గళ్లా మాధవికి కోపమొచ్చిన వేళ.. ఏం జరిగింది..?
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న గళ్ళ మాధవి.. తాజాగా తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు.;
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న గళ్ళ మాధవి.. తాజాగా తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అధికారులు తన మాట వినడం లేదన్నది మాధవి ఆరోపించిన ప్రధాన విషయం. దీనికి సంబంధించి ఆమె పలు ఆధారాలను కూడా మీడియా ముందు ప్రదర్శించారు. దీంతో అసలు ఏం జరుగుతోంది నియోజకవర్గం లో అనేది పార్టీ వర్గాల మధ్య చర్చకి వచ్చింది. వాస్తవానికి నియోజకవర్గంలో తరచూ పర్యటించే ఎమ్మెల్యేగానే కాకుండా.. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ప్రజలను కలుసుకుని వారి సమస్యలు పరిష్కరించే మహిళా నాయకురాలిగా మాధవి పేరు తెచ్చుకున్నారు.
బైక్ పైనే నియోజకవర్గంలోని రోడ్లపై తిరుగుతూ పారిశుధ్యం పరిసరాల పరిశుభ్రత వంటి కీలక అంశాలను ఆమె పర్యవేక్షిస్తు న్నారు. అదేవిధంగా ఇటీవల కేవలం మహిళల కోసమే ఒక సమస్యల పరిష్కార కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పార్టీపరంగా నాయకులను కలుసుకునేందుకు కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం చేపట్టిన ప్రజల మధ్యకు తీసుకువెళుతున్నారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా అధికారులతో గల్లా మాధవికి వివాదాలు రావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండే గళ్ళ మాధవి ఏనాడు అధికారులపై విమర్శలు చేసింది లేదు. ఎప్పుడు అధికారులపై ఆధిపత్యం ప్రదర్శించేది కూడా లేదు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా తనను కనీసం సంప్రదించకుండానే అధికారులు పనిచేస్తున్నారని, అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా లేరా అన్న విషయాన్ని కూడా వారు పట్టించుకోవడంలేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీనికి ప్రధాన కారణం ఇటీవల వచ్చిన మొంథా తుఫాను కారణంగా తలెత్తిన కష్టనష్టాలను పర్యవేక్షించేందుకు పరిశీలించేందుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
ఈ క్రమంలో అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు కూడా సూచించింది. కానీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో కొందరు అధికారులు ఎమ్మెల్యేకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదికలు సిద్ధం చేసేసి పంపించటం వివాదానికి దారి తీసింది. తన మాటకు తన పదవికి కూడా అధికారులు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది మాధవి ఆవేదన. దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని కూడా ఆమె చెప్పారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. అయితే.. అధికారులను తెరవెనుక మరోనేత నడిపిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. దీనిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది.