వైసీపీలోకి టీడీపీ ఎంపీ గల్లా....!?

టీడీపీ 2019లో మూడు ఎంపీ సీట్లు గెలిస్తే అందులో ఇద్దరు పార్టీకి దూరం అయ్యారని ప్రచారంలో ఉంది.

Update: 2024-01-11 09:20 GMT

టీడీపీ 2019లో మూడు ఎంపీ సీట్లు గెలిస్తే అందులో ఇద్దరు పార్టీకి దూరం అయ్యారని ప్రచారంలో ఉంది. వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా జగన్ ని కలసి వచ్చారు. ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖరారు అయింది. ఇపుడు మరో ఎంపీ మీద వైసీపీ కన్ను పడింది అని అంటున్నారు.

ఆయన ఎవరో కాదు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ఆయన 2014, 2019లలో రెండు సార్లు గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పనిచేశారు. అయితే గత కొంతకాలంగా జయదేవ్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన రాజకీయ వైరాగ్యంలో ఉన్నారని కూడా అంటున్నారు.

గల్లా జయదేవ్ టీడీపీ అధినాయకత్వానికి దూరంగా జరుగుతున్న నేపధ్యాన్ని వైసీపీ గమనిస్తూ వస్తోంది. ఇపుడు ఆయనను తమ వైపు తిప్పుకోవడానికి చూస్తంది అని అంటున్నారు. తాజాగా ఆయన వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డితో సమావేశం అయ్యారని తెలుస్తోంది.

ఇద్దరిదీ ఒకే నియోజకవర్గం కావడంతో ఈ భేటీ జరిగిందని భావించినా ఈ సమయంలో ఈ మీట్ జరగడం మాత్రం ఆసక్తిని రేపుతోంది. అది కూడా కేశినేని నాని వైసీపీ వైపు వచ్చిన వేళ గల్లా జయదేవ్ వైసీపీ ఎమ్మెల్యే, జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డితో భేటీ అంటే అది మామూలుగా చూడాల్సిన విషయం కాదని అంటున్నారు.

Read more!

ఇక దీని మీద అపుడే సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తొందరలోనే గల్లా జయదేవ్ కలుస్తారు అని కూడా ప్రచారం మొదలైంది. ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తారని కూడా అంటున్నారు.

అంతే కాదు టీడీపీలో కీలక నేతలను కూడా వైసీపీ టార్గెట్ చేసింది అన్న టాక్ ఉంది. ఆపరేషన్ టీడీపీ పేరుతో వైసీపీ రానున్న రోజులలో పెద్ద ఎత్తున ముఖ్య నేతలను తమ పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది అని అంటున్నారు.

Tags:    

Similar News