రక్తలేఖలు రాసి బెదిరించారు...మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్య

లక్ష్మీనారాయణ ప్రసంగం ఇపుడు సంచలనంగా మారింది. తను విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఎవరు బెదిరించారు? దాన్ని వారు ఎలా ఎదుర్కొన్నారు? అని నెటిజన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.;

Update: 2025-12-05 07:33 GMT

రక్తంతో బెదిరింపు లేఖ రాశారు...నీ అంతు చూస్తామని బెదరించారు...కానీ వాటికి బెదరక నా ఉద్యోగ కర్తవ్యం నేను నిర్వర్తించాను అంతే. అప్పటికీ ఇప్పటికీ నాకు భగవద్గీతే ప్రామాణికం. కర్తవ్య నిర్వహణపైనే నా దృష్టి...పనులు మంచివి అయినపుడు పరిణామాలకు బెదరాల్సిన అవసరం లేదంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కర్నూలు లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వేల మంది పైచిలుకు విద్యార్థులు కలిసి భగవద్గీత 15వ అధ్యాయంలోని 20 శ్లోకాలు పఠించారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ తన ఉద్యోగ కాలంలో ఎదుర్కొన్న పలు సవాళ్ళను విద్యార్థులకు వివరించారు. తాను వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నారో వివరించారు. కర్మణ్యే వాధికారస్య అన్న మాటకు ఉన్న విలువను అందరూ గుర్తించాలని హితవు పలికారు.

లక్ష్మీనారాయణ ప్రసంగం ఇపుడు సంచలనంగా మారింది. తను విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఎవరు బెదిరించారు? దాన్ని వారు ఎలా ఎదుర్కొన్నారు? అని నెటిజన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గురించి సెర్చి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జేడీ లక్ష్మినారాయణగా ప్రసిద్ధిపొందిన వాసగిరి లక్ష్మీనారాయణ కర్నూలు జిల్లా శ్రీశైలంలో జన్మించారు. సివిల్ సర్వీసు పరీక్ష ఉత్తీర్ణులై మహారాష్ట్ర కేడర్ ఐ.పి.ఎస్ అధికారిగా నాందేడ్ లో ఎస్పీ గా పనిచేశారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో విధులు నిర్వర్తించారు. 2006 జూన్ 12 నుంచి హైదరాబాదు లో డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాద్ విభాగంలో జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించారు.

లక్ష్మీనారాయణ ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి కర్ణాటక ఎంపీ గాలి జనార్దనరెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డీలను అరెస్టు చేసి వార్తల్లో నిలిచారు. ఇదే సమయంలో జగన్‌ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, అప్పటి మంత్రి మోపిదేవి వెంకట రమణ తదితరులతోపాటు కడప ఎంపీ జగన్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

గాలి జనార్దన్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి కేసుల సందర్భంగా చాలా మంది లక్ష్మీనారాయణను హీరోగా అభివర్ణించారు. మీడియా హైప్ విపరీతంగా లభించింది. ఆంధ్రలో ఏకంగా లక్ష్మీనారాయణ కటౌట్ పెట్టి మరీ సంచలనం రేకెత్తించారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ సీబీఐ నుంచి స్వచ్చందంగా పదవీ విరమణ చేసి రాజకీయాల్లో ప్రవేశించారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు తనకు లభించిన క్రేజీని నమ్ముకున్న లక్ష్మీనారాయణకు రాజకీయాల్లో అంతగా కలిసి రాలేదు. 2018 నవంబరులో లోక్‌సత్తా పార్టీలో చేరమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఆహ్వానించినా కాదని జనసేన పార్టీలో చేరాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించాడు..

Tags:    

Similar News