బీజేపీకి ఇథనాల్ రెడ్ సిగ్నల్ అవుతుందా ?
పెట్రోల్ లో ఇథనాల్ మిక్సింగ్ అన్నది దేశంలోని కోట్లాదిగా ఉన్న వాహనదారులలో భయాందోళనలను పెంచుతోంది.
పెట్రోల్ లో ఇథనాల్ మిక్సింగ్ అన్నది దేశంలోని కోట్లాదిగా ఉన్న వాహనదారులలో భయాందోళనలను పెంచుతోంది. తమ వాహనాలు పాడైపోతాయని వారంతా కలవరం చెందుతున్నారు. సామాన్యుడి సాధనంగా మారిన బైకుల దగ్గర నుంచి ఉన్నత వర్గాల ఖరీదైన కార్ల వరకూ ఇథనాల్ భయం పట్టుంది. పెట్రోల్ లో ఇథనాల్ కలిపితే తమ వాహనాలు గోవిందా అని అంటున్నారు. అయితే ఇవన్నీ ఊరకే కంగారు తప్పించి అలాంటిది ఉండదని కేంద్ర ప్రభుత్వం తాపీగా ఇస్తున్న జవాబులు అయితే ఎవరికీ స్వాంతన కలిగించడం లేదు. మరో వైపు చూస్తే వాహనాలకు డేంజర్ అన్నది నిజం అని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఇక జనాలు కూడా తన సొంత అనుభవం ద్వారా తెలుసుకుంటున్నారు.
మంచి ఉద్దేశ్యంతో కానీ :
కేంద్రం అయితే ఒక మంచి ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పెట్రోల్ దిగుమతుల మీద ఆధారపడకుండా భారీగా తగ్గుతుందని అలాగే పర్యావరణానికి మేలు జరుగుతుందని మరో వైపు రైతులకు కూడా ప్రయోజనంగా ఉంటుందని భావిస్తోంది. కానీ ఇక్కడే ప్రజల మనోభావాలు భిన్నంగా ఉన్నాయి. ఈ రోజున దేశంలోని రోడ్ల మీద తిరిగే అత్యధిక వాహనాలు పెట్రోల్ లో ఇధనాల్ మిక్సింగ్ చేస్తే తట్టుకునే కెపాసిటీలో లేవు. అవి దెబ్బతినిపోతాయి అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాత కార్లలో ఫ్యూయెల్ పైపులు రబ్బర్ భాగాలు ఇంజన్ కంపోనెంట్ల మీద పెట్రోల్ లో కలిసిన ఇథనాల్ ప్రభావం అధికంగా ఉంటుందని అంటున్నారు.
ఇథనాల్ పవర్ తక్కువ :
ఇక పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ పవర్ చాలా తక్కువ అంటున్నారు. చోదక శక్తి తక్కువగా ఉండడం వల్లనే వాహనాల మైలేజ్ మీద అది తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఒక లీటర్ పెట్రోల్ లో ఇథనాల్ ని మిక్స్ చేస్తే మొత్తం మైలేజ్ లో 30 నుంచి 35 శాతం తక్కువ వస్తుందని వివరిస్తున్నారు. ఇథనాల్ ని తట్టుకునే విధంగా వాహనాలను రూపొందించినవి కాకపోతే ఏకంగా వాహనాలకే నష్టం వస్తుంది అని అంటున్నారు. ఈ రోజున దేశంలో 2022 కంటే ముందు నాటి వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. 2022 తరువాత డిజైన్ చేసిన వాహనాలు అన్నీ కూడా ఇథనాల్ ని తట్టుకోగలవని అంటున్నారు.
పెట్రోల్ 170 అంటే ఎలా :
ఈ నేపధ్యంలో తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీ ఇథనాల్ తో మిక్స్ చేసిన పెట్రోల్ వద్దు అనుకుంటే ప్యూర్ పెట్రోల్ ని 170 రూపాయలు లీటర్ కి పెట్టి కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. ఆయన చెప్పినది బాగానే ఉన్న సామాన్యుడు అంత ధర పెట్టి పెట్రోల్ ఎలా కొనుగోలు చేయగలరు అన్నది ప్రశ్నగా ఉంది. ప్రభుత్వం అయితే ఈ విషయంలో అమలు చేసేందుకే చూస్తోంది తప్ప సామాన్యుల కష్టాలు పట్టించుకోవడం లేదు అన్న భావన అయితే వ్యక్తం అవుతోంది.
ముందుగా వాటితోనే :
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిదానంగా ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. ముందుగా 2022 తరువాత కొన్న వాహనాలకు వీటిని వాడేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఆ మీదట దశల వారీగా మిగిలిన వాహనాలను కూడా ఆ దిశగా మళ్ళించేందుకు తగిన ఆర్థిక సాయం చేయడం ద్వారా ఒక నిర్దిష్టమైన కాలపరిమికి మొత్తం దేశంలో ఇథనాల్ మిక్సింగ్ తో నడిచే వాహనాలను తీసుకుని రావచ్చు అని అంటున్నారు. అలా కాకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజల ఆగ్రహానికి గురి కావచ్చు అని అంటున్నారు.
నటుడు నరేష్ హాట్ కామెంట్స్ :
ఇదిలా ఉంటే బీజేపీలో ఒకనాడు గట్టిగా పనిచేసిన సినీ నటుడు నరేష్ అయితే ఈ విధంగా దూకుడుగా ఇథనాల్ మిక్సింగ్ తో పెట్రోల్ ని మార్కెట్ లో అమ్మకానికి పెట్టడం వల్ల బీజేపీకే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని అన్నారు. బీజేపీ ఇప్పటికే 2024 ఎన్నికల్లో పూర్తి మెజారిటీని సాధించేలేదని ఆయన గుర్తు చేశారు. ఇదే తీరున సాగితే సగటు జనాల నుంచి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. బ్రెజిల్ లాంటి చిన్న దేశాలు కూడా దశలవారీగా ఇథనాల్ వినియోగాన్ని అమలు చేశాయని ఆయన గుర్తు చేశారు. మొత్తానికి నరేష్ తాజా పోస్టింగ్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీజేపీకి ఇథనాల్ రెడ్ సిగ్నల్ అవుతుందా అంటే దేశంలో సగటు మనిషి బైక్ కి షాక్ ఇస్తే అది బీజేపీ రాజకీయానికి బ్రేక్ వేస్తుందన్న రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.