ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత.. ఆన్‌లైన్ ప్రపంచంలో అత్యంత ద్వేషించబడుతున్న దేశంగా గుర్తింపు!

సర్వే ఫలితాల ప్రకారం వ్యతిరేకత అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే. టర్కీలో ఏకంగా 93% మంది ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు.;

Update: 2026-05-11 12:30 GMT

అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితులు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా గాజా, ఇరాన్ సంక్షోభాల తర్వాత ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత గణనీయంగా పెరిగిందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా వంటి దేశాల్లో ఇజ్రాయెల్‌కు తిరుగులేని మద్దతు ఉండేది, కానీ ఇప్పుడు అక్కడి యువతలో కనిపిస్తున్న మార్పు నెతన్యాహు ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

అంతర్జాతీయ తాజా సర్వే ప్రకారం.., ప్రపంచంలోని 24 దేశాలలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 20 దేశాలు ఇజ్రాయెల్ పట్ల ప్రతికూల దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. కేవలం కొన్ని ఆఫ్రికన్ దేశాలు (కెన్యా, నైజీరియా) మినహా, ప్రపంచంలోని మెజారిటీ దేశాల్లో ఇజ్రాయెల్, నెతన్యాహు ప్రతిష్ట మసకబారింది.

ఇజ్రాయెల్‌ను ద్వేషించడంలో టర్కీ ప్రథమం

సర్వే ఫలితాల ప్రకారం వ్యతిరేకత అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే. టర్కీలో ఏకంగా 93% మంది ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ముస్లిం దేశాలైన ఇండోనేషియా (80%) వంటి దేశాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పాశ్చాత్య దేశాలు జపాన్ (79%), నెదర్లాండ్స్ (78%), స్వీడన్ (75%), మరియు స్పెయిన్ (75%) లలో కూడా మెజారిటీ ప్రజలు ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తున్నారు.

అమెరికాలో మార్పు

ఇజ్రాయెల్‌కు అతిపెద్ద మిత్రదేశమైన అమెరికాలోనే ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అమెరికాలో 60% మంది ప్రజలు ఇజ్రాయెల్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. 50 ఏళ్ల లోపు వయసున్న అమెరికన్లలో ఇజ్రాయెల్ పట్ల ఆదరణ దారుణంగా పడిపోయింది. ప్యూ సర్వే ప్రకారం, గత రెండేళ్లలో ఈ వ్యతిరేకత 11 పాయింట్ల మేర పెరిగింది. ప్రపంచ వ్యవహారాల్లో నెతన్యాహు సరైన నిర్ణయాలు తీసుకుంటారన్న నమ్మకం అమెరికన్లలో కేవలం 40% మందికే ఉంది.

వ్యతిరేకతకు కారణాలు

సర్వేలో పాల్గొన్న వారు ఇజ్రాయెల్‌పై వ్యతిరేకతకు కొన్ని ముఖ్య కారణాలను పేర్కొన్నారు. గాజాలో జరుగుతున్న దాడులు, అక్కడ ఏర్పడిన ప్రాణనష్టం ప్రపంచ వ్యాప్తంగా సామాన్యులను కలచివేసింది. యుద్ధ భూమిలోని దృశ్యాలు నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చేరడం వల్ల ఇజ్రాయెల్ యొక్క ఇమేజ్ దెబ్బతింది. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థల హెచ్చరికలను బేఖాతరు చేయడం వ్యతిరేకతకు దారితీసింది. హార్మూజ్ జలసంధి మూసి వేయడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం దెబ్బతిని పరిస్థితులు అప్పుల వరకు తీసుకెళ్లాయి.

ఒకవైపు సైనికపరంగా ఇజ్రాయెల్ బలంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ వేదికపై 'సాఫ్ట్ పవర్' మరియు ప్రజాభిప్రాయాన్ని కోల్పోవడం ఆ దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా మిత్రదేశాల యువతలో మద్దతు తగ్గడం అనేది నెతన్యాహు ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

Tags:    

Similar News