అమెరికాలో ఉన్నానా.. ఆంధ్రాలో ఉన్నానా? లోకేశ్ భావోద్వేగం!

డల్లాస్ లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే టీమ్ - 11 (వైసీపీ)కి నిద్ర పట్టదని లోకేశ్ వ్యాఖ్యానించారు.;

Update: 2025-12-07 08:20 GMT

టీడీపీ యువనేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ కు డల్లాస్ లో తెలుగు ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. డల్లాస్ లో తనకు లభించిన స్వాగతం పట్ల ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అమెరికాలో తెలుగువాళ్ల ఉత్సాహం, కార్యకర్తలను చూస్తే తాను అమెరికాలో ఉన్నానా? ఆంధ్రాలో ఉన్నానా? అనే అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు. తాను అమెరికాలో చదువుకున్నానని, ఇక్కడే ఉద్యోగం కూడా చేశానని కానీ అప్పట్లో లేని ఆనందం... ఇప్పుడు తెలుగువారి అభిమానం చూస్తుంటే కలుగుతోందని అన్నారు.

డల్లాస్ లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే టీమ్ - 11 (వైసీపీ)కి నిద్ర పట్టదని లోకేశ్ వ్యాఖ్యానించారు. మీ ఉత్సాహం, జోష్ చూస్తుంటే యువగళం రోజులు గుర్తుకువస్తున్నాయని అన్నారు. ఆ నాడు ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్లానని, ఆ ధైర్యం మీరిచ్చిందేనని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా, అమెరికాలో స్థిరపడిన చాలా మంది తనకు ధైర్యమిచ్చారని, మద్దతుగా నిలిచారని, వారందరినీ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.

ప్రతిపక్షంలో ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసి 53 రోజులు జైలులో పెడితే, అమెరికాలో ఆంధ్రులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి అండగా నిలబడ్డారని, డల్లాస్ లోనే మూడు సభలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆ రోజు మీరు అండగా నిలబడినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని, కొండంత ధైర్యం ఇచ్చారని లోకేశ్ తెలిపారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాల శక్తి ఎన్టీఆర్ అయితే, అభివృద్ధికి సీబీఎన్ బ్రాండ్ అంబాసిడరుగా నిలిచారన్నారు. అభివృద్ధితో గెలవొచ్చని చంద్రబాబు నిరూపించారన్నారు.

హైదరాబాదుకు ఐటీని తీసుకువచ్చి బెంగళూరుకు దీటుగా నిలబెట్టారన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిశ్రమతో హైదరాబాద్ బాగా అభివృద్ది చెందుతోందన్నారు. అప్పట్లో కంప్యూటర్లు కూడు పెడతాయా? అని ప్రశ్నించారని, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా కంప్యూటర్లు అన్నం పెడతున్నాయో లేదో చెప్పాలన్నారు. ఇక గతంలో చంద్రబాబు ఐటీని ప్రోత్సహిస్తే, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి పిలుపునిస్తున్నారన్నారు. చంద్రబాబు వయసు 75 ఏళ్లు, ఆయన 25 ఏళ్ల యువకుడిలా పరిగెడుతున్నారు. తాను మాత్రం ఆయనతో పోటీ పడలేకపోతున్నానని లోకేశ్ వ్యాఖ్యానించారు.

డల్లాస్ సభ ఆద్యంతం హుషారుగా సాగింది. తెలుగు ప్రవాసులు కేకలు, అరుపులతో హడావుడి చేశారు. వారి ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసిన మంత్రి లోకేశ్ పులికించిపోయారు. తాను అమెరికాలో ఉన్నానా? ఆంధ్రాలో ఉన్నానా? అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించడం చూస్తే అతిశయోక్తి ఏమీ కాదని అంటున్నారు. డల్లాస్ విమానాశ్రయంలో లోకేశ్ కు స్వాగతం పలకడానికి వేలాది మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు వచ్చారు. దీంతో పోలీసులు విమానాశ్రయంలోనే లోకేశ్ ను నిలిపేశారు. మీ కోసం చాలా మంది వచ్చారని, వారితో కలిసి ర్యాలీ చేయడానికి అనుమతి లేదని చెప్పారు. ఈ సంఘటన చూసిన తర్వాత లోకేశ్ అమెరికా పర్యటన ఎంత ఉద్విగ్నంతో ప్రారంభమైందో అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News