ఏమిటీ ఎప్ స్టీన్ సెక్స్ స్కాం? మస్క్ ఇప్పుడేమన్నారు?
తాజాగా ఆయన ఎక్స్ లో పెట్టిన పోస్టు షాకింగ్ గా మారింది. ‘‘పెద్ద బాంబు లాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎప్ స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు ఉంది.;
రెండు కత్తులు ఒక ఒరలో పట్టవంటారు. అందుకు భిన్నంగా ప్రపంచంలోనే ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తుల మధ్య కుదిరిన స్నేహం ఎప్పుడైనా విచ్ఛిన్నమవుతుందన్న అంచనాలకు తగ్గట్లే.. ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య ఉన్న మిత్రత్వం కాస్తా శత్రుత్వంగా మారుతున్న పరిస్థితి. దీనికి తగ్గట్లే తాజా పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి. నిజానికి ఈ ఇద్దరి మైండ్ సెట్ లు అంచనా వేయలేనంత విలక్షణంగా ఉండటం తెలిసిందే.
తన మాటలతో ప్రపంచానికి అదే పనిగా షాకులిస్తున్న ట్రంప్ కే ఉలికిపాటు తెచ్చేలా మస్క్ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఎక్స్ లో పెట్టిన పోస్టు షాకింగ్ గా మారింది. ‘‘పెద్ద బాంబు లాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎప్ స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు ఉంది. అందుకే.. ఆ ఫైల్స్ వివరాల్నిబయటపెట్టటం లేదు’’ అని పేర్కొన్నారు. మస్క్ పెట్టిన పోస్టు ప్రపంచానికే కాదు.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ అయిన ట్రంప్ ను డిఫెన్స్ లో పడేలా చేసిందని చెప్పాలి.
‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’ వ్యవహారంలో తాను మస్క్ తీరుతో విసిగినట్లుగా ట్రంప్ మీడియాకు చెప్పిన గంటల వ్యవధిలోనే మస్క్ ఈ పోస్టు చేయటం గమనార్హం. అంతేకాదు.. ట్రంప్ ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ ఒప్పుకున్న వైనం మరో సంచలనానికి తెర తీసినట్లైంది. ఇంతకూ మస్క్ పోస్టులో పేర్కొన్న ఎప్ స్టీన్ ఫైల్స్ ఏమిటి? ఈ స్కాం ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
అమెరికాలో సంచలనాన్ని క్రియేట్ చేసిన జెఫ్రీ ఎప్ స్టీన్ సెక్స్ స్కాంకు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం.. ఆ ఫైల్స్ లో ఎప్ స్టీన్ కాంటాక్ట్ లిస్టు.. ఫ్లైట్ లాగ్ లు.. అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. ఇంతకూ అసలీ కుంభకోణం ఏమిటి? దానికి సంబంధించిన అంశాలేమిటి? జెఫ్రీ ఎప్ స్టీన్ ఎవరు? ఇప్పుడు అతను ఎక్కడ? లాంటి వివరాల్లోకి వెళితే..
కొన్నేళ్ల క్రితం ఎప్ స్టీన్ సెక్స్ స్కాం అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసింది. ఈ మొత్తం స్కాంను క్లుప్తంగా చెప్పాలంటే.. మధ్యతరగతి బాలికలు.. మహిళలకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా.. న్యూయార్క్.. వర్జిన్ ఐలాండ్స్.. మెక్సికోలోని ఇళ్లకు పిలిచి అఘాయిత్యాలకు పాల్పడేవారు. ఇందులో పేరు మోసిన రాజకీయ నాయకులు.. వ్యాపారవేత్తలు.. సెలబ్రిటీలు.. ప్రముఖులు ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాదు.. ఈ బాధితులకు కొంత డబ్బులు ఇచ్చి.. మరో అమ్మాయిని తమ బంగ్లాకు తెచ్చిన పక్షంలో కొంత కమిషన్ కుడా ఇస్తానన్న ఆశ చూపేవారు. సుమారు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం తొలిసారి 2005లో బయటకు వచ్చి.. పెను సంచనలంగా మారింది. అప్పడు నిందితుడ్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆ తర్వాత 2019లో మీటూ ఉద్యమ సమయంలోనూ అతడ్ని అరెస్టు చేశారు. జైల్లో ఉండగా అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే.. దీన్ని సూసైడ్ గా పోలీసులు నిర్దారించారు. ఎప్ స్టీన్ మాజీ స్నేహితురాలు మాక్స్ వెల్ల ఈ దారుణాలకు సహకరించినట్లుగా తేలటంతో ఆమెకు ఇప్పటికే 20 ఏళ్ల జైలుశిక్ష పడింది.
ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. ఎప్ స్టీన్ వినియోగించే ప్రైవేట్ జెట్ కు సంబంధించిన లాగ్స్ లో పలువురు ప్రముఖల పేర్లు బయటకు రావటం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ దారుణాలకు చెందిన కొన్ని కీలక పత్రాల్ని ఆ దేశ న్యాయ వ్యవస్థ విడుదల చేసింది. ది ఎప్ స్టీన్ ఫైల్స్.. ఫేజ్ 1గా పేరు పెట్టి విడుదల చేశారు.
ఇంతకాలం తర్వాత ఈ జాబితాలో డొనాల్డ్ ట్రంప్ పేరు ఉందంటూ మస్క్ బాంబ్ పేల్చాడు. ఈ కారణంతోనే దర్యాప్తులో వెల్లడైన విషయాల్ని ఇప్పటివరకు బయటపెట్టలేదన్నారు. అయితే.. అధ్యక్ష ఎన్నికల వేళ ఎప్ స్టైన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అతడికి చెందిన ప్రైవేటు విమానంలో తాను తిరగలేదని ట్రంప్ చెప్పారు. అందుకు భిన్నంగా ఈ స్కాంలో ట్రంప్ పేరు ఉందని పేర్కొంటూ మస్క్ చేసిన పోస్టు ఇప్పుడు పెను సంచలనమైంది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.