విమానంలో 450 మంది... గాల్లో ఇంజిన్ ఆగిపోయింది.. ఏమి జరిగింది!
అవును... గత నెలలో న్యూయార్క్ కు బయలుదేరిన ఎమిరేట్స్ విమానం గాల్లో ఉండగా ఊహించని సమస్య ఎదురైంది.;
ఇటీవల తెరపైకి వస్తోన్న విమానాల్లో సాంకేతిక సమస్యలకు సంబంధించిన విషయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ.. సుమారు 450 మంది ప్రయాణికులతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల విమానం దుబాయ్ నుంచి అమెరికాకు బయలుదేరగా.. గమ్యస్థానం ఇంకా రెండు గంటలకు పైగా ఉందనగా ఓ ఇంజిన్ ఆగిపోయింది. అయినప్పటికీ గమ్యస్థానాన్ని చేరుకుంది!
అవును... గత నెలలో న్యూయార్క్ కు బయలుదేరిన ఎమిరేట్స్ విమానం గాల్లో ఉండగా ఊహించని సమస్య ఎదురైంది. అయినప్పటికీ సేఫ్ ల్యాండ్ కావడంపై ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా జరిగిందని నివేదికలు వెలువడ్డాయి. ఎయిర్ బస్ ఏ380 ద్వారా నడపబడుతున్న డబుల్ డెక్కర్ క్వాడ్ జెట్ ఇంజిన్ షట్డౌన్ తర్వాత అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... ఎమిరేట్స్ విమానం ఏకే203 అనేది మిడిల్ ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి క్రమం తప్పకుండా షెడ్యూల్ చేయబడిన వాణిజ్య ప్రయాణీకుల విమానం. దీని గమ్యస్థానం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్ జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం. ఈ మార్గంలో ఎమిరేట్స్ నడుపుతున్న రెండు రోజువారీ విమానాలలో ఇది ఒకటి.
ఈ క్రమంలో... ఏవియేషన్ హెరాల్డ్ నివేదించిన ప్రకారం.. ఈ సంవత్సరం జూన్ 28న ఎమిరేట్స్ విమానం దుబాయ్ నుంచి బయలుదేరిన తర్వాత అమెరికాలో ల్యాండ్ అవ్వడానికి రెండు గంటల వరకు అంతా సాధారణంగానే ఉంది. అయితే.. సడన్ గా ఎదురైన ఒక సమస్య కారణంగా సిబ్బంది అవుట్ బోర్డ్ ఎడమ చేతి ఇంజిన్ ను ఆపివేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.
ఈ సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అనంతరం విమానాన్ని దారి మళ్లించి, సమీపంలోని విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తుందేమోననే చర్చ మొదలవ్వగా.. విమానం మూడు ఇంజిన్లతో మిగిలిన ప్రయాణాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. మళ్లింపు అవసరం రాలేదు. ఇది నిజంగా గొప్ప విషయమే అని చెబుతున్నారు!
ఈ క్రమంలో సుమారు 13 గంటల 43 నిమిషాల ప్రయాణం అనంతరం ఎమిరేట్స్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఒక ఇంజిన్ ఆపివేయబడినా, ఇంకా ఉన్న మూడు ఇంజిన్ లతో ఇది సాధ్యమైందని చెబుతున్నారు. ఇదే సమయలో... ఏ350లు, బోయింగ్ 777లు వంటి రెండు ఇంజిన్లు మాత్రమే ఉన్న విమానాలు అయితే ఇలాంటి సమయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాయని చెబుతున్నారు.