నకిలీ ఔషధాలు.. వాటిలో ఏమి ఉన్నాయంటే?
ఇటీవల ఘజియాబాద్ (Ghaziabad)లో బయటపడిన నకిలీ ఔషధాల కర్మాగారం ఈ భయాన్ని నిజం చేసింది.;
నకిలీ.. నకిలీ.. నకిలీ.. ఈ మాటలు వినగానే కోపం కలుగకమానదు. ఆరోగ్యం, మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపని వస్తువులు నకిలీ అయినా.. కొంత పర్వాలేదు.. కానీ పన్నీర్, గుడ్లు, స్వీట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చిరాకు వేస్తుంది. అదే నకిలీ మందులు (ఔషధాలు) అంటే ఆందోళన కలుగకమానదు. ఇప్పుడు అదే జాబితాలోకి నకిలీ ప్రాణాలను రక్షించే మందులు కూడా చేరాయి. ఇది పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మార్చివేస్తుందో అర్థమవుతుంది. మనం తినే ఆహారం కల్తీ అయితే ఒక హద్దు వరకు తట్టుకోవచ్చు అనుకుంటాం. కానీ మనం నమ్మి రోగాలను నయం చేసే వ్యాధులకు వాడే మాత్రే నకిలీ అయితే? అది వ్యాధిని తగ్గించకపోగా, ప్రాణాలకే ముప్పు తెస్తే? ఈ ప్రశ్నే ఈరోజు భారత మార్కెట్ల ముందు నిలిచిన అతి పెద్ద సవాల్..
ఇటీవల ఘజియాబాద్ (Ghaziabad)లో బయటపడిన నకిలీ ఔషధాల కర్మాగారం ఈ భయాన్ని నిజం చేసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దాడుల్లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం కేవలం ఒక అక్రమ వ్యాపారం కాదు, అది ప్రజారోగ్యంపై జరుగుతున్న నిశ్శబ్ద దాడి. కోట్ల రూపాయల విలువైన నకిలీ మందులు, అసలు బ్రాండ్‌లను పోలిన ప్యాకింగ్, నమ్మకం కలిగించే లేబుళ్లు.. ఇవన్నీ చూస్తే ఇది చిన్న మోసం కాదని స్పష్టం అవుతోంది. ఇది ఒక పద్ధతిగా, ప్లాన్‌తో నడిచే నేర పరిశ్రమ.
మార్కెట్ లోకి వస్తే పట్టుకోవడం కష్టం..
ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న నకిలీ మందులు చర్మ వ్యాధులకు వాడే క్రిముల నుంచి ఇతర అవసరమైన ఔషధాల వరకూ ఉన్నాయి. బెట్నోవేట్ వంటి పేరున్న మందులకు నకిలీ తయారు చేసిన ఈ ఉత్పత్తులు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలకు సరఫరా అయినట్టు అధికారులు చెబుతున్నారు. అంటే ఇది ఒక్క పట్టణానికే పరిమితం కాదు.. ఒకసారి ఇలాంటి మందులు మార్కెట్‌లోకి వస్తే, అవి ఎంత మంది చేతుల్లోకి వెళ్లాయో, ఎంత మంది ఆరోగ్యంతో ఆటలాడుకున్నాయో లెక్క వేయడం కష్టం.
ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే. ఇలాంటి నకిలీ మందులు తయారై, ప్యాక్ అయి, రవాణా అయి, మెడికల్ షాపుల వరకు ఎలా చేరుతున్నాయి? నియంత్రణ వ్యవస్థ ఎక్కడ బలహీనపడుతోంది? ఔషధ సరఫరా గొలుసులో ఉన్న ప్రతి లింక్ బలంగా ఉంటే, ఇలాంటి ప్రమాదకర ఉత్పత్తులు బయటకు రావడానికి అవకాశం ఉండదు. కానీ వాస్తవం వేరేలా ఉంది. చౌక ధరలపై ఉన్న డిమాండ్, త్వరగా లాభాలు సంపాదించాలనే ఆశ, తనిఖీల్లో లోపాలు.. ఇవన్నీ కలిసి ఈ నకిలీ వ్యాపారానికి ఊపిరి పోస్తున్నాయి.
సోషల్ మీడియాలో దుమారం..
ఈ ఘటన సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారి తీసింది. ‘ముందు నకిలీ పన్నీర్, గుడ్లు, కోల్గేట్.. ఇప్పుడు నకిలీ మందులా?’ అనే ప్రశ్నలు సామాన్యుల ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. నిజానికి ఈ ఆగ్రహం సమంజసమే. ఎందుకంటే మందుల విషయంలో వినియోగదారుడికి ఎంపిక చేసే అవకాశం చాలా తక్కువ. డాక్టర్ రాసిన మందు నమ్మి కొనడం తప్ప వేరే దారి ఉండదు. ఆ నమ్మకాన్నే ఎవరో లాభాల కోసం దోచుకుంటే, అది నేరం కంటే ఘోరం.
బయటపడుతున్న లోపాలు..
ప్రభుత్వం, చట్ట అమలు సంస్థలు ఇలాంటి కేసులను బయటపెడుతుండడం ఒకవైపు ఊరటనిస్తే, మరోవైపు వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా బయటపెడుతోంది. ఒక కర్మాగారం పట్టుబడింది అంటే, ఇలాంటివి మరెన్నో ఇంకా కనిపించకుండా ఉన్నాయేమో అన్న అనుమానం సహజం. కాబట్టి చర్యలు కేవలం అరెస్టులతో ఆగిపోకూడదు. ఔషధాల తనిఖీ వ్యవస్థను మరింత కఠినతరం చేయాలి. ల్యాబ్ పరీక్షలు, ట్రాకింగ్ సిస్టమ్స్, సప్లయ్ చైన్ మానిటరింగ్ అన్నీ బలపడాలి.
ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి..
అదే సమయంలో ప్రజలకూ ఒక బాధ్యత ఉంది. అత్యంత చౌకగా లభిస్తున్న మందులపై అనుమానం పెట్టుకోవాలి. అనుమానాస్పద ప్యాకింగ్, ధరల్లో భారీ తేడాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఈ యుద్ధంలో ప్రభుత్వం ఒంటరిగా గెలవలేదు. వినియోగదారుల అప్రమత్తతే ఈ నకిలీ ప్రాణాంతక వ్యాపారానికి అడ్డుకట్ట.
చివరికి ఈ ఘజియాబాద్ ఘటన మనకు ఇచ్చే సందేశం స్పష్టం. కల్తీ అనేది ఆహారం వరకే పరిమితం కాదు. అది మన ఆరోగ్యానికీ, ప్రాణాలకూ ముప్పుగా మారింది. నమ్మకమే మార్కెట్‌కు మూలధనం. ఆ నమ్మకం కూలిపోతే, దాని శకలాలు ప్రాణాలపై పడతాయి. అందుకే నకిలీ మందులపై పోరాటం కేవలం చట్టపరమైన చర్య కాదు.. అది సమాజం మొత్తానికి సంబంధించిన బాధ్యత.