ట్రంప్ ఎఫైర్స్ లొల్లి.. అడ్డంగా బుక్ చేసిన ఎలన్ మస్క్

సోషల్ మీడియా వేదికగా మస్క్ తన ఘాటైన స్పందనను తెలియజేశారు. "జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ట్రంప్ బయటపెట్టకపోతే ప్రజలు ఆయనను ఎలా నమ్మగలరు?" అని ప్రశ్నించారు.;

Update: 2025-07-09 15:27 GMT

అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం "ఎప్‌స్టీన్ ఫైల్స్" వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లైంగిక నేరస్తుడిగా అపఖ్యాతి పాలైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన కీలక పత్రాలను ట్రంప్ ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని మస్క్ సూటిగా ప్రశ్నించారు.

- ఎక్స్ వేదికగా మస్క్ ప్రశ్నలు

సోషల్ మీడియా వేదికగా మస్క్ తన ఘాటైన స్పందనను తెలియజేశారు. "జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ట్రంప్ బయటపెట్టకపోతే ప్రజలు ఆయనను ఎలా నమ్మగలరు?" అని ప్రశ్నించారు. తాను ఇటీవల స్థాపించిన ‘అమెరికా పార్టీ’ అధికారంలోకి వస్తే, ఈ వ్యవహారాన్ని విచారణకు తెచ్చి మొత్తం నిజాన్ని బయటపెడతానని స్పష్టం చేశారు. ప్రజలకు నిజం తెలియాల్సిందేనని, ఇది తన మొదటి అజెండా అవుతుందని ఆయన ప్రకటించారు.

-ట్రంప్ స్పందనపై విమర్శలు

ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఒక విలేకరి ఎప్‌స్టీన్ ఫైల్స్ అంశంపై ట్రంప్‌ను ప్రశ్నించగా ఆయన ఆ ప్రశ్నను తప్పించుకున్నారు. "మీరు ఇంకా ఎప్‌స్టీన్ గురించే మాట్లాడుతున్నారా?" అని తిరిగి ప్రశ్నించడం మస్క్‌కు అసహనాన్ని కలిగించింది. ట్రంప్ సత్యాన్ని దాచిపెడుతున్నారనే అభిప్రాయాన్ని మస్క్ బలంగా వ్యక్తం చేశారు.

-డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) ప్రకటనపై అభ్యంతరాలు

ఇటీవల అమెరికా న్యాయశాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ) ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఎప్‌స్టీన్ నివాసాల్లో సోదాలు జరిగినప్పటికీ క్లయింట్ లిస్ట్ లభించలేదని పేర్కొంది. అంతేకాకుండా ఇకపై ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయబోమని వెల్లడించింది. దీనిపై మస్క్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఎందుకు విచారణను అర్థాంతరంగా ఆపేస్తోందని ప్రశ్నిస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

- బహిరంగమైన పేర్లు

గత ఏడాది న్యూయార్క్ న్యాయస్థానం ఎప్‌స్టీన్ కేసులో 40 రహస్య పత్రాలను విడుదల చేసింది. అందులో అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, సంగీత కళాకారుడు మైఖేల్ జాక్సన్ తదితర ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.

ఎప్‌స్టీన్ కేసు ఇప్పటికీ అమెరికా ప్రజలకు తెలియకుండా దాస్తోన్న అంశం. ట్రంప్, మస్క్‌ల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ విమర్శలు ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యతను కల్పించాయి. నిజంగా ఈ ఫైల్స్ దాచిపెట్టబడ్డాయా, లేదా న్యాయ ప్రక్రియే ఇంతకంటే ముందుకు వెళ్లలేకపోయిందా అన్నది అమెరికా ప్రజలు ఆలోచిస్తున్న ప్రశ్న. అయితే మస్క్ ఈ అంశాన్ని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News