స్థానికంపై అనుమానం వద్దు.. ఈ నెలలోనే మున్సిపోల్స్?

గత శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ రోజు లేదా రేపు అంటే అక్టోబరు 7 లేదా 8వ తేదీల్లో బెంచ్ ముందు విచారణకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Update: 2026-10-07 07:37 GMT

ఏపీలో స్థానిక ఎన్నికలపై చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే సందిగ్ధావస్థ ఎక్కువ మందికి నిద్ర పట్టనీయడం లేదు. అక్టోబరులోనే ఎన్నికలు అంటూ ఒకవైపు ప్రభుత్వం చెబుతుండగా, బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేవరకు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న సమాచారంతో గందరగోళం నెలకొందని అంటున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియ మొదలు అవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలు ఎన్నికలకు రెడీ అవుతుండగా, ప్రతిపక్ష నేతలు మాత్రం ఎన్నికలు వాయిదా పడాలనే కోరుకుంటున్నారని అంటున్నారు.

స్థానిక ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. స్థానిక ఎన్నికల నిర్వహణకు పలు అవాంతరాలు ఎదురవుతుంగా, ప్రభుత్వం కోర్టుల సాయంతో ఒక్కొక్కటి అధిగమిస్తూ వస్తోంది. ప్రధానంగా సర్ ప్రక్రియ కొనసాగుతుండగా, ఎన్నికలు నిర్వహించొద్దు అంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టులు కొట్టివేయడంతో స్థానిక పోరుకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల పెంపు చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అక్కడ నిర్ణయం వచ్చేవరకు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని అంటున్నారు. అయితే దీనిపైనా ప్రభుత్వ వర్గాల నుంచి అధికార పార్టీ నేతలకు స్పష్టమైన సమాచారం వెళ్లిందనే ప్రచారం ఎన్నికల దిశగా వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే విషయాన్ని రుజువు చేస్తోందని అంటున్నారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. గత శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ రోజు లేదా రేపు అంటే అక్టోబరు 7 లేదా 8వ తేదీల్లో బెంచ్ ముందు విచారణకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి, హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని అంటున్నారు. అదే సమయంలో పిటిషన్ ను తిరస్కరించినా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయాన్ని అమలులోకి తెస్తారని అంటున్నారు. ఏ విధంగానైనా ఈ వారాంతం నాటికి సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడుతుందని, ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేలా రెడీగా ఉండాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపిందని చెబుతున్నారు.

వాస్తవానికి సెప్టెంబరులోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. కోర్టు అడ్డంకుల కారణంగా ఈ ప్రక్రియను అక్టోబరుకు వాయిదా వేయాలని నిర్ణయించింది. అక్టోబరు తొలివారం కూడా పూర్తవడం, మరోవైపు సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల అంశం పెండింగులో ఉండటం కారణంగా ఎన్నికలు జరుగుతాయా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అక్టోబరు రెండో వారంలో సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడితే, మూడో వారంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసి నాలుగో వారంలో షెడ్యూల్ విడుదల చేసేలా అడుగులు వేస్తోందని అంటున్నారు. ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. చివర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి తాజా పరిణామాలు గమనిస్తే అక్టోబరు చివరి వారం నుంచి డిసెంబరు 15వ తేదీలోగా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని చెబుతున్నారు.

Tags:    

Similar News