకి ఇది మేలు చేసేదిగా ఉందని అంటున్నారు. మరి దీని మీద టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.