టీడీపీ తొలి జాబితాలో బిగ్ నంబర్....?
తెలుగుదేశం పార్టీ తొలి జాబితాను సాధ్యమైనంత త్వరలో రిలీజ్ చేయడానికి చూస్తోంది.;
తెలుగుదేశం పార్టీ తొలి జాబితాను సాధ్యమైనంత త్వరలో రిలీజ్ చేయడానికి చూస్తోంది. తొలి జాబితా మీద పూర్తి స్థాయి కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి జిల్లాకు అయిదారుగురు వంతున తొలి జాబితాలో చోటు దక్కనుంది అని అంటున్నారు.
మొత్తంగా చూస్తే టీడీపీ తొలి జాబితాలో 76 మంది పేర్లు ఉంటాయని అంటున్నారు. ఈ నంబర్ చూస్తే ఒక విధంగా పెద్దదే అంటున్నారు. ఏపీలో మొత్తం 175 సీట్లు ఉంటే అందులో 76 మంది పేర్లను ఒకేసారి ప్రకటించడం అంటే టీడీపీ పూర్తి స్థాయి అవగాహనతో ఉందని అంటున్నారు.
అదే విధంగా చూస్తే టీడీపీకి పొత్తులు ఉన్నాయి. జనసేనకు కచ్చితంగా సీట్లు ఇవ్వాలి. అదే విధంగా బీజేపీ కలసి వస్తే ఆ పార్టీకి కూడా సీట్లు పంచాలి అయినా సరే టీడీపీ అత్యధిక స్థానాలలో పోటీ చాస్తుంది అని చెప్పడానికే తొలి జాబితాలో బిగ్ నంబర్ తో వస్తోంది అని అంటున్నారు.
తొలి జాబితాలో వైసీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను పక్కన పెడితే పందొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారని అంటున్నారు. అదే విధంగా ఆయన నియోజకవర్గాలలో ఎలాంటి గ్రూపులూ లేని పరిస్థితి ఉంటే అభ్యర్ధి బలంగా ఉంటూ ప్రలలతో మమేకం అయితే చాలు అతని పేరుని ఖరారు చేస్తారని అంటున్నారు. అంటే బలమైన సీట్లలో పోటీ లేని చోట ముందుగానే అభ్యర్ధులను టీడీపీ సెలెక్ట్ చేస్తుంది అన్న మాట.
ఇంకో వైపు చూస్తే టీడీపీ పొత్తులలో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది అన్న చర్చ కూడా నడుస్తోంది. జనసేన అయితే గౌరవప్రదమైన సీట్లు అని అంటోంది. అయితే టీడీపీ పాతిక నుంచి మొదలెట్టి ముప్పయి సీట్లతో సరిపెడుతుంది అని అంటున్నారు. జనసేన ఈ సీట్లకు అంగీకరిస్తుందా అన్నది చూడాలి. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాలి అన్న ఏకైక అజెండాతో ఉన్న జనసేన అటూ ఇటూగా సర్దుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక జనసేన నుంచి తొలి జాబితాగా 16 సీట్లకు అభ్యర్ధులు ఖరారు అయ్యారని అంటున్నారు. అందులో అత్యధికం ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్నారని చెబుతున్నారు. అలా జనసేన ఫస్ట్ లిస్ట్ కూడా తొందరలోనే రావచ్చు అని తెలుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలోనూ అవగాహన ఉందని అంటున్నారు.
ఇక బీజేపీ కనుక పొత్తుకు సిద్ధం అయితే ఆ పార్టీకి 2014లో ఇచ్చినట్లుగానే 12 సీట్ల దాకా ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. అందులో ఉత్తరాంధ్రాలో కొన్ని మిగిలిన చోట్ల మరికొన్ని అడ్జస్ట్ చేస్తారు అని అంటున్నారు. ముందస్తు ఎన్నికలు తప్పవని వార్తలు వస్తున్న నేపధ్యంలో టీడీపీ జోరు పెంచేసింది. దాంతోనే ఫస్ట్ లిస్ట్ అంటూ ఎన్నడూ లేని విధంగా ముందుగానే అభ్యర్ధులను ప్రకటించేందుకు ఉత్సాహపడుతోంది. దసరా నాటికి పొత్తు లెక్కలు కూడా ఒక కొలిక్కి వస్తాయని అంతా భావిస్తున్నారు.