కంచె గచ్చిబౌలి ఇష్యూ: సుప్రీం కమిటీ అడిగిందేంటి? సర్కారు చెప్పిందేంటి?
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కంచె గచ్చిబౌలి400 ఎకరాలకు సంబంధించిన వాస్తవాల్ని గుర్తించేందుకు సుప్రీంకోర్టు సాధికార కమిటీని ఏర్పాటు చేయటం తెలిసిందే.;
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కంచె గచ్చిబౌలి400 ఎకరాలకు సంబంధించిన వాస్తవాల్ని గుర్తించేందుకు సుప్రీంకోర్టు సాధికార కమిటీని ఏర్పాటు చేయటం తెలిసిందే. కమిటీ ఛైర్మన్.. ముగ్గురు సభ్యులతో కూడిన టీం మంగళవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకోవటం తెలిసిందే. బుధవారం తన పనిని షురూ చేసింది. సుప్రీం కమిటీ ఛైర్మన్ గా సిద్ధాంత దాస్.. కమిటీ సభ్యులుగా సీపీ గోయల్.. సునీల్ లిమాయే.. చంద్రత్ లు ఉన్నారు.
బుధవారం ఉదయం కంచె గచ్చిబౌలిలోని వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాపు2 గంటల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిటీ.. పలు ప్రశ్నల్ని సంధించారు. వీటిల్లో ముఖ్యమైనవి చూస్తే..
- ఇది అటవీ భూమేనా?
- ఎన్ని ఎకరాల్లో చెట్లను తొలగించారు?
- చెరువులు ఎక్కడ ఉన్నాయి?
- వన్యప్రాణాలు ఎక్కడ తిరుగుతుంటాయి?
- చెట్లు కొట్టేసిన ప్రాంతం ఎక్కడ ఉంది?
- ఈ భూములు ప్రభుత్వ రికార్డుల్లో ఏమని ఉన్నాయి?
- చెట్లను కొట్టేసే సమయంలో నిబంధనల్ని పాటించారా?
- చెట్ల కొట్టివేత వేళ వాల్టా చట్టాన్ని పాటించారా?
- అనుమతులు తీసుకోవాల్సిన చెట్లు ఎన్ని ఉన్నాయి?
ఈ తరహాలో పలు ప్రశ్నల్ని అడిగినట్లుగా సమాచారం. దీనికి బదులుగా ప్రభుత్వం తరఫున పలువురు అధికారులు కంచె గచ్చిబౌలి అంశాన్ని.. దీనిపై నెలకొన్న వివాదం గురించి వివరించినట్లుగా చెబుతున్నారు. ఈ 400 ఎకరాలు అటవీయేతర ప్రాంతమేనని.. రెవెన్యూ.. అటవీశాఖల రికార్డుల్లో ఎక్కడా దీన్ని అటవీ భూమిగా నమోదు చేయలేదన్న విషయాన్ని వివరించినట్లుగా తెలుస్తోంది.
చెట్ల నరికివేత నిబంధనలకు అనుగుణంగానే సాగిందని.. ఇప్పటివరకు100 ఎకరాల్లో చెట్లను తొలగించామని పేర్కొంది. అంతేకాదు.. చెట్ల తొలగింపులో వాల్టా చట్టాన్ని అనుసరించామని.. అనుమతులకు మినహాయింపు ఉన్న సుబాబుల్ లాంటి చెట్లే అక్కడ 95 శాతం మేర ఉన్నాయని.. 120 నుంచి 130చెట్లకు మాత్రమే అనుమతులు తీసుకోవాల్సి ఉందని అధికారులు వివరించారు. అనుమతులకు అవసరమైన వేప తదితర రకాల చెట్లు ఉన్నాయని చెప్పారు. అధికారులు వివరించే వేళ.. అటవీ శాఖ అధికారుల క్లారిఫికేషన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
అసలీ 400 ఎకరాలకు సంబంధించిన చరిత్ర.. అసలేం జరిగిందన్న వివరాల్ని పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కంచె గచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాలకు బదులుగా హెచ్ సీయూకు 397 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించిందని.. దీన్ని హెచ్ సీయూ రిజిస్ట్రార్ అప్పుడే పంచనామాతో స్వాధీనం చేసుకున్న విషయాన్ని వివరించారు. ఈ కారణంగానే 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములపై హక్కుల్ని హెచ్ సీయూ వదులుకుందని కమిటీకి తెలిపినట్లుగా తెలుస్తోంది.