ట్రంప్, నెతన్యాహుకు ఫత్వా జారీ... ఉరిశిక్ష, శిలువ వేయడం..ముస్లింలకు మతాధికారి కీలక పిలుపు!

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఆయుధాలతో చేసుకునే యుద్ధం ముగిసింది కానీ.. మాటల యుద్ధం, మరికొన్ని రకాల సంఘర్షణలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.;

Update: 2025-06-30 05:19 GMT

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఆయుధాలతో చేసుకునే యుద్ధం ముగిసింది కానీ.. మాటల యుద్ధం, మరికొన్ని రకాల సంఘర్షణలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. యుద్ధం ముగిసిన అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్.. అమెరికా ముఖంపై పిడిగుద్దులు గుద్దామని, అణు కేంద్రాలపై వారు చేసిన దాడి పెద్దగా నష్టం కలిగించలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించిన ట్రంప్... యుద్ధంతో నాశమైన దేశానికి సుప్రీం నేతైన ఖమేనీ, ఇజ్రాయెల్‌ పై నెగ్గానని మూర్ఖంగా మాట్లాడుతున్నారని, అది అబద్ధమనే విషయం ఆయనకూ తెలుసని.. ఇజ్రాయెల్, అమెరికా దళాల చేతుల్లో ఆయన నీచమైన చావు చావకుండా తాను రక్షించానని.. అయినప్పటికీ ఖమేనీ నాకు ధన్యవాదాలు చెప్పలేదని అన్నారు. ఈ సమయంలో ఇరాన్ నుంచి పత్వా జారీ అయ్యింది!

అవును... అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును దేవుని శత్రువులుగా పరిగణిస్తూ ఇరాన్‌ లోని ప్రముఖ షియా మతాధికారి అయతుల్లా నాజర్ కమరెం షిరాజీ.. ఫత్వా జారీ చేశారు. ఇకపై వీరిద్దరికీ వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వీరిద్దరికి ఏ ముస్లిం నాయకులు మద్దతు ఇవ్వొద్దని ఫత్వాలో పేర్కొన్నారు.

ఇదే సమయంలో... దేవుని శత్రువులైన ట్రంప్, నెతన్యాహులు చెప్పిన మాటలకు, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయాలని ముస్లింలను అయతుల్లా నాజర్ షిరాజీ కోరారు. నాయకుడిని బెదిరించే ఏ వ్యక్తైనా, ప్రభుత్వమైనా అట్టివారిని 'దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి' (మొహరేబ్గా) పరిగణిస్తారని షిరాజీ ఫత్వాలో పేర్కొన్నట్లు జెరుసలేం పోస్ట్ నివేదించింది.

ఈ సందర్భంగా... మొహరేబ్‌ గా గుర్తించబడిన వ్యక్తులకు ఉరిశిక్ష, శిలువ వేయడం, లేదా బహిష్కరించబడతారని నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ముస్లింలు లేదా ఇస్లామిక్ దేశాలు.. శత్రువులకు ఎలాంటి సహకారాన్నైనా, మరెలాంటి మద్దతునైనా ఇవ్వడంపై నిషేధం ఉంటుందని అంటున్నారు. దీంతో.. ముస్లిం దేశాల నిర్ణయం ఏమిటనేది ఆసక్తిగా మారింది!

కాగా... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్... పలు అణు కేంద్రాలతో పాటు, పలువురు అణు శాస్త్రవేత్తలతో పాటు పలు కీలక సైనికాధికారులను మట్టుబెట్టింది. ఖమేనీని టార్గెట్ చేసినా.. అతడు దొరకలేదని తెలిపింది!

ఈ సమయంలో... అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఇరాన్ లోని మూడు అణు స్థావరాలే లక్ష్యంగా శక్తివంతమైన బంకర్ బ్లస్టర్ బాంబులను ప్రయోగించింది. అనంతరం.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటించారు. కాసేపటికి.. ఇరాన్, ఇజ్రాయెల్ కూడా అధికారికంగా ప్రకటించాయి! ఈ సమయంలో.. ట్రంప్, నెతన్యాహుపై ఫత్వా జారీ అయ్యింది!

Tags:    

Similar News