జూలై 2025 నాటికి ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులు వీరే… బిల్ గేట్స్ కి ఏమైంది?

మే 2024 నుండి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.;

Update: 2025-07-09 05:16 GMT

మే 2024 నుండి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. గత సంవత్సరం $400 బిలియన్ల నికర విలువను దాటిన మొదటి బిలియనీర్‌ గా వార్తల్లో నిలిచిన మస్క్ వైభవానికి ప్రధానంగా $350 బిలియన్లతో స్పేస్ ఎక్స్ అద్భుతమైన విలువ కారణంగా చెప్పవచ్చు. అయితే.. ఈసారి టాప్ 10 కుబేరుల జాబితాలో బిల్ గేట్స్ కు స్థానం దక్కలేదు.

అవును... 2025 జులైకు సంబంధించి ఫోర్బ్స్‌ ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో... ఫోర్బ్స్‌ ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 2025లో 3,028కి పెరిగింది. వీరి మొత్తం సంపద విలువ 16.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ తాజా నివేదిక ప్రకారం.. స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ టాప్ వన్ కుబేరుడిగా కొనసాగుతున్నారు!

వాస్తవానికి ఈ ఏడాది జూన్‌ తో పోలిస్తే ఎలాన్ మస్క్ సంపద విలువ 16 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో.. ఆయన సంపద విలువ 407 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంటే... అక్షరాలా రూ.34.6 లక్షల కోట్లన్నమాట. సంపద విలువ కాస్త తగ్గినా... గత ఏడాది మే నెల నుంచి ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయన ఫస్ట్ ప్లేస్ మాత్రం అలానే ఉంది.

ఇక ఎలాన్ మస్క్ తర్వాత స్థానంలో ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకులు లారీ ఎలిసన్‌ నిలిచారు. వాస్తవానికి ఆయన గతంలో నాలుగో స్థానంలో ఉండేవారు.. అయితే... జూన్‌ తో పోలిస్తే ఒరాకిల్‌ షేరు 32% రాణించడంతో, తన సంపదకు 56 బిలియన్ డాలర్లను జత చేసుకున్నారు. దీంతో.. 275.9 బిలియన్ డాలర్లతో ఆయన రెండో స్థానంలో నిలిచారు.

ఇదే సమయంలో... ఎన్విడియా సీఈఓ, సహ వ్యవస్థాపకుడిగా ఉన్న జెన్సెక్‌ హువాంగ్‌ సంపద విలువ 20 బిలియన్ డాలర్లు పెరగడంతో, ఆయన టాప్ 10లోకి చేరారు. మరోవైపు తన సంపద విలువ 7 రోజుల్లోనే దాదాపు 30% తగ్గి, 124 బిలియన్‌ డాలర్లకు పరిమితం కావడంతో.. టాప్ 10 కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ కు స్థానం దక్కలేదు.

ఏది ఏమైనా... టాప్ 10 కుబేరుల సంపద విలువ జూన్‌ 1తో పోలిస్తే 100 బిలియన్‌ డాలర్లు అధికమై 2 లక్షల కోట్ల డాలర్లకు చేరగా... వీరిలో ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ మినహా, మిగిలినవారంతా అమెరికన్లే కావడం గమనార్హం. ఇక భారత్ నుంచి సుమారు 116 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 15వ స్థానంలో ముకేశ్‌ అంబానీ ఉన్నారు.

ఫోర్బ్స్ ప్రకారం.. జూలై 8 - 2025 నాటికి ఈ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితా ఈ కింది విధంగా ఉంది. అయితే... వీరి నికర విలువలు ప్రతిరోజూ కాస్త అటు ఇటుగా మారవచ్చు! అందుకు కారణం స్టాక్ ధరల్లో హెచ్చు తగ్గులే!!

1. ఎలోన్ మస్క్ - $393.1 బి. డాలర్లు

2. లారీ ఎల్లిసన్ - $275.9 బి. డాలర్లు

3. మార్క్ జుకర్‌ బర్గ్ - $247.9 బి. డాలర్లు

4. జెఫ్ బెజోస్ - $236.8 బి. డాలర్లు

5. బెర్నార్డ్ ఆర్నాల్ట్ & కుటుంబం - $147.7 బి. డాలర్లు

6. లారీ పేజ్ - $146.2 బి. డాలర్లు

7. వారెన్ బఫెట్ - $143.1 బి. డాలర్లు

8. స్టీవ్ బాల్మెర్ - $141.3 బి. డాలర్లు

9. సెర్గీ బ్రిన్ - $139.7 బి. డాలర్లు

10. జెన్సెన్ హువాంగ్ - $137.9 బి. డాలర్లు

Tags:    

Similar News