ఎగ్జిట్ పోల్స్ నిజమైతే బీజేపీని ఆపతరమా ?
దేశంలో 2026 రాజకీయ ప్రత్యేకత ఏమిటి అంటే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. ఈ అయిదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 109 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.;
దేశంలో 2026 రాజకీయ ప్రత్యేకత ఏమిటి అంటే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. ఈ అయిదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 109 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లలో ఐదవ వంతు. ఇరవై శాతం సీట్లు అని కూడా చెప్పాలి. అందుకే ఈ ఎన్నికలను మినీ సమరం అని కూడా విశ్లేషకులు అభివర్ణించారు. ఇక ఈ అయిదు రాష్ట్రాలలో విభిన్న పార్టీలు అధికారంలో ఉంటూ మరోసారి ప్రజా తీర్పు కోరాయి. వాటి జాతకాలను జనాలు తేల్చేశారు. ఈవీఎంలలో అవి నిక్షిప్తం అయి ఉన్నాయి. మే 4న ఫలితాలు వస్తాయి. ఈలోగా ఎగ్జిట్ పోల్స్ సంబరం మొదలైంది వాటి ఫలితాలను చూసి కూడా ఘాటైన విశ్లేషణలు చేస్తున్నారు.
బీజేపీకి లాభమే :
ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎటు నుంచి ఏమైనా బీజేపీకి రాజకీయ లాభమే అని చెబుతున్నారు. అది ఎలా అంటే అస్సాంలో బీజేపీ డ్యాం ష్యూర్ గా అధికారంలోకి వస్తుందని ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అలాగే పాండిచ్చేరిలో కూడా ఎన్ డీయే తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశాయి. నిజానికి ఈ రెండు తప్ప బీజేపీ చేతిలో మిగిలిన మూడు రాష్ట్రాలు లేవు. కేరళలో ఒక్క ఎమ్మెల్యే 2016 లో ఉంటే 2021 లో అది కూడా లేకుండా పోయింది. తమిళనాడులో మూడు ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో 78 మంది గెలిచారు. ఇది ఎన్నికల ముందు సినారియో.
బలం పెరిగినట్లేనా :
ఇక ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దాని బట్టి చూస్తే తమిళనాడులో మూడు ఎమ్మెల్యే సీట్లూ బీజేపీకి మరోసారి దక్కుతాయని అంటున్నారు వస్తే ఒకటి రెండు రావచ్చు అని ఉంది. సో అక్కడ రాజకీయంగా బలం పెరిగినట్లే అని అంటున్నారు. అలాగే కేరళలో ఈసారి ఖాతా బీజేపీ తెరుస్తుంది అని అంటున్నారు. కనీసం మూడు సీట్లు అయినా వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దాంతో అక్కడ కూడా బీజేపీకి పొలిటికల్ గా ప్లస్ అవుతుంది అని అంటున్నారు.
బెంగాల్ లో సైతం :
ఇక బెంగాల్ లో బీజేపీ ఓడితే వంద సీట్లు గెలిస్తే 150 నుంచి 160 సీట్లు అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇవే తీరున ఫలితాలు వస్తే మాత్రం బీజేపీకి రాజకీయంగా కలసి వచ్చినట్లే అని అంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ కోటానే బీజేపీ బద్ధలు కొట్టి గెలిచింది అంటే బీజేపీకి రాజకీయంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత సంబరమే అని అంటున్నారు బీజేపీ కోరిక కూడా అదే. బెంగాల్ ని కొట్టాలని. ఈసారి ఊపు చూస్తే అది కూడా జరిగే వీలుదని అంటున్నారు. బీజేపీకి కూడా ఒక అంచనా ఉంది. తమిళనాడు కేరళలలో ఫలితాలు పెద్దగా అధికారం వైపుగా సాగవని. కానీ బెంగాల్ లో అలా లేదు. ఈసారి కొట్టి తీరుతామని కసితో బీజేపీ బరిలోకి దిగింది దాంతో బెంగాల్ గెలిస్తే కనుక బీజేపీని ఎవరూ ఆపలేరనే అంటున్నారు.
వరుసగా అక్కడ కూడా :
గత ఏడాది బీహార్. ఈ ఏడాది బెంగాల్ ఇదీ బీజేపీ టార్గెట్. దాంతో బెంగాల్ ని బీజేపీ గెలిస్తే ఈ మొత్తం మినీ ఎన్నికల సమరంలో జాక్ పాట్ కొట్టిన పార్టీగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా బీజేపీయే నిలుస్తుంది అని అంటున్నారు. అదే సమయంలో 2027లో జరిగే గుజరాత్ ఉత్తర ప్రదేశ్ లను ఇదే దూకుడుతో మరోసారి బీజేపీ గెలిచేందుకు కూడా కొండంత బలం దక్కుతుంది. ఇక దేశ రాజకీయాల్లో మధ్యే వాద పార్టీలకు బలమైన ప్రాంతీయ పార్టీలకు కూడా బీజేపీ చెక్ పెట్టేసినట్లే అని కూడా చెబుతున్నారు. సో ఒక్క బెంగాల్ ఫలితంతో బీజేపీ రాజకీయ పరుగు ఆపడం ఎవరి తరం కాదని అంటున్నారు. మరి బెంగాల్ లడ్డూ బీజేపీకి దక్కుతుందా లేదా అన్నది మే 4న తేలిపోతుంది.