అన్నంత పనీ చేస్తోన్న ఇజ్రాయెల్... డబ్ల్యూహెచ్ఓ, యూఎన్ తీవ్ర ఆందోళన!
తమ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు చేసిన పాశవిక ఊచకోత అనంతరం గాజాను ఇజ్రాయెల్ గజగజ లాడించేస్తున్న సంగతి తెలిసిందే.;
తమ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు చేసిన పాశవిక ఊచకోత అనంతరం గాజాను ఇజ్రాయెల్ గజగజ లాడించేస్తున్న సంగతి తెలిసిందే. వారి వద్ద బంధీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేయాలని కోరుతూ ఐడీఎఫ్ విరుచుకుపడుతోంది. ఈ సమయంలో గాజాలోని ప్రజల పరిస్థితి అత్యంత దయణీయంగా మారింది. ఈ సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
అవును... హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్.. ఆ యుద్ధంలో గాజాను నామరూపాల్లేకుండా చేసేసింది! ఇక ప్రస్తుతం అక్కడ ప్రజల పరిస్థితి అత్యంత దయణీయంగా ఉంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో తమ సైన్యం జరిపిన దాడుల్లో 60 మంది పౌరులు మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ స్పందించింది.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ అధిపతి టెడ్రోస్ అధనోమ్.. భావోద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా.. ప్రస్తుతం గాజాలోని ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోగలనని.. యుద్ధం కారణంగా నెలకొన్న భయానక పరిస్థితులు ప్రజలను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నాయని.. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు.
ప్రధానంగా.. యుద్ధ సమయంలో ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరమని చెప్పిన టెడ్రోస్.. వైద్య సదుపాయాలను అడ్డుకోవడం కూడా చాలా తప్పని అన్నారు. ఈ సమయంలో గాజాలోని ప్రజలపై కాస్త దయచూపాలని ఇజ్రాయెల్ ను కోరుతున్నట్లు చెప్పిన ఆయన.. ఘర్షణలతో శాస్వత పరిష్కారం లభించదని.. శాంతి మానవాళికి మంచిదని అన్నారు.
మరోపక్క గాజాలో ప్రజల తాజా పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పందిస్తూ.. ఇజ్రాయెల్ యుద్ధం అత్యంత క్రూరదశలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సుమారు 400 ట్రక్కుల్లో గాజాలోకి సాయం ప్రవేశిస్తే.. కేవలం 115 ట్రక్కుల సాయం మాత్రమే ఇప్పటివరకూ అందిందని.. అక్కడి ప్రజలకు వరదలా అందాల్సిన సాయం కాస్తా చెంచాడంత అందుతోందని అన్నారు!
కాగా గాజాపై ఐడీఎఫ్ దాడుల నేపథ్యంలో స్పందించిన ఇజ్రాయెల్ నేత మోషే ఫైగ్లిన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తమ శత్రువు హమాస్, దాని మిలటరీ వింగ్ మాత్రమే కాదని.. గాజాలోని ప్రతీ బిడ్డా తమకు శత్రువే అని.. ఆ నగరాన్ని తాము ఆక్రమించుకొని, అక్కడ స్థిరపడాలని.. ఈ క్రమంలో అక్కడ ఒక్క బిడ్డా మిగలదని.. దానికి మించి తమకు మరో విజయం లేదని వ్యాఖ్యానించారు!