విదేశాల్లో భారతీయులపై జాత్యహంకారం ఎందుకు పెరుగుతోంది? కారణమేంటి?

విదేశాల్లో భారతీయులపై పెరుగుతున్న జాత్యహంకారం ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-04-28 11:30 GMT

విదేశాల్లో భారతీయులపై పెరుగుతున్న జాత్యహంకారం ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కేవలం సోషల్ మీడియా కామెంట్లకు.. ట్రోల్స్‌కు మాత్రమే పరిమితమైన ఈ విద్వేషం.. ఇప్పుడు విదేశీ వీధుల్లో భారతీయులను ముఖాముఖి వేధించే స్థాయికి చేరడం కలవరపెడుతోంది. ముఖ్యంగా యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు తమ భద్రత , గౌరవంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ ద్వేషం నుంచి క్షేత్రస్థాయి దాడుల వరకు..

గతంలో భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు ఎక్కువగా అజ్ఞాతంగా ఆన్‌లైన్ వేదికలపై జరిగేవి. కానీ ఇటీవల కాలంలో ఇది "ఓపెన్ రేసిజం"గా రూపాంతరం చెందింది. రెడిట్ వంటి వేదికలపై భారతీయులు పంచుకుంటున్న అనుభవాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పోర్చుగల్‌లో ఒక భారతీయుడిని చూసి బహిరంగంగా భారత ప్రధాని గురించి, భారతీయ సంస్కృతి గురించి అవహేళన చేయడం.. రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ సిబ్బంది హేళనగా మాట్లాడటం వంటివి సమాజంలో మారుతున్న ధోరణికి నిదర్శనం.

సోషల్ మీడియా "రీల్స్", నెగటివ్ ఇమేజ్

భారతీయులపై ఈ వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణాల్లో సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఒకటి. భారతదేశంలోని అపరిశుభ్రమైన వీధి ఆహార వీడియోలను పదేపదే చూపించడం ద్వారా భారతీయులంటేనే "అపరిశుభ్రమైన వారు" అనే ముద్ర వేస్తున్నారు. భారతీయుల ఇంగ్లీష్ మాట్లాడే విధానాన్ని లేదా వారి ఆహారపు అలవాట్లను ముఖ్యంగా మసాలాల వాసన కించపరుస్తూ చేసే కామెడీ రీల్స్ ఇప్పుడు విద్వేషానికి ముడిసరుకుగా మారుతున్నాయి. కెనడా వంటి దేశాల్లో పెరుగుతున్న నిరుద్యోగం, గృహ నిర్మాణ సంక్షోభానికి భారతీయులే కారణమనే తప్పుడు ప్రచారాన్ని అక్కడి లోకల్ ఇన్‌ఫ్లూయెన్సర్లు బలంగా నూరిపోస్తున్నారు.

ఆర్థిక, సామాజిక కారణాలు

విదేశాల్లో భారతీయుల పట్ల పెరుగుతున్న అసూయ కూడా ఈ జాత్యహంకారానికి ఒక కారణం. ఐటీ రంగంలో, వైద్య రంగంలో, వ్యాపారాల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉండటం.. స్థానికుల ఉద్యోగ అవకాశాలను భారతీయులు కొల్లగొడుతున్నారనే భావన స్థానికుల్లో పెరుగుతోంది. దీనివల్ల నిత్య జీవితంలో చిన్న చిన్న విషయాలకు కూడా భారతీయులను టార్గెట్ చేయడం ప్రారంభించారు. "ఆన్‌లైన్‌లో చూసే ప్రతి చిన్న విషయాన్ని నిజమని నమ్మే యువత, విదేశాల్లో ఉన్న భారతీయులను విరోధులుగా చూస్తున్నారు. ఇది కేవలం వ్యక్తుల మధ్య సమస్య కాదు, ఇది గ్లోబల్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్." అని సామాజిక విశ్లేషకుల అభిప్రాయం.

భారతీయులు ప్రపంచవ్యాప్తంగా శాంతియుతమైన, కష్టపడి పనిచేసే వర్గంగా గుర్తింపు పొందారు. అయితే మారుతున్న కాలంలో సోషల్ మీడియా సృష్టిస్తున్న "డిజిటల్ గ్లాస్ హౌస్" ప్రభావం వల్ల భారతీయుల ప్రతిష్ఠకు భంగం కలుగుతోంది. విదేశీ ప్రభుత్వాలు జాత్యహంకార చట్టాలను కఠినతరం చేయడంతో పాటు.. భారత ప్రభుత్వం కూడా దౌత్యపరంగా ఈ విషయాలపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటివరకు విదేశాల్లో ఉన్న భారతీయులు సమన్వయంతో అప్రమత్తంగా ఉంటూ తమ గొంతును సమర్థవంతంగా వినిపించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News