మిషన్ క్లీన్ గోదావరి - కాలుష్యం నుంచి రక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్.. పవన్ సంచలన నిర్ణయం
గోదావరి నది దుస్థితిపై తీవ్రంగా చలించిపోయిన పవన్ కళ్యాణ్, రాజమండ్రిలోనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, తక్షణమే అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వచ్చే ఏడాది జూన్ లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పవిత్ర గోదావరి నదితోపాటు రాష్ట్రంలోని ప్రధాన నదులను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు అత్యున్నత స్థాయి ‘ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మంగళవారం రాత్రి ఈ ఆదేశాలు వెలువడ్డాయని చెబుతున్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో గోదావరి కాలుష్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఉప ముఖ్యమంత్రి పవన్ చలించిపోయారు. ఏడాదిలో పుష్కరాలు జరుగుతుండగా, నదిలో కలుషిత జలాలు కలపకుండా ఆపలేకపోతున్నారని అధికారులపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. దీంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారని చెబుతున్నారు.
రెండు రోజుల పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి మధ్యలో ఉన్న నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమల పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. పరిశ్రమల నుంచి వస్తున్న ప్రమాదకర రసాయన వ్యర్థాలు, నగరంలోని మురుగునీటిని శుద్ధి చేయకుండా నేరుగా పవిత్ర గోదావరిలో కలపడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తులు తాము మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావనతో వెళ్లకూడదు. ప్రతి ఒక్కరికీ పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్నామనే అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి కలగాలి’ అనే అభిప్రాయంతో నదీ కాలుష్యం నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
గోదావరి నది దుస్థితిపై తీవ్రంగా చలించిపోయిన పవన్ కళ్యాణ్, రాజమండ్రిలోనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, తక్షణమే అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ అత్యున్నత స్థాయి కమిటీకి పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కమిటీలో ఇతర కీలక సభ్యులుగా పురపాలక పరిపాలన శాఖ కమిషనర్, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి కమిషనర్, పరిశ్రమలు, వ్యవసాయం, మత్స్య శాఖల కమిషనర్లు ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర టూరిజం అథారిటీ సీఈఓ, దేవాదాయ శాఖ కమిషనర్, జలవనరుల శాఖ ఈఎన్‌సీ, గ్రామీణ నీటి సరఫరా ఈఎన్‌సీ, క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ మిషన్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. గోదావరి పరివాహక జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లు కూడా ఇందులో సభ్యులుగా వ్యవహరిస్తారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఏర్పాటైన ఈ టాస్క్ ఫోర్స్ తో గోదావరికి కొత్త కళ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కృతనిశ్చయంతో ఉన్నారని అంటున్నారు.
ప్రతి 15 రోజులకు సమీక్ష
ఇక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో కఠినంగా వ్యవహరించేలా విధులను ఖరారు చేశారు. 15 రోజులకు ఒకసారి కమిటీ తప్పనిసరిగా సమావేశమై పనుల ప్రగతిని సమీక్షించాలని సూచించారు. గోదావరితో పాటు ఇతర నదుల్లోకి కాలుష్యం ఎక్కడెక్కడ నుంచి చేరుతుందో క్షేత్రస్థాయిలో గుర్తించాలని దిశానిర్దేశం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సూచనల ప్రకారం మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవకుండా శాశ్వత పర్యావరణ రక్షణ చర్యలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన, పవిత్రమైన నదీ జలాలను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అడుగులు వేస్తోందని తాజా నిర్ణయాల ఆధారంగా విశ్లేషిస్తున్నారు.