రాహుల్ గాంధీ రైట్ ట్రాక్ లోకి వచ్చారా ?

ఎలాంటి రాహుల్...ఇపుడు ఎలా కనిపిస్తున్నారు. ఇది కదా జనాల్లో అతి పెద్ద చర్చ. ఒకనాడు పప్పు అని తెగ ట్రోల్స్ చేశారు.

Update: 2026-10-07 07:38 GMT

ఎలాంటి రాహుల్...ఇపుడు ఎలా కనిపిస్తున్నారు. ఇది కదా జనాల్లో అతి పెద్ద చర్చ. ఒకనాడు పప్పు అని తెగ ట్రోల్స్ చేశారు. ఇపుడు నిప్పుగా మారి చెరిగేస్తున్న తీరుని చూస్తున్న వారు అంతా అవాక్కు అవుతున్నారు. చెలరేగిపోతున్న దూకుడు చూసి షాక్ తింటున్నారు. గాంధీల వంశం అంటే నాయకత్వానికి పెట్టింది పేరు. అలాంటి చోట పప్పు ట్యాగ్ ఎలా సూట్ అవుతుంది. ఎందుకో రాహుల్ గాంధీ రాజకీయాల మీద సరిగ్గా ఫోకస్ పెట్టకపోవడం వల్లనే అలాంటి ట్రోల్స్ చేయడానికి ప్రత్యర్థులకు చాన్స్ వచ్చింది కానీ రాహుల్ గాంధీ లోపల అసలైన మెటీరియల్ అలాగే ఉంది. ఎంతైనా ఆయన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ మనవడు కదా. దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూకి ముని మనవడు కదా. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న రాజీవ్ గాంధీకి సిసలైన వారసుడు కదా. అందుకే రాహుల్ గాంధీలోని రాటుతేలిన రాజకీయాన్ని కాలం ముసుగు తీసి చూపిస్తూంటే ప్రత్యర్ధులకు నమ్మబుద్ధి కాక దిమ్మ తిరుగుతోంది.

కర్కశ రాజకీయం నుంచే :

ఎవరైనా ధీటుగా సరిసాటిగా ఎదగాలంటే కాల పరీక్షలను తట్టుకుని నిలవాలి. రాహుల్ గాంధీ విషయంలో ఇపుడు అదే జరుగుతోంది. ఆయన రెండు దశాబ్దాలకు పైగా సాగిన రాజకీయ జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఈ స్టేజికి చేరుకున్నారు. తనలోని మాస్ అవతార్ ని ఆయనకు చూపించే చాన్స్ కాలమే ఇచ్చింది. దానితో పాటు ప్రత్యర్థులు కూడా ఇచ్చారు. రాహుల్ ని టార్గెట్ చేసి కార్నర్ చేసి సాగించిన కర్కశ రాజకీయమే ఆయనకు కఠినమైన గుణపాఠాలను నేర్పించింది. వాటి నుంచి నేర్చుకుంటూ రాహుల్ ఈ రోజు అత్యంత బలమైన కూటమి ఎన్డీయేని ఢీ కొట్టేందుకు అంతెత్తున తాను నిలిచి జనానికి కనిపిస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన ర్యాలీలో బారికేళ్ళను దాటుకుని వాటి మీదనే నిలబడి ధీమాగా కనిపించిన రాహుల్ గాంధీని ఈ దేశంలో ప్రతిపక్ష నాయకత్వానికి ఒక శక్తివంతమైన చిహ్నంగా చూడాల్సి ఉంటుంది.

నిలబడి కలబడి :

వెన్ను చూపి పరుగు తీయడం ఎప్పుడూ నాయకత్వ లక్షణం కాదు, నిలబడి కలబడితేనే అది రాణిస్తుంది. జనాల నీరాజనాలను అందుకుంటుంది. రాహుల్ గాంధీ రాజ ప్రసాదాల నుంచి దిగి వచ్చిన మొదట్లో పప్పు అని అంటే అని ఉండొచ్చు. కానీ సగటు మనిషిగా మారి పాదయాత్ర చేసిన చోట, తాను కొలిచిన నేల సమస్తం ఆయనకు అందించిన అవగాహనతో సమగ్రమైన రూపంగా మారిన వేళ ఆయన ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవతరించారు. ఇపుడు మరింత దూకుడు చేస్తూ సాగిస్తున్న పోరాటం కొత్త అంకానికి శ్రీకారం చుడుతోంది. గత రెండేళ్లకు పైగా పాలక పక్షం తీరు మీద అలుపెరగని తీరులో రాహుల్ సాగిస్తున్న పోరాటాన్ని చూస్తున్న వారు అంతా అంటున్న ఒకే మాట రాహుల్ రైట్ ట్రాక్ లోకి వచ్చారు అని. ముల్లుని ముల్లుతోనే కోయాలి. రాజకీయాన్ని రాజకీయంతోనే చెక్ పెట్టాలి. ఈ సూత్రం తెలియడానికి రాహుల్ కి ఎక్కువ సమయం పట్టిందేమో తెలియదు కానీ ఇపుడు మాత్రం ఆయనకు ఒడుపూ విడుపూ అన్నీ అర్ధమైపోయాయి. తాను కార్నర్ కావడం కాదు, ఎక్కడ గురి చూసి కొడితే అధికార పక్షం కకా వికలై విలవిలలాడుతుందే నేర్చిన నేర్పరిగా రాహుల్ గాంధీ కరెక్ట్ గానే టార్గెట్ చేస్తున్నారు. అందులో సక్సెస్ కూడా అవుతున్నారు.

ఆల్టర్నేషన్ లీడర్ గా :

రాజకీయాల్లో ఎపుడూ శూన్యత ఉండదు, అవకాశాలు ఎన్నో ఉంటాయి. వాటిని వెతుక్కుంటారు నాయకులు. ఇపుడు రాహుల్ గాంధీ చేస్తున్నది అదే. తన పోరాటాన్ని ఏ బారికేడ్లూ నిలువరించలేవు అంటూ వాటిని ఛేదించుకుని నిలువెత్తుగా నిలబడిన రాహుల్ గాంధీలోని డేరింగ్ డైనమిక్ లీడర్ షిప్ ని ఇపుడు దేశమంతా చూస్తోంది. మూడు దఫాలుగా అధికారంలో ఉంటూ యాంటీ ఇంకెంబెన్సీని మూటకట్టుకుంటూ ఆ బరువుతో తానే తగ్గిపోతూ పడుతూ లేస్తూ సాగుతున్న ఎన్డీయే ప్రస్థానానికి సరైన సమయంలో చెక్ పెట్టడానికి ఒక పవర్ ఫుల్ ఆల్టర్నేషన్ గా రాహుల్ గాంధీ ఎమర్జ్ అవుతున్నారు అన్నది అయితే రాజకీయ విశ్లేషణగా ఉంది. రాహుల్ తగ్గకు ఎక్కడా ఆగకు, ఇదే దూకుడుతో ముందుకు సాగాల్సిందే అంటూ జనాల నుంచి వినవస్తున్న నినాదాలు ఆయనలో కొత్త జోష్ నే కలిగిస్తున్నాయి. అందుకే రాహుల్ ఇపుడు ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. ఇది అంతం కాదు ఆరంభం అంటూ సాగుతున్న ఆయన జోరుని చూసిన ప్రత్యర్ధులు అయితే గుర్రం ఎగరాగలదు అన్న పాత ముతక సామెతను గుర్తు చేసుకోవాల్సి వస్తోంది.

Tags:    

Similar News