కోహ్లీ (X) ప్రేమానంద్: వందల కోట్ల ఆస్తిపరుడు స్వామీజీని 5కోట్లు అడిగాడా?
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల బృందావన్‌లోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి 5 కోట్లు డిమాండ్ చేసారంటూ ప్రచారం సాగుతోంది.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల బృందావన్‌లోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి 5 కోట్లు డిమాండ్ చేసారంటూ ప్రచారం సాగుతోంది. అయితే దీనిని కోహ్లీ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఆ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. కోహ్లీ ఆశ్రమ సందర్శన వెనుక ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని.. ఇది పూర్తిగా నిరాధారమైన వార్త అని తేల్చిచెప్పారు.
శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్షణన్యాస్ అధ్యక్షుడు దినేష్ శర్మ (ఫలహారీ మహారాజ్) సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఆశ్రమ సందర్శన కోసం ప్రేమానంద్ బృంద సభ్యులు రూ. 5 కోట్లు ఖర్చు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రకటన క్రికెట్ వర్గాలతో పాటు ఆధ్యాత్మిక సర్కిళ్లలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ లాంటి అగ్రశ్రేణి క్రీడాకారుడిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ ఆరోపణలను విరాట్ కోహ్లీ అధికార ప్రతినిధి తీవ్రంగా తప్పుబట్టారు. దినేష్ శర్మ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యాలు, నిరాధారమైనవి.. వాస్తవ విరుద్ధమైనవి! అని మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. కోహ్లీ .. అతడి సతీమణి అనుష్క శర్మ 2023 నుంచి బృందావన్‌లోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రాకపోకలన్నీ కేవలం గురువుపై ఉన్న అచంచలమైన భక్తి, వ్యక్తిగత విశ్వాసం వల్ల మాత్రమే జరుగుతున్నాయని వెల్లడించారు.
ఆధ్యాత్మిక గురువుపై ఉన్న భక్తిని కూడా కొలమానంగా మలచి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని కోహ్లీ బృందం ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేదా వాణిజ్య ప్రచారాల కోసం వారు ఆశ్రమానికి వెళ్లలేదని మరోసారి స్పష్టం చేశారు. కేవలం ఆధ్యాత్మిక శాంతి, గురువుపై ఉన్న గౌరవం కోసమే తాము అక్కడకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మీడియా సంస్థలు, సోషల్ మీడియా యూజర్లు ఇలాంటి సున్నితమైన అంశాలపై తప్పుడు వార్తలను ప్రసారం చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సమాచారాన్ని క్షుణ్ణంగా ధృవీకరించుకున్న తర్వాతే బాధ్యతాయుతంగా వార్తలు ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు. విరాట్ కోహ్లీ వ్యక్తిగత విశ్వాసాలను వివాదాల్లోకి లాగడం మానుకోవాలని కోహ్లీ ప్రతినిధులు కోరారు. విరుష్క దంపతులకు వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పుడు ఇలా ఒక ఆధ్యాత్మిక సంస్థ నుంచి డబ్బును డిమాండ్ చేస్తారని ఎవరైనా భావిస్తున్నారా?